Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

విధ్వంసం.. విలాపం

twitter-iconwatsapp-iconfb-icon
విధ్వంసం.. విలాపంబొందికారి సమీపంలో కాలిబూడిదయిన అటవీప్రాంతం

- అడవుల్లో అగ్నిజ్వాలలు
- కనుమరుగవుతున్న కొండలు
- కకావికలమవుతున్న వన్యప్రాణులు
(హరిపురం)

ఎత్తయిన కొండలు.. దట్టమైన చెట్లు.. అరుదైన వన్యప్రాణులు ఉండే విశాలమైన అటవీ ప్రాంతం.. సిక్కోలు సొంతం. కాగా.. మానవ స్వార్థం, తప్పిదాలు, ప్రకృతి విలాపానికి విలువైన అటవీ సంపద, సహజ వనరులు కనుమరుగవుతున్నాయి. కొండలను తవ్వేస్తూ.. విలువైన చెట్ల సంపదను నరికేస్తుండడంతో అడవుల్లో అగ్నిజ్వాలలు రేగుతున్నాయి. వన్యప్రాణులు జన సంచారంలోకి వస్తూ.. వేటగాళ్ల ఉచ్చుకు బలవుతున్నాయి. ప్రకృతి సంపదను, వన్యప్రాణులను రక్షించాల్సిన అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
----------------
జిల్లాలో అడవులు అంతరించి పోతున్నాయి. కొండలు కనుమరుగవుతున్నాయి. 16 మండలాల పరిధిలో 67,466 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. అత్యంత విలువైన కలప, అటవీ జంతువుల నివాసంగా ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కొంతమంది స్వార్థపరులు అటవీ భూములను ఆక్రమించుకునేందుకు అడవులకు నిప్పు పెడుతున్నారు. ఆపై విలువైన సంపదను కొల్లగొడుతున్నారు. జిల్లాలో గత ఏడాది సుమారు 12వేల హెక్టార్లలో అడవులు అగ్నికి ఆహుతయ్యాయని అధికారులు అంచనా వేశారు. మందస ప్రాంతంలో బుడంబో నుంచి బుడార్సింగి వరకు చిన్నచిన్న కొండలు, అటవీ ప్రాంతాలు నిత్యం అగ్నికి ఆహుతవుతున్నాయి. డబార్సింగి పంచాయితీ పరిధిలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఓ కొండపై దట్టమైన అడవులు కాలి బూడిదయ్యాయి. టెక్కలి, మందస, మెళియాపుట్టి, సారవకోట, జలుమూరు వంటి వివిధ మండలాల్లో విస్తారంగా గ్రానైట్‌ క్వారీ తవ్వకాలు ఏర్పడ్డాయి. పచ్చని కొండల్లో బాంబులు పెట్టి, పెద్ద పెద్ద మిషనరీతో నిలువునా దొలిచేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో కొండలు, పచ్చదనం కనుమరుగవుతున్నాయి. మరోవైపు కొండల్లో కంకర తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. వీటిని నివారించేందుకు అధికారులు మొక్కుబడిగా చర్యలు చేపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.    

జనావాసాల్లోకి జంతువులు..
అటవీ ప్రాంతంలో విలువైన సంపద కాలి బూడిదవటంతో పాటు కొండల్లో తవ్వకాలు వన్యప్రాణులకు ప్రాణసంకటంగా మారాయి. అగ్నిజ్వాలలు కారణంగా ఎండ వేడిమి తట్టుకోలేక.. నీరు లేక విలవిల్లాడుతూ అటవీ జంతవులు మైదాన ప్రాంతాల్లోకి తరలివస్తున్నాయి. ఈ క్రమంలో వేటగాళ్ల ఉచ్చులో పడి జింకలు, కంజులు, దుప్పి, ఎలుగుబంట్లు, అడవి పందులు తదితర జంతువులు మృత్యువాత పడుతున్నాయి. ఏనుగులు, ఎలుగుబంట్లు జనవాసాల్లోకి ప్రవేశించి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ఈ క్రమంలో కొంతమంది రైతులు తమ పంటలను జంతువుల బారి నుంచి రక్షించుకునేందుకు విద్యుత్‌ వైర్లు అమర్చుతున్నారు. ఆహారం, నీటి కోసం వచ్చిన జంతువులు ప్రమాదవశాత్తు వీటి బారిన పడి కూడా మృతి చెందుతున్నాయి. మందస సమీపంలోని ఓ చెరువు వద్దకు నీటి కోసం వచ్చిన కణుజులు.. విద్యుత్‌ వైర్లు తగిలి చనిపోయాయి.

వివిధ రంగాలపై ప్రభావం..
కొండలు కనుమరుగై.. పచ్చదనం కోల్పోయి.. వాతావరణంలో పెరుగుతున్న ఉష్టోగ్రతలు.. పంటలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూతాపం పెరగడం వల్ల రాత్రి ఉష్టోగ్రతలు పెరిగి వరి దిగుబడులు తగ్గిపోతున్నట్లు అమెరికాకు చెందిన ఓ సంస్థ ప్రకటించింది. రెండు డిగ్రీల ఉష్టోగ్రత పెరిగితే హెక్టారుకు 0.75 టన్నుల ఉత్పత్తి తగ్గుతుందని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాధన్‌ తన నివేదికలో పొందుపర్చారు. ఏ ప్రాంతంలోనైనా 3 డిగ్రీల కన్నా ఉష్టోగ్రత పెరిగితే అన్ని పంటలకు నష్టదాయకమని  తేల్చిచెప్పారు.

- వర్షపాతంలో తేడాల వల్ల భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఏడాదికి సగటున 10 మీటర్లు జలమట్టం పడిపోతుందని సంబంధిత అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- భూమిలో సహజ వనరులను ఇష్టానుసారం ధ్వంసం చేస్తే అట్టడుగున ఉన్న పొరల్లో కదలికలు వస్తాయని దీంతో భూ కంపాలు సంభివిస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

- జిల్లాలో వాతావరణం కాలుష్యమై అధిక సంఖ్యలో కేన్సర్‌, బోన్‌మారో వ్యాధులు నమోదవుతున్నాయి. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ, ఏజెన్సీ ప్రాంతంలో టీబీ, మలేరియా, శ్వాసకోశ వ్యాధులు, స్వైన్‌ఫ్లూ, డెంగీ వంటి ప్రాణాంతక వ్యాధుల సంభవిస్తున్నాయి.

మనుగుడకే ప్రమాదం
చెట్లు, కొండలు.. మానవునికి ప్రకృతి ఇచ్చే వరప్రసాదాలు. వీటిని నాశనం చేస్తే మానవ మనుగడకే ప్రమాదం. ప్రస్తుతం కొండల్లో 20శాతం ధంసమయ్యాయి. భారీ వృక్షాలు కనుమరగవుతున్నాయి. దీంతో వాతావరణంలో సమతుల్యత లేక ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి.
- సీహెచ్‌ శరత్‌బాబు, వృక్షశాస్త్ర అధ్యాపకుడు, మందస. 

వ్యాధులు ప్రబలే అవకాశం..
వాతావరణంలో సమతుల్యత లోపించటంతో ప్రజల్లో వ్యాధులు ప్రభలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధిక ఉష్గోగ్రతతోపాటు గాలి కాలుష్యమై ఏజెన్సీలో అధిక సంఖ్యలో కేన్సర్‌, బోన్‌మారో వ్యాధులు వస్తాయి. దీని ప్రభావంతోనే ఉద్దానంలో కిడ్నీ, ఏజెన్సీలో టీబీ, మలేరియా, శ్వాసకోశ వ్యాధులు, స్వైన్‌ఫ్లూ, డెంగీ, కరోనా వంటి ప్రాణాంతక వ్యాధుల సంభవిస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి ప్రకృతిని కాపాడే చర్యలు చేపట్టాలి.
- ఆర్‌ చిన్నంనాయుడు, వైద్యుడు, హరిపుం సీహెచ్‌సీ. 

ప్రకృతిని  కాపాడుకోవాలి..
మన ప్రకృతిని మనమే కాపాడుకోవాలి. కొండలు, చెట్లు లేక అడవుల్లో ఉండాల్సిన వన్యప్రాణులు, అటవీజంతువులు జనసంచారంలో తిరుగుతుంటే మనిషి ప్రాణాలకే ప్రమాదం వస్తోంది. ఇటీవల ఈ ప్రాంతంలో ఏనుగులు సంచరించి తీవ్ర ఆందోళన కలిగించాయి. ఇప్పటికీ జిల్లాలోనే సంచరిస్తున్నాయి. జింకలు, కణుజులు, చెవులపిల్లులు వంటివి పూర్తిగా కనుమరుగవుతున్నాయి. వీటిని వేటాడితే కఠిన చర్యలు తప్పవు.
వీవీఎస్‌ఎన్‌ రాజు, డీఆర్వో, మందస.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.