ఏడుకు పెరిగిన ‘బాణసంచా’ మృతులు

ABN , First Publish Date - 2021-10-28T15:32:28+05:30 IST

కళ్లకుర్చి జిల్లా శంకరాపురం వద్ద టపాసుల దుకాణంలో సంభవించిన అగ్నిప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఏడుకు పెరిగింది. మరో 50 మంది గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శంకరాపురం బజారువీధిలో

ఏడుకు పెరిగిన ‘బాణసంచా’ మృతులు

చెన్నై(Chennai): కళ్లకుర్చి జిల్లా శంకరాపురం వద్ద టపాసుల దుకాణంలో సంభవించిన అగ్నిప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఏడుకు పెరిగింది. మరో 50 మంది గాయపడి వివిధ ఆస్పత్రుల్లో  చికిత్స పొందుతున్నారు. శంకరాపురం బజారువీధిలో సెల్వగణపతి అనే వ్యక్తి నిర్వహిస్తున్న బాణసంచా దుకాణంలో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఆ దుకాణంలో పెద్ద శబ్దంతో ఆ బాణసంచా పేలింది. దీనికి తోడు పక్కనే ఉన్న బేకరీ షాపులోని గ్యాస్‌ సిలిండర్లు కూడా పేలడంతో మంటలు అన్ని వైపులా వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ప్రొక్లయిన్ల ద్వారా భవన శిథిలాలను తొలగించారు. ఆ సమయంలో వంటి నిండా గాయాలతో మరో వ్యక్తి శవం లభించింది. ఈ ప్రమాదంలో సుమారు 50 మంది గాయపడటంతో చికిత్స నిమిత్తం కళ్లకుర్చి, విల్లుపురం, సేలం ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. మృతుల్లో శంకరాపురం మేట్టువీధికి చెందిన సయ్యద్‌లాలిత్‌ (22), షా ఆలమ్‌ (24), షేక్‌ బషీర్‌ (40) తదితరులున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కళ్లకుర్చి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. బుధవారం ఉదయం ఎస్వీపాళయానికి చెందిన రిటైర్డ్‌ టీచర్‌ అయ్యాసామి, అరంగ సెంబియాన్‌ (60) మృతిచెందారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. ఈ ప్రమాదం సంభవించడానికి పలు కారణాలు చెబుతున్నారు. దుకాణంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఈ ప్రమాదం జరిగిందని కొందరు చెబుతుండగా, ఆ దుకాణం పక్కనే ఉన్న బేకరీ నుంచి రేగిన మంటలు ఈ దుకాణానికి పాకాయని, ఆ మేరకు ప్రమాదం జరిగిందని ఇంకొందరు చెబుతున్నారు. దీనిపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు. 

Updated Date - 2021-10-28T15:32:28+05:30 IST