బల్దియా భవనాల్లో Fire Accidents.. సేఫ్టీ కరువు.. వారికీ పొంచి ఉన్న ముప్పు

ABN , First Publish Date - 2022-01-13T17:05:31+05:30 IST

బల్దియా భవనాల్లో Fire Accidents.. సేఫ్టీ కరువు.. వారికీ పొంచి ఉన్న ముప్పు

బల్దియా భవనాల్లో Fire Accidents.. సేఫ్టీ కరువు.. వారికీ పొంచి ఉన్న ముప్పు

  • జోనల్‌ కార్యాలయాల్లో అగ్ని కీలలు
  • మొన్న ఖైరతాబాద్‌.. నేడు సికింద్రాబాద్‌
  • సొంత భవనాల్లో ఫైర్‌ సేఫ్టీ కరువు
  • ప్రధాన కార్యాలయంలోనూ అదే దుస్థితి
  • ఉద్యోగుల్లో ఆందోళన
  • కార్యాలయాలకు నిత్యం వేల సంఖ్యలో సందర్శకులు

హైదరాబాద్‌ సిటీ : ఫిబ్రవరి 6, 2018: ఖైరతాబాద్‌ జోనల్‌ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కంప్యూటర్లు, ఫర్నిచర్‌, ఫైళ్లు దహనమై రూ.10 లక్షల మేర ఆస్తి నష్ట జరిగింది. ఈ ప్రమాదంలో ఉద్యోగుల పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.


జనవరి 12, 2022 : సికింద్రాబాద్‌ జోనల్‌ కార్యాలయంలోని రెవెన్యూ విభాగం ఉండే మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఘటన షార్ట్‌ సర్క్యూట్‌ వల్లా, పక్కనున్న వాటర్‌ బోర్డు కార్యాలయంలో చెత్త తగలబెట్టే క్రమంలో నిప్పు రవ్వలు పడ్డాయా, ఇతరత్రా కారణాలున్నాయా అనేది తెలియాల్సి ఉంది.


- నగరంలో 15 మీటర్ల ఎత్తు, 1000 చ.మీల నిర్మాణ విస్తీర్ణంలో ఉన్న పలు కేటగిరీల భవనాల్లో అగ్నిమాపక ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిన బాధ్యత జీహెచ్‌ఎంసీది. అయితే, లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయం సహా, వివిధ ప్రాంతాల్లో ఉన్న జోనల్‌, సర్కిల్‌ కార్యాలయాల్లో కూడా ఫైర్‌ సేఫ్టీ కనిపించడం లేదు. కొన్నిచోట్ల అగ్నిమాపక పరికరాలు లేకపోగా, ఉన్నచోట్ల కూడా అవి పని చేయడం లేదు. నిబంధనల ప్రకారం ప్రతి మూడు, ఆరు నెలలకోమారు పైపులు సరిగా ఉన్నాయా, నీళ్లు సరిగా వస్తున్నాయా అన్నది పరిశీలించాలి. కానీ అలాంటి దాఖలాలు కనిపించవు. సొంత కార్యాలయ భవనాల్లో ఫైర్‌ సేఫ్టీ ఏర్పాట్లు పట్టని సంస్థ ప్రైవేట్‌ భవనాల్లో పరిస్థితిని ఎలా పర్యవేక్షిస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం ప్రమాదం జరిగిన సికింద్రాబాద్‌ జోనల్‌ కార్యాలయ భవనంలో ఫైర్‌ ఎగ్జిట్వింగిషర్లు, అలారంలు, ఫైర్‌ హోస్‌ బాక్సులు ఉన్నప్పటికీ ఒక్కటీ పని చేయలేదు.


ఫైరింజన్లు వచ్చే వరకు మంటలార్పే పరిస్థితి లేకుండా పోయింది. ప్రమాదం జరగ్గానే అక్కడి పరికరాల ద్వారా మంటలార్పే ప్రయత్నం చేయడం వల్ల ప్రమాద తీవ్రతను తగ్గించే అవకాశముంటుంది. జీహెచ్‌ఎంసీ కార్యాలయ భవనాల్లో ఆ పరిస్థితి లేదు. సందర్శకులు ఎక్కువగా ఉన్న సమయంలో ప్రమాదం జరిగితే ఆస్తితోపాటు ప్రాణ నష్టం జరిగే అవకాశాలు లేకపోలేదు. ఒక్కోసారి సమావేశాలు, ఇతర పనుల కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులూ వస్తుంటారు. వేలాది మంది వచ్చే భవనాల్లో ప్రమాదాలు, విలువైన డాక్యుమెంట్లు బూడిద కావడం విమర్శలకు తావిస్తోంది. వరుస ప్రమాదాలతో ఉద్యోగులూ ఆందోళన చెందుతున్నారు.


నిప్పు రవ్వలు వచ్చాయా..? 

జోనల్‌ కార్యాలయం పక్కనే వాటర్‌బోర్డు కార్యాలయం ఉంది. ఆ కార్యాలయ ప్రాంగణంలో చెత్తా చెదారాన్ని అక్కడి సిబ్బంది తరచూ తగలబెడ్తుంటారని జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు చెబుతున్నారు. బుధవారం కూడా తగలబెట్టిన చెత్త నుంచి నిప్పురవ్వలు రావడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదని ఓ అధికారి తెలిపారు.


ఎలక్ట్రికల్‌ దుకాణంలో...

ఎలక్ట్రికల్‌ వస్తువుల అమ్మకాలు జరిపే ఓ షాపులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మహంకాళి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్ఖానాకు చెందిన అశ్విన్‌ వేద్‌ రాణీగంజ్‌లోని కాబ్రా కాంప్లెక్స్‌ సమీపాన ఓ భవనం మెదటి అంతస్తులో ఫిలిప్స్‌ ఎలక్ట్రికల్‌ వస్తువుల డిస్ట్రిబ్యూషన్‌ షాపు కొనసాగిస్తున్నారు. బుధవారం ఉదయం 5.45 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరుగుతుందనే ఫైర్‌ అలారం మెసేజ్‌ అశ్విన్‌కు వచ్చింది. వెంటనే ఆయన ఫైర్‌ సిబ్బందికి, మహంకాళి పోలీసులకు సమాచారం అందించారు. షాపులో ఎలక్ట్రికల్‌  వైర్లు కూడా తగలబడడంతో మంటలను అదుపులోకి తేవడం కష్టమైంది. ఏడు ఫైరింజన్ల సిబ్బంది ఉదయం 11 వరకు ప్రయత్నించి మంటలు అదుపులోకి తెచ్చారు. దాదాపు 20 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని బాధితులు తెలిపారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు, ఫైర్‌ సిబ్బంది భావిస్తున్నారు.


పన్నుల విభాగంలో కాలి బుడిదైన ఫైళ్లు..

సికింద్రాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ జోనల్‌ కార్యాలయం మూడో అంతస్తులోని ఆస్తిపన్నుల సెక్షన్‌లో బుధవారం మధ్యాహ్నం మంటలంటుకున్నాయి. ఆ విభాగంలోని ఫైళ్లు కాలి బూడిదయ్యాయి. మంటల వేడికి ఆ అంతస్తులోని కిటికీ అద్దాలు పగిలిపోయాయి. బేగంపేట సర్కిల్‌కు సంబంధించిన విభాగంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మూడో అంతస్తు నుంచి నాలుగో అంతస్తుకు మంటలు ఎగిసి పడ్డాయి. ప్రాణభయంతో ఉద్యోగులు పైకి పరుగులు తీశారు. మంటల తీవ్రత పెరగడంతో నాలుగు, ఐదు అంతస్తుల్లో ఉన్న ఉద్యోగులు సైతం టెర్ర్‌సపైకి వెళ్లారు. దట్టమైన పొగలు అలుముకోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందారు. అగ్నిమాపక శాఖకు చెందిన మూడు ఫైరింజన్లు మంట లార్పాయి. 


సహాయక చర్యల నిమిత్తం డీఆర్‌ఎఫ్‌ బృందాలు వచ్చాయి. నిచ్చెన ద్వారా పై అంతస్తులో ఉన్న ఉద్యోగులను కిందికి దించారు. భవనంలో అగ్నిమాపక పరికరాలున్నా పని చేయకపోవడం వల్ల మంటల వ్యాప్తి పెరిగిందని ఉద్యోగులు చెబుతున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగిందని ఓ అధికారి పేర్కొన్నారు. ఉద్యోగులు అందరూ సురక్షితంగా ఉన్నారని మారేడ్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ మట్టయ్య తెలిపారు. మోండా మార్కెట్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ దీపిక పరిస్థితిని పర్యవేక్షించారు. ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ దర్సునాయక్‌ వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను చక్కదిద్దారు.

Updated Date - 2022-01-13T17:05:31+05:30 IST