పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2022-01-22T04:37:41+05:30 IST

ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో పత్తిమిల్లులో నిల్వ ఉంచిన పత్తి దగ్ధమైన ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని ఇబ్రహీంనగర్‌ గ్రామ శివారులో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది

పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం
మంటలను ఆర్పుతున్న ఫైర్‌ సిబ్బంది

రూ. 70 లక్షలు ఆస్తి నష్టం 


చిన్నకోడూరు, జనవరి 21 : ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో పత్తిమిల్లులో నిల్వ ఉంచిన పత్తి దగ్ధమైన ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని ఇబ్రహీంనగర్‌ గ్రామ శివారులో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. ఎస్‌ఐ శివానందం తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌లోని కొంపల్లికి చెందిన రాజ్‌కుమార్‌ అగర్వాల్‌కు మండలంలోని  ఇబ్రహీంనగర్‌ శివారులో పత్తి మిల్లు ఉంది. జిన్నింగ్‌ యంత్రంలో పత్తిని నింపడానికి ఉపయోగించే ట్రాక్టర్‌ లోడర్‌ను డ్రైవర్‌ పత్తి నిల్వల మధ్యలో నిలిపి మధ్యాహ్న భోజనం చేయడానికి వెళ్లాడు. ట్రాక్టర్‌ ఇంజన్‌ వేడికి పత్తికి మంటలు అంటుకుని వేగంగా వ్యాపించాయి. మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించడంతో మిల్లులో పనిచేసే కార్మికులు ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగు తీశారు. మిల్లు యాజమాన్యం సమాచారం మేరకు ఫైర్‌ సిబ్బంది, పోలీసులు చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. రెండు ఫైరింజన్లతో రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. సిద్దిపేట రూరల్‌ సీఐ జానకీరాంరెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. రాజ్‌కుమార్‌ అగర్వాల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. ప్రమాదంలో రూ. 70 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు యాజమాన్యం వెల్లడించింది. 

పాశమైలారం పారిశ్రామికవాడలో..

పటాన్‌చె రురూరల్‌, జనవరి 21: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. పాశమైలారం ఎరిన్‌ లైఫ్‌ సైన్సెస్‌ పరిశ్రమలో రియాక్టర్‌ పేలడంతో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పటాన్‌చెరు ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. సీఐ రాంరెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఎంత మేర నష్టం వాటిల్లింది అన్న వివరాలు తెలియాల్సి ఉంది.  



Updated Date - 2022-01-22T04:37:41+05:30 IST