ప్రధాని కాన్వాయ్‌ను అడ్డుకున్న కేసు: 150 మంది గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్

ABN , First Publish Date - 2022-01-08T02:50:27+05:30 IST

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాన్వాయ్‌ను అడ్డుకున్న..

ప్రధాని కాన్వాయ్‌ను అడ్డుకున్న కేసు: 150 మంది గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్

న్యూఢిల్లీ: పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాన్వాయ్‌ను అడ్డుకున్న కేసులో 150 మంది గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 283 కింద ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. మరోవైపు, మోదీ పర్యటన సందర్భంగా వెలుగుచూసిన ‘తీవ్రమైన భద్రతా లోపం’పై కేంద్రం నియమించిన ప్యానెల్ దర్యాప్తు ప్రారంభించింది. ఇంకోవైపు, పంజాబ్ ప్రభుత్వం కూడా దీనిపై కేంద్రానికి నివేదిక అందించింది. ఈ ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయాన్ని తెలియజేసింది.


ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్యానల్‌కు కేబినెట్ సెక్రటేరియర్ కార్యదర్శి (సెక్యూరిటీ) సుధీర్ కుమార్ సక్సేనా సారథ్యం వహిస్తుండగా, ఇంటెలిజెన్స్ బ్యూరో సంయుక్త డైరెక్టర్ బల్బీర్ సింగ్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఐజీ ఎస్ సురేశ్ సభ్యులుగా ఉన్నారు.


ఈ ఉదయం ఫిరోజ్‌పూర్‌లోని ప్యారాయణ ఫ్లై ఓవర్‌ను సందర్శించిన దర్యాప్తు బృందం పంజాబ్ పోలీస్ సీనియర్ అధికారి, ఇతర అధికారులను కలిసి వివరాలు సేకరించింది. దాదాపు 45 నిమిషాల పాటు ఫ్లై ఓవర్ పైనే ఉన్న బృందం ఆ తర్వాత దర్యాప్తు నిమిత్తం బీఎస్ఎఫ్ సెక్టార్ హెడ్‌క్వార్టర్స్‌‌కు వెళ్లింది.  

Updated Date - 2022-01-08T02:50:27+05:30 IST