ఈ కాష్టం ఆరేనా!

ABN , First Publish Date - 2022-05-25T05:38:29+05:30 IST

ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. సాక్షాత్తూ అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు వద్దన్నా వినడం లేదు.. ప్రతిరోజు వాళ్లు ఏంచేయాలనుకున్నారో చేస్తూనే వున్నారు. నాయకులు చూస్తూనే వున్నారు. ఏ ఒక్కరూ కౌన్సిల్‌లో తప్ప నేటి వరకు ఇదేంటని ప్రశ్నించిన దాఖలాలు లేవు.

ఈ కాష్టం ఆరేనా!
డంపింగ్‌ యార్డులో చెత్తను తగలబెట్టడంతో వ్యాపిస్తున్న పొగ

  • పట్టణాన్ని పట్టి పీడిస్తున్న డంపింగ్‌ యార్డు సమస్య
  • ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికులు, వాహనదారులు
  • పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

కొవ్వూరు, మే 24: ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. సాక్షాత్తూ అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు వద్దన్నా వినడం లేదు.. ప్రతిరోజు వాళ్లు ఏంచేయాలనుకున్నారో చేస్తూనే వున్నారు. నాయకులు చూస్తూనే వున్నారు. ఏ ఒక్కరూ కౌన్సిల్‌లో తప్ప నేటి వరకు ఇదేంటని ప్రశ్నించిన దాఖలాలు లేవు.

కొవ్వూరు పట్టణంలో డంపింగ్‌ యార్డు తీరని సమస్యగా మారింది. 1965 ఫిబ్రవరి 1వ తేదీన కొవ్వూరు మున్సిపాల్టీ ఏర్పడింది. ఐదున్నర దశాబ్ధాలు గడిచినా పట్టణంలో ఇంటింటా సేకరించిన చెత్తను వేయడానికి డంపింగ్‌ యార్డుకు స్థలసేకరణ చేయడంలో అధికారులు, నాయకులు పూర్తిస్థాయిలో వైఫల్యం చెందారు. 16.23 కిలోమీటర్లు విస్తరించి ఉన్న కొవ్వూరులో 23 వార్డులు 40వేలకు పైగా జనాభా, 13వేల నివాస గృహాలు ఉన్నాయి. ప్రతిరోజు 23 టన్నులు చెత్త వచ్చి పడుతుంది. నందమూరు రోడ్‌లో సుమారు రెండెకరాల భూమిని సేకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అందుకు చెల్లించవలసిన సొమ్మును రెవెన్యూ శాఖకు జమ చేశారు. అయితే భూ యజమాని కోర్టును ఆశ్రయించడంతో డంపింగ్‌యార్డు సమస్య ఎటు తేలలేదు. దీంతో ఒకటో వార్డు రాజీవ్‌ కాలనీలోని నివాసాలను ఆనుకుని ఉన్న మున్సిపల్‌ చెరువు మూసేసి చెత్తను డంపింగ్‌ చేసేవారు. వర్షాకాలంలో చెత్త రోడ్డుపై పారవేయడంతో దుర్గందం వెదజల్లుతుందని కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. ఇటీవల కొవ్వూరు మండలం ఐ.పంగిడిలో జిల్లా పరిషత్‌కు చెందిన ఏడెకరాల స్థలాన్ని గుర్తించి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌  కొవ్వూరులో సేకరించిన చెత్తను పారవేయడానికి డంపింగ్‌ యార్డుకు కేటాయించారు. అయితే దీనిపై పంగిడి ప్రజలు రోడ్లెక్కి అభ్యంతరాలు తెలపడంతో సమస్య మొదటికి వచ్చింది. ఈ నేపథ్యంలో వార్డుల్లో ఇంటింటా సేకరించిన చెత్త వేయడానికి స్థలం లేకపోవడంతో గోదావరి తీరం గోష్పాద క్షేత్రానికి సమీపంలోని కాటన్‌ విగ్రహం వద్ద మున్సిపల్‌ కాలిస్థలంలో పారవేస్తున్నారు. ఈజీకే రోడ్డును ఆనుకుని చెత్తవేసి తగలబెట్టడంతో పొగ వ్యాపించి వాహనదారులు, ప్రజలు అసహనాన్ని వ్యక్తంచేస్తున్నారు. విజయవాడ, విశాఖపట్టణాల వైపు రోడ్డు మార్గంతోపాటు, రైలు ప్రయాణికులు వర్షాకాలంలో దుర్వాసన భరించలేక అవస్థలు పడుతున్నారు. చెత్త తగలబెట్టకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

దశాబ్ధాలుగా పట్టణాన్ని వేధిస్తున్న డంపింగ్‌ యార్డు సమస్యకు చెక్‌ పెట్టలేకపోతున్నారు. ఎంతో విలువైన స్థలంలో గత ప్రభుత్వం సుమారు 15 శాఖల కార్యాలయాల సముదాయం నిర్మించేందుకు ప్రతిపాదించి, చర్యలు చేపట్టారు. ఇంతలో ప్రభుత్వం మారడంతో ఆ స్థలాన్ని డంపింగ్‌ యార్డుగా మార్చేశారు. రసాయన కర్మాగారం పక్కనే చెత్తను పారబోసి నిప్పు పెడుతున్నా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. మూడేళ్లుగా ఆంధ్రజ్యోతి పలు కథనాలు ప్రచురించినా కనీస స్పందన లేదు. కొత్తజిల్లాలో అయినా చెత్త సమస్యకు పరిష్రారం దక్కుతుందని ఆశించిన నేటికి అతిగతి లేదు. కలెక్టరమ్మ గతవారం కొవ్వూరు ఆర్డీవో కార్యాలయానికి స్పందనకు వస్తే చాలామంది డంపింగ్‌ యార్డు సమస్యపై ఫిర్యాదు చేయడానికి సిద్ధపడ్డారు. స్పందన వాయిదా పడడంతో నిరాశ చెందారు. 

ప్రమాదాల బారిన వాహనదారులు

కొవ్వూరు పట్టణాన్ని పట్టి పీడిస్తున్న చెత్త డంపింగ్‌ సమస్య ఈ నాటిది కాదు. 5 దశాబ్దాలుగా వెంటాడుతూనే ఉంది. ఇదే నియోజకవర్గం నుంచి ఇద్దరు మంత్రులుగా కూడా ఎన్నికయ్యారు. ఒకరి హయాంలో సమస్య ఎటూ తేలలేదు. ప్రస్తుత హోంమంత్రి హయాంలో అయినా పరిష్కారం దొరుకుతుందని ఆశించిన పట్టణ వాసులకు నిరాశే ఎదురైంది. అంతేకాకుండా  ఎక్కడో మారుమూలన వేయవలసిన చెత్తను ప్రతిరోజు వేలాదిమంది తిరిగే రాష్ట్ర రహదారి పక్కన పారవేస్తూ, నిప్పుపెడుతున్నారు. దీంతో ఆ రోడ్డులో పొగ వ్యాపించి దారి కనిపించక వాహనదారులు, ప్రజలు ప్రమాదాలకు, అసౌకర్యానికి గురవుతున్నారు.

Updated Date - 2022-05-25T05:38:29+05:30 IST