Abn logo
Apr 20 2021 @ 23:22PM

కెమికల్‌ గోదాము అగ్నికి ఆహుతి

కింద కెమికల్స్‌... పైన కాపురాలు

11 కుటుంబాల హాహాకారాలు

స్థానికులు, ఫైర్‌ సిబ్బంది చొరవ

తప్పిన పెను ప్రమాదం

అనధికార గోదాములపై ప్రజల ఆగ్రహం


అదో నాలుగు అంతస్తుల భవనం. సమయం ఉదయం సుమారు 8 గంటలు. పెద్దలు ఎవరి పనిలో వారున్నారు. పిల్లలేమో స్కూళ్లకు సెలవులు కావడంతో అప్పుడప్పుడే నిద్ర లేస్తున్నారు. ఉన్నట్టుండి దట్టమైన పొగ పై అంతస్తుల్లోని ఇళ్లలోకి చొరబడింది. ఏమైందా..? అని కిందకు చూస్తే గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. మెట్లు దిగి కిందకు రాలేని పరిస్థితి. ప్రాణ భయంతో 11 కుటుంబాలు హాహాకారాలు చేశాయి. చుట్టుపక్కల వారు, అగ్నిమాపక శాఖ సకాలంలో స్పందించడంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. నెల్లూరు నగరం బోడిగోడితోట ప్రాంతం పీసీ నాయుడు నగర్‌ 1వ వీధిలోని కెమికల్‌ గోదాములో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదం తీరిది.

 

నెల్లూరు(క్రైం), ఏప్రిల్‌ 20 : పప్పులవీధిలో వెంకటసాయి కెమికల్స్‌ పేరుతో రసాయనాల వ్యాపారం చేసే రవిచంద్ర అనే వ్యక్తికి పీసీ నాయుడు నగర్‌లో నాలుగు అంతస్తుల భవనం ఉంది. వ్యాపారానికి సంబంధించిన స్టాక్‌ను ఆ ఇంటి గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నిల్వ చేశాడు. మిగిలిన మూడు అంతస్తుల్లో 11 కుటుంబాలు బాడుగకు ఉంటున్నాయి. మంగళవారం ఉదయం ఆ గోదాము నుంచి పొగలు వెలువడ్డాయి. కొద్ది సేపటికే భారీగా మంటలు చెలరేగాయి. భవనం వెనుక కారు మెకానిక్‌ షెడ్డు, లారీ షెడ్డు ఉన్నాయి. మంటలను గమనించిన వారు వెంటనే ఆ ఇళ్లలోని వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఇంతలో స్థానికులు భయాందోళనతో ఇళ్ల నుంచి పరుగుతీశారు. ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. భవనం వెనుక వైపు నుంచి నిచ్చెనలు వేసి 11 కుంటుంబాల్లోని 25 మందిని బయటకు తీసుకువచ్చారు. అయితే మొదటి అంతస్తులో మంచంపై పడుకుని ఉన్న ఓ వ్యక్తికి మంటలు అంటుకోవ డంతో శరీరం కొంతభాగం కాలింది. అదే ఇంట్లో ఉండే దినేష్‌ అనే వ్యక్తి భయంతో భవనంపై నుంచి దూకేయడంతో కళ్లకు గాయాలయ్యాయి. వారిద్దరిని 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. డీఎఫ్‌వో శ్రీకాంత్‌రెడ్డి, నగర డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తమ ప్రాంతంలో అనధికారికంగా కెమికల్‌ గోదాములు నిర్వహిస్తున్నారని ఎన్నిసార్లు అధికారులు, నాయకులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు.


పక్కనే మరో భారీ గోదాము


అగ్నిమాపక వారోత్సవాల్లో మంగళవారం చివరి రోజు కావడంతో ఆ వేడుకలకు ఫైర్‌ సిబ్బంది సిద్ధమవుతున్నారు. ఇంతలో కెమికల్‌ గోడౌన్‌లో అగ్నిప్రమాదం అంటూ ఫోన్‌ రావడంతోనే సిబ్బంది అందరూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు అదుపు చేయడంతోపాటు పైఅంతస్తుల్లోని వారిని సురక్షితంగా కిందకు దించారు.  ఈ సందర్భంగా డీఎఫ్‌వో శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ అగ్నిప్రమాదానికి కెమికల్సే కారణమని ప్రాఽథమికంగా నిర్థారించామని చెప్పారు. ఆస్తి నష్టం ఎంత జరిగిందో తేల్చాల్సి ఉందన్నారు. కాగా, ఈ ప్రమాదం జరిగిన గోదాముకు పది అడుగుల దూరంలో మరో కెమికల్‌ గోదామును అధికారులు గుర్తించారు. డీఎఫ్‌వో శ్రీకాంత్‌రెడ్డి ఆ గోడౌన్‌  తాళాలను పగలగొట్టించి లోపల పరిశీలించగా భారీ స్థాయిలో కెమికల్స్‌, బ్లీచింగ్‌ కనిపించాయి. కాగా, టీడీపీ నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ నాయకుడు ముక్కాల ద్వారకానాథ్‌, వివిధ పార్టీల నాయకులు కూడా ప్రమాద స్థలిని పరిశీలించారు.  


ప్రమాదస్థలికి సమీపంలోని మరో కెమికల్‌ గోడౌన్‌ను పరిశీలిస్తున్న డీఎఫ్‌వో, డీఎస్పీ తదితరులు


Advertisement
Advertisement
Advertisement