fire accident: పైరోటెక్‌ పరిశ్రమలో అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2022-08-09T01:45:00+05:30 IST

అనకాపల్లి జిల్లా పరవాడ మండల పరిధిలోని ఏపీఐఐసీ ఇండస్ట్రియల్‌ పార్కులో గల పైరోటెక్‌ పరిశ్రమలో సోమవారం తెల్లవారుజామున

fire accident: పైరోటెక్‌ పరిశ్రమలో అగ్ని ప్రమాదం

పరవాడ: అనకాపల్లి జిల్లా పరవాడ మండల పరిధిలోని ఏపీఐఐసీ ఇండస్ట్రియల్‌ పార్కులో గల పైరోటెక్‌ పరిశ్రమలో సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో బాయిలర్‌ వద్ద పనిచేస్తున్న హెల్పర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఇద్దరు కార్మికులు బయటపడ్డారు. పైరోటెక్‌ పరిశ్రమలో వేస్ట్‌ ప్లాస్టిక్‌ను కరిగించి, తారులో వినియోగించే ఆయిల్‌ను తయారుచేస్తుంటారు. ఈ పరిశ్రమలో అసోం రాష్ట్రానికి చెందిన రహీముద్దీన్‌ బాయిలర్‌ ఆపరేటర్‌గా, నూల్‌ ఉల్‌ ఇస్లాం, హసన్‌మియా హెల్పర్లుగా పనిచేస్తున్నారు. వీరు ముగ్గురూ ఆదివారం రాత్రి ‘సి’ షిఫ్టునకు హాజరయ్యారు. అయితే సోమవారం తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో బాయిలర్‌ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కనే వున్న ఆయిల్‌ స్టోరేజీ ట్యాంకుకు కూడా అంటుకున్నాయి. ఆ సమయంలో అక్కడ వున్న నూల్‌ ఉల్‌ ఇస్లాంకు మంటలు అంటుకోవడంతో వీపు, చేతులు యాభై శాతం మేర కాలిపోయాయి. రహీముద్దీన్‌, హనన్‌మియా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన నూల్‌ ఉల్‌ను చికిత్స నిమిత్తం అగనంపూడి ఏరియా ఆస్పతికి తీసుకువెళ్లగా, ప్రథమ చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాద విషయాన్ని కంపెనీ సూపర్‌వైజర్‌ సురేశ్‌ వెంటనే రాంకీ అగ్నిపమాక సిబ్బందికి అందజేశారు. వారికి మంటలు అదుపులోకి రాలేదు. దీంతో అనకాపల్లి, సింహాద్రి ఎన్టీపీసీ నుంచి అగ్ని మాపక సిబ్బంది చేరుకొని ఫోమ్‌ సాయంతో సుమారు రెండున్నర గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో కంపెనీ ప్రాంగణంలో వున్న వేస్ట్‌ ప్లాస్టిక్‌ కొంతమేర కాలి బూడిదైంది. బాయిలర్‌, సోర్టేజ్‌ ట్యాంకు ధ్వంసమయ్యాయి. యంత్రాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

Updated Date - 2022-08-09T01:45:00+05:30 IST