కాకినాడలో భారీ అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2020-12-05T06:24:53+05:30 IST

సర్పవరం జంక్షన్‌ (కాకినాడ), డిసెంబరు 4: కాకినాడ రూరల్‌ రమణయ్యపేటలో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ప్లాస్టిక్‌ సంచుల తయారీ, స్టిక్కరింగ్‌ యూనిట్‌ మొత్తం కాలిబూడిదై సుమారు రూ.20 లక్షల మేర ఆస్తినష్టం సంభవించింది. వివరాల ప్రకారం.

కాకినాడలో భారీ అగ్నిప్రమాదం
మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

రమణయ్యపేటలో అగ్నికి ఆహుతైన 

ప్లాస్టిక్‌ సంచుల తయారీ యూనిట్‌ 

రూ.20 లక్షల మేర ఆస్తి నష్టం

సర్పవరం జంక్షన్‌ (కాకినాడ), డిసెంబరు 4: కాకినాడ రూరల్‌ రమణయ్యపేటలో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ప్లాస్టిక్‌ సంచుల తయారీ, స్టిక్కరింగ్‌ యూనిట్‌ మొత్తం కాలిబూడిదై సుమారు రూ.20 లక్షల మేర ఆస్తినష్టం సంభవించింది. వివరాల ప్రకారం... కాకినాడ రూరల్‌ మండలం రమణయ్యపేట ఇండస్ట్రీయల్‌ ప్రాంతంలోని ప్లాట్‌ నెంబర్‌ 42లో శ్రీగంగా ఇండస్ట్రీస్‌ పేరుతో కాశీ అనే వ్యక్తి లీజుకు తీసుకుని ప్లాస్టిక్‌ సంచుల తయారీ చేస్తున్నారు. ఇక్కడ సుమారు 20 మంది పని చేస్తుంటారు. శుక్రవారం సిబ్బంది పని ముగించుకుని వెళ్లిపోయిన తర్వాత రాత్రి 7.30 గంటల సమయంలో ఒక్కసారిగా ఇండస్ట్రీస్‌ నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో సాలిపేట, జగన్నాథపురం నుంచి అగ్నిమాపక వాహనాల్లో సిబ్బంది వచ్చి మంటల నియంత్రణా చర్యలు చేపట్టారు. అప్పటికే ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి ఎగసిపడుతున్న అగ్నికి యూనిట్‌లో ఉన్న పలు యంత్రాలు, రా మెటీరియల్‌ అంతా కాలి బూడిదయ్యింది. మంటలు పక్కనున్న ప్లాట్లకు వ్యాపించకుండా ఆర్పేందుకు 5 ఫైర్‌ ఇంజన్లతో సిబ్బంది అర్థరాత్రి వరకు నిర్విరామంగా శ్రమించారు. రాత్రి పూట కంపెనీలో ఎవరూ పనిచేయకపోవడంతో ప్రాణపాయం తప్పింది. విద్యుదాఘాతం కారణంగా ప్రమాదం సంభవించినట్టు అగ్నిమాపక అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్లాస్టిక్‌ సంచులు, రీసైక్లింగ్‌ మెటీరియల్‌ సుమారు రూ.10 లక్షలు, మిషన్లు మరో రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లి ఉండవచ్చని భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి ఆర్డీవో చిన్నికృష్ణ, రూరల్‌ సర్కిల్‌ సీఐ ఆకుల మురళీకృష్ణ, తహశీల్దార్‌ వేముల మురళీకృష్ణ చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. యూనిట్‌ కాలిపోయిన సమాచారాన్ని తెలుసుకుని నిర్వాహకుడు కాశీ తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలడంతో ఆసుపత్రిలో చేర్పించారు.

Updated Date - 2020-12-05T06:24:53+05:30 IST