మూడిళ్లు అగ్నికి ఆహుతి

ABN , First Publish Date - 2021-10-28T05:08:47+05:30 IST

వారంతా రెక్కాడితేగానీ డొక్కాడని కష్టజీవులు. దేవుడినే నమ్ముకుని పూరిళ్లలో జీవనం సాగిస్తున్న శ్రామికులు. అలాంటి వారి ఇళ్లు ఉన్నట్టుండి అగ్నికి ఆహుతయ్యాయి.

మూడిళ్లు అగ్నికి ఆహుతి
మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

విద్యుత్‌ షార్ట్‌సర్కూట్‌, ఆపై సిలిండర్‌ పేలడంతో ప్రమాదం

ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణాపాయం

దేవుడే కాపాడాడా?


నెల్లూరు(క్రైం), అక్టోబరు 27: 

వారంతా రెక్కాడితేగానీ డొక్కాడని కష్టజీవులు. దేవుడినే నమ్ముకుని పూరిళ్లలో జీవనం సాగిస్తున్న శ్రామికులు. అలాంటి వారి ఇళ్లు ఉన్నట్టుండి అగ్నికి ఆహుతయ్యాయి. సర్వం బుగ్గిపాలుకావడంతో కట్టుబట్టలతో మిగిలారు. అయితే ప్రమాద సమయంలో అందరూ గుడికి వెళ్లడంతో దేవుడే ప్రాణాపాయం నుంచి కాపాడాడని చుటుపక్కల అంటున్నారు. నగరంలో బుధవారం సంభవించిన అగ్ని ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి.

పాత మున్సిపల్‌ కార్యాలయం రోడ్డులో ఊయ్యాల కాలువకట్ట ప్రాంతంలో కే పద్మ, సీహెచ్‌ మానస, జీ లక్ష్మి కుటుంబాలు పూరిళ్లలో నివసిస్తున్నాయి. బుధవారం ఆ మూడు కుటుంబాలలోని సభ్యులందరూ కలిసి మాలధారణ కోసం దేవాలయానికి వెళ్లారు. ఆ సమయంలో వారి ఇళ్లలోని ఓ ఇంట్లో విద్యుత్‌షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో మంటలు రేగాయి. పూరిళ్లు కావడంతో అగ్ని కీలలు మూడు ఇళ్లకు వ్యాపించాయి. దీనికి తోడు ఓ ఇంట్లోని గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఇంటి గోడలు సైతం పూర్తిగా దెబ్బతిన్నాయి. పేలుడు శబ్దాలను, మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించి మంటలు ఆపే ప్రయత్నం చేశారు. ఫైర్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని అతి కష్టం మీద మంటలను అదుపుచేశారు. ఇంట్లోని వస్తువులు మాత్రం పూర్తిగా బూడిదయ్యాయి. సంతపేట, చిన్నబజారు పోలీస్‌ స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు షేక్‌ అన్వర్‌బాషా, మధుబాబు  ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం గురించి తెలుసుకున్న బాధితులు ఇళ్లకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఈ ప్రమాదంలో రూ.6 లక్షలకుపైగా ఆస్తినష్టం వాటిల్లి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది అంచనా.  

బాధితులకు సాయం

నెల్లూరు(వైద్యం): అగ్నిప్రమాద బాధితులకు సీపీఎం నగర కార్యవర్గ సభ్యుడు చంద్రారెడ్డి చేయూతనందించారు. నిత్యావసరాలు, చీరలతోపాటు ఒక్కో కుటుంబానికి రూ.2వేల చొప్పున సాయం చేశారు. 



Updated Date - 2021-10-28T05:08:47+05:30 IST