మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెల్లడి
న్యూఢిల్లీ, మే 14: ఢిల్లీలోని ముంద్కాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం చాలా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 27 మంది సజీవ దహనం కాగా.. 12 మంది గాయపడ్డారు. ఇంకా 29 మంది జాడ తెలియాల్సి ఉందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. అగ్నిప్రమాదం జరిగిన వాణిజ్య భవనంలో శనివారం ఉదయం కూలింగ్ చర్యలు చేపడుతుండగా రెండో అంతస్తులో మానవ అవశేషాలు కనిపించినట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన నాలుగంతస్తుల భవనానికి ఫైర్ సేఫ్టీ ధ్రువపత్రం లేదని అధికారులు తెలిపారు. భవనం లోపలికి, బయటికి వెళ్లడానికి ఒకే మార్గం ఉందని.. అదీ ఇరుకుగా ఉందని చెప్పారు. అందుకే 27 మంది చనిపోయారని అగ్నిమాపక శాఖ ప్రధాన అధికారి అతుల్ గార్గ్ వెల్లడించారు. ఏసీలో పేలుడు సంభవించడం వల్లే మంటలు వేగం గా వ్యాపించి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న సీసీటీవీ కెమెరాలు, రూటర్ల తయారీ సంస్థ నుంచే మంటలు చెలరేగాయి. సంస్థ యజమానులు హరీశ్ గోయల్, వరుణ్ గోయల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ సమీర్ శర్మ తెలిపారు. ప్రమాదంలో వీరి తండ్రి కూడా మరణించినట్లు చెప్పారు. 27 మంది మృతుల్లో ఏడుగురిని గుర్తించినట్లు వివరించారు. భవన యజమాని మనీశ్ లాక్రాపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కాగా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశించారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. అగ్ని ప్రమాదంలో మృతదేహాలు గుర్తించలేని విధంగా కాలిపోయాయని తెలిపారు. మృతులు, తప్పిపోయిన వారిని గుర్తించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అగ్నిప్రమాదంపై లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాభ సానుభూతిని తెలియజేశారు.