ప్రథమ పౌరుడు.. రేకుల డబ్బాలో జీవనం

ABN , First Publish Date - 2022-05-17T04:32:14+05:30 IST

గ్రామానికి అతను ప్రథమ పౌరుడు..

ప్రథమ పౌరుడు.. రేకుల డబ్బాలో జీవనం
వ్యవసాయ పొలం వద్ద ఏర్పాటు చేసుకున్న రేకుల డబ్బ

  • 40 గజాల్లో ఇంటి నిర్మాణం చేస్తుండగా ఆపిన అధికారులు


కేశంపేట, మే 16 : గ్రామానికి అతను ప్రథమ పౌరుడు.. పల్లె ప్రగతిని నడిపించే నాయకుడు.. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి.. కానీ ఉండటానికి ఇల్లూవాకిలి లేదు. కేశంపేట మండలం కోనాయపల్లిలో రేకుల డబ్బాలో నివాసముంటున్న సర్పంచ్‌ దీన పరిస్థితి.. ప్రభుత్వం పేదరికాన్ని అరికట్టేందుకు అనేక పథకాలు అమలు చేస్తోంది. దివంగత ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రధానంగా గరీబీ హటావో.. పేదలకు రోటీ(అన్నం), కపడ(దుస్తులు), మఖాన్‌(ఇళ్లు) ప్రభుత్వాలు ఇవ్వాలని తరుచూ తన ప్రసంగంలో ప్రస్తావించే వారు. అయినా నేటికీ ఆమె కళ పూర్తిగా నెరవేరలేదనే చెప్పాలి. ఇందుకు ఇల్లు లేక ఊరికి దూరంగా ఓ రేకుల డబ్బాలో జీవనం సాగిస్తున్న సర్పంచ్‌ ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, మండలాల అనంతరం కేశంపేట మండలంలోని కోనాయపల్లి నూతన గ్రామపంచాయతీ ఏర్పడింది. సర్పంచ్‌ ఎన్నికల్లో దళితుడైన బయ్యా మల్లే్‌షను ఆ గ్రామ ప్రజలు సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. ఆయనకు భార్య సుజాత, కుమారులు ప్రణయ్‌(10), యశ్వంత్‌(8) ఉన్నారు. వీరికి వారసత్వంగా ఉన్న చిన్నఇల్లు ఆస్తుల పంపకాల్లో సర్పంచ్‌ తమ్ముడికి ఇచ్చారు. అయితే మల్లేష్‌ తమ్ముడికి ఇచ్చిన ఇంట్లోనే ఓ గదిలో కుటుంబ సభ్యులతో కలిసి ఉండేవాడు. కొన్ని సంవత్సరాల కింద మల్లేష్‌ ఉంటున్న గది కూలిపోవడంతో ఆయన కుటుంబం నివసించడానికి ఇల్లు లేకుండా పోయింది. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం మల్లేష్‌ కొవిడ్‌ బారిన పడ్డాడు. అప్పుడు కొందరు మిత్రులు చికిత్స నిమిత్తం కొంత ఆర్థికసాయం చేయడంతో కొవిడ్‌ మహమ్మారి నుంచి బయటపడ్డాడు. అప్పటికే తనకు సొంతఇల్లు లేకపోవడంతో తన కుటుంబాన్ని పోషించుకునేందుకు తనకున్న 7గుంటల వ్యవసాయ పొలం వద్ద ఓ రేకులడబ్బా వేసుకుని ఇంటిగా మార్చుకున్నాడు. ప్రస్తుతం మల్లేష్‌ తన కుటుంబసభ్యులతో కలిసి రేకుల డబ్బాలో జీవనం సాగిస్తున్నాడు. అయితే మల్లేష్‌ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టినతర్వాత గ్రామానికి దగ్గరగా ఉన్న ప్రభుత్వస్థలంలో కొందరు ఇల్లు నిర్మించుకున్నారు. వారికి అధికారులు సైతం సహకరించారు. ఇటీవల సర్పంచ్‌ మల్లేష్‌ కూడా 40గజాలలో ఇంటి నిర్మాణానికి కొంత ధనం వెచ్చించి అక్కడ పనులు చేపట్టాడు. ఇంతలోనే కేశంపేట మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్‌ ఇంటి నిర్మాణానికి అనుమతులు లేవని అడ్డుకున్నారు. దీంతో ఇంటి పనులు నిలిచి పోవడమే కాకుండా, నిర్మాణానికి ఖర్చు చేసిన రూ.40వేలు కూడా వృథాగా పోయాయని సర్పంచ్‌ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగారు తెలంగాణలో కేవలం 40గజాల ప్రభుత్వస్థలంలో ఒక దళిత సర్పంచ్‌ ఇంటి నిర్మాణం చేసుకుంటుంటే అడ్డుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఒక సర్పంచ్‌ పరిస్థితే ఇలా ఉంటే.. ఇంకా ఇళ్లులేని ఎంతోమంది పేదల పరిస్థితి ఏమిటని స్థానికులు చర్చించుకుంటున్నారు. 



Updated Date - 2022-05-17T04:32:14+05:30 IST