మోదీ ఫొటో తారుమారు చేసి ట్వీట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు

ABN , First Publish Date - 2020-08-09T22:08:37+05:30 IST

మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జీతూ పట్వారీపై పోలీసులు కేసు

మోదీ ఫొటో తారుమారు చేసి ట్వీట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు

ఇండోర్ : మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జీతూ పట్వారీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గౌరవాన్ని, హిందూ మతస్థుల మనోభావాలను గాయపరిచారని ఫిర్యాదు రావడంతో ఈ చర్య తీసుకున్నారు. 


ఛత్రిపుర పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అధికారి పవన్ సింఘాల్ తెలిపిన వివరాల ప్రకారం, బీజేపీ నగర శాఖ అధ్యక్షుడు గౌరవ్ రణదివె ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే జీతూ పట్వారీపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188, సెక్షన్ 464 ప్రకారం ఆరోపణలు నమోదు చేశారు. 


పట్వారీ ట్వీట్ చేసిన మోదీ ఫొటో చూసినపుడు, దానిని టాంపరింగ్ చేసినట్లు వెల్లడవుతోందని పవన్ సింఘాల్  చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టరాదని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసిందని, ఈ ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసు నమోదు చేశామని తెలిపారు. 


మోదీ ఆగస్టు 5న అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమి పూజ చేసినప్పటి ఫొటోను జితూ పట్వారీ ఉపయోగించుకున్నారు. ఈ ఫొటోలో మోదీ తన ముఖానికి మాస్క్ ధరించి, చేతితో ఓ పాత్ర పట్టుకున్నట్లు కనిపిస్తున్నారు. పట్వారీ ఈ ఫొటోను తన ట్వీట్‌తోపాటు జత చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ, వ్యాపార రంగం, రైతుల ఆదాయాలు తగ్గిపోతున్నాయని,  ఉద్యోగాలు పోతున్నాయని, నిరుద్యోగం పెరిగిపోతోందని, కార్మికులు కష్టాల్లో ఉన్నారని పేర్కొన్నారు. ఇవేవీ టెలివిజన్ చర్చల్లో రావడం లేదని, ఎందుకంటే, మనం భిక్షాపాత్రతో వెళ్తామని పేర్కొన్నారు. 


ఈ ట్వీట్‌ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందని, ప్రధాని మోదీ గౌరవాన్ని కించపరుస్తోందని నగర బీజేపీ అధ్యక్షుడు గౌరవ్ రణదివె ఫిర్యాదు చేశారు. ఇండోర్ లోక్‌సభ సభ్యుడు శంకర్ లాల్వానీ, స్థానిక నేతలు కూడా ఈ ట్వీట్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. 


Updated Date - 2020-08-09T22:08:37+05:30 IST