ఆ కేంద్రంలో అన్నీ లోపాలే

ABN , First Publish Date - 2020-08-10T09:20:30+05:30 IST

విజయవాడ స్వర్ణప్యాలె్‌సలో నిర్వహిస్తున్న కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో అన్నీ లోపాలే వెలుగులోకి వస్తున్నాయి. ఎటువంటి జాగ్రత్తలూ తీసుకోకుండా రమేశ్‌ ఆస్పత్రి

ఆ కేంద్రంలో అన్నీ లోపాలే

  • పరిశీలించకుండానే  అనుమతులు
  • భవనంలో సరైన అగ్నిమాపక పరికరాలూ లేవు
  • అత్యవసర ద్వారమూ లేదు.. దర్యాప్తులో వెలుగులోకి
  • రమేష్‌ ఆస్పత్రి, హోటల్‌ యాజమాన్యాలపై కేసు

అమరావతి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): విజయవాడ స్వర్ణప్యాలె్‌సలో నిర్వహిస్తున్న కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో అన్నీ లోపాలే వెలుగులోకి వస్తున్నాయి. ఎటువంటి జాగ్రత్తలూ తీసుకోకుండా రమేశ్‌ ఆస్పత్రి యాజమాన్యం హోటల్‌ను కొవిడ్‌ వైద్యశాలగా మార్చడం, కనీస పరిశీలన లేకుండా అధికారులు అనుమతులివ్వడం, ప్రమాదం జరిగాక ఒకరిపై ఒకరు తప్పులు వేసుకోవడం బాధ్యతా రాహిత్యాన్ని తెలియజేస్తోంది. కొవిడ్‌ వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయాలంటే అగ్నిమాపకశాఖ అనుమతుల నుంచి జిల్లా వైద్యాధికారి వరకూ నిరభ్యంతర పత్రాలు తప్పనిసరి. ఈ సెంటర్‌కు అవేమీ లేవని పోలీసు దర్యాప్తులో తేలింది. అగ్నిమాపకశాఖ నిబంధనల ప్రకారం ఆస్పత్రికి ప్రధాన ద్వారంతోపాటు స్ట్రెచర్‌ ర్యాంపు ఉండాలి. 


లిఫ్ట్‌లో స్ట్రెచర్‌ తీసుకెళ్లేంత చోటు ఉండాలి. వెనుక వైపు ఇనుముతో మెట్లు ఏర్పాటు చేసి, రెండో ఎగ్జిట్‌ను అందుబాటులో ఉంచాలి. ఇవేవీ ప్రమాదం జరిగిన భవనంలో లేవని పోలీసులు చెబుతున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా అగ్నిమాపక పరికరాలు నిబంధనలకు తగిన విధంగా లేవు. స్మోక్‌ ఇండక్టర్‌ పనిచేయలేదు. దీనిపై అగ్నిమాపకశాఖ అధికారులను అడగ్గా, వాటిని ఎప్పటికప్పుడు నిర్వహిస్తుండాలని, కొన్ని నెలలుగా అందులోని కెమికల్స్‌ మార్చకపోవడంతో పొగ పీల్చుకోలేదని చెబుతున్నారు. ఆక్సిజన్‌ పైపులైను కూడా ఇక్కడ లేదని, సిలిండర్లు బయటి నుంచి తెచ్చారని అంటున్నారు. విద్యుత్‌ శాఖ నుంచి కూడా అనుమతులు తీసుకోలేదని సమాచారం. విద్యుత్‌ వైరింగ్‌ ఎప్పుడు చేశారు? ప్రస్తుతం దాని పరిస్థితి ఏంటి? ఎక్కడైనా ప్రమాదకరంగా ఉందా? అనేవి కనీసం పరిశీలించలేదంటున్నారు. జిల్లా ఉన్నతాధికారిని ఆస్పత్రి యాజమాన్యం సంప్రదించగానే పర్మిషన్‌ ఇవ్వాలని ఆయన ఆదేశించారని, ఎటువంటి పరిశీలన లేకుండా అనుమతులు ఇచ్చేశారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వైద్య ఆరోగ్యశాఖ నిద్రిస్తోందా? నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ గత నెల 18న ఈ హోటల్‌లో కొవిడ్‌ వైద్యానికి అనుమతి ఇచ్చింది. దీంతో ప్రైవేటు ఆస్పత్రి గతనెల 19 నుంచి వైద్యం ప్రారంభించింది. అయితే, అనుమతి ఇచ్చే ముందు ఒక్కసారైనా జిల్లా వైద్యాధికారులు ఆ భవనాన్ని పరిశీలించలేదని పోలీసు దర్యాప్తులో తేలింది. ఈ విషయాన్ని పోలీసుశాఖ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఉన్నతాధికారులు ఒకరిపై మరొకరు నెపం వేసుకొంటున్నారు.


అమిత్‌ షా దిగ్ర్భాంతి..

అగ్ని ప్రమాద ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన జరిగి ఉండాల్సింది కాదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.


షార్ట్‌ సర్క్యూటే కారణం..

స్వర్ణప్యాలెస్‌లో అగ్నిప్రమాదం జరగడానికి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూటే కారణమని అగ్నిమాపక సిబ్బంది తేల్చారు. ఏసీ వినియోగం వల్ల ప్రమాదం తీవ్రత పెరిగిందని ప్రాథమికంగా గుర్తించాం. ప్రాణాలతో ఉన్నవారికి అన్ని వైద్యసేవలూ అందజేస్తున్నాం. ఘటనపై విచారణకు ఆదేశించాం. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.   

- ఇంతియాజ్‌ అహ్మద్‌, కలెక్టర్‌, కృష్ణాజిల్లా

Updated Date - 2020-08-10T09:20:30+05:30 IST