వారణాసి చీరల యూనిట్‌లో అగ్ని ప్రమాదం... నలుగురి మృతి...

ABN , First Publish Date - 2022-04-14T21:28:58+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లోని భేలుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో

వారణాసి చీరల యూనిట్‌లో అగ్ని ప్రమాదం... నలుగురి మృతి...

వారణాసి : ఉత్తర ప్రదేశ్‌లోని భేలుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చీరల వర్క్‌షాప్‌లో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు బిహార్ రాష్ట్రానికి చెందినవారు. విద్యుదాఘాతం వల్ల ఈ ప్రమాదం జరిగిందని, ఒకే ద్వారం ఉండటం వల్ల బాధితులు ప్రమాద సమయంలో బయటకు రాలేకపోయారని వారణాసి జిల్లా కలెక్టర్ కౌశల్ రాజ్ శర్మ చెప్పారు. 


పోలీసు అధికారి ప్రవీణ్ కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, మదన్‌పురకు చెందిన వ్యాపారి ఒకరు అష్ఫక్ నగర్ కాలనీలో ఓ భవనంలోని బేస్‌మెంట్‌లో రెండు గదులను అద్దెకు తీసుకున్నారు. చీరల ఫినిషింగ్, ప్యాకేజింగ్ వ్యాపారాన్ని ఈ గదుల్లో నిర్వహిస్తున్నారు. విద్యుదాఘాతం వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. ఈ గదులకు కేవలం ఒకే ద్వారం ఉండటం వల్ల ఆ వ్యాపారి, ఆయన కుమారుడు, బిహార్‌కు చెందిన ఇద్దరు కార్మికులు బయటకు రాలేకపోయారు. అగ్నిమాపక శకటాలు చేరుకోవడానికి ముందే వీరంతా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 


ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల ప్రకారం, మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ కౌశల్ తెలిపారు. 


Updated Date - 2022-04-14T21:28:58+05:30 IST