Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 18 2021 @ 16:47PM

ఆగ్రా మసీదు ముఫ్తీపై కేసు నమోదు

ఆగ్రా : జాతీయ జెండాను అవమానించినందుకు రాయల్ జామా మసీదు ముఫ్తీ ఖుబైబ్ రూమీపై కేసు నమోదు చేసినట్లు మంటోలా పోలీసులు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా మసీదులో జాతీయ జెండాను ఎగురవేయడం ఇస్లాం వ్యతిరేక చర్య అని ప్రకటించినట్లు వచ్చిన ఫిర్యాదుపై ఈ చర్య తీసుకున్నట్లు చెప్పారు. ఆయనతోపాటు ఆయన కుమారుడు హమ్‌దుల్ ఖుద్దుస్ రూమీపై ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్, 1971; ఐపీసీ సెక్షన్లు 3, 153బీ, 508, 505(1)(బీ)ల ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. 


స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఆగస్టు 15న ఆగ్రాలోని రాయల్ జామా మసీదులో ఉత్తర ప్రదేశ్ మైనారిటీ కమిషన్ చైర్మన్ అష్ఫక్ సైఫీ నేతృత్వంలో స్థానికులు జాతీయ జెండాను ఎగురవేశారు. మసీదులో జాతీయ జెండాను ఎగురవేయడాన్ని ముఫ్తీ రూమీ తీవ్రంగా ఖండించారు. ఇది ఇస్లాం వ్యతిరేక చర్య అని ప్రకటించారు. 


దీంతో స్థానిక హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశ వ్యతిరేక భావాలను రెచ్చగొడుతున్న ముఫ్తీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అష్ఫక్ సైఫీ కూడా ముఫ్తీ వ్యాఖ్యలను ఖండించారు. బాధ్యతారహితంగా చేసిన వ్యాఖ్యలను ముఫ్తీ ఉపసంహరించుకోవాలని, క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. మసీదు నిర్వహణ కమిటీ అధ్యక్షుడు అస్లాం ఖురేషీ మాట్లాడుతూ, ముఫ్తీ రూమీని ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 


ఆలిండియా జమిత్ ఉల్ ఖురేష్‌కు చెందిన హాజీ జమిలుద్దీన్ స్పందిస్తూ, ముఫ్తీ రూమీకి మద్దతుగా నిలిచారు. రాయల్ జామా మసీదు మతపరమైన ప్రదేశమని చెప్పారు. ఇక్కడ కేవలం మతపరమైన కార్యక్రమాలు మాత్రమే జరగాలన్నారు. భారతీయ ముస్లిం వికాస్ పరిషత్ చైర్మన్ సమీ అఘాయ్ మాట్లాడుతూ, మసీదులో జాతీయ జెండాను ఎగురవేయకుండా ఉండవలసిందన్నారు. మసీదు మతపరమైన ప్రదేశం కాబట్టి జాతీయ జెండాను గేటుకు పెట్టి ఉండవలసిందన్నారు. 


Advertisement
Advertisement