నిధుల దుర్వినియోగంపై Medha Patkarపై కేసు

ABN , First Publish Date - 2022-07-11T13:27:02+05:30 IST

నర్మదా బచావో ఆందోళన్ నేత మేధా పాట్కర్‌తో పాటు మరో 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనం రేపింది....

నిధుల దుర్వినియోగంపై Medha Patkarపై కేసు

భోపాల్(మధ్యప్రదేశ్): నర్మదా బచావో ఆందోళన్ నేత మేధా పాట్కర్‌తో పాటు మరో 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనం రేపింది. మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాలో నర్మదా బచావో ఆందోళన్ నాయకురాలు మేధా పాట్కర్ గిరిజన విద్యార్థుల విద్యా సౌకర్యాల కల్పన కోసం సేకరించిన నిధులను రాజకీయ, దేశ వ్యతిరేక ఎజెండా కోసం మళ్లించారని ఒక గ్రామస్థుడు చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.కాగా తనపై వచ్చిన ఆరోపణలను తప్పు అని మేధాపాట్కర్ తోసిపుచ్చారు. బ్యాంకు ఖాతా, ఖర్చుల ఆడిట్ ఉందని, ఈ ఆరోపణల వెనుక రాజకీయ కారణాలున్నాయని మేధా పాట్కర్ చెప్పారు.ప్రైవేట్ ఫిర్యాదు మేరకు మేధా పాట్కర్ తదితరులపై కేసు నమోదు చేశామని, అందులో ఫిర్యాదుదారు కొన్ని పత్రాలను అందించారని బర్వానీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దీపక్ కుమార్ శుక్లా తెలిపారు.


పాత లావాదేవీలకు సంబంధించిన కేసు కావడంతో సమగ్ర విచారణ జరుపుతామని ఎస్పీ చెప్పారు. తెమ్లా బుజుర్గ్ గ్రామానికి చెందిన ప్రీతమ్‌రాజ్ బడోలె అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు బర్వానీ పోలీస్ స్టేషన్‌లో మేధాపాట్కర్ పై కేసు నమోదు చేశారు.ముంబైలో నమోదైన ట్రస్ట్ నర్మదా నవనిర్మాణ అభియాన్ (ఎన్‌ఎన్‌ఎ) మధ్యప్రదేశ్,మహారాష్ట్రలోని నర్మదా వ్యాలీలోని గిరిజన విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ విద్యా సౌకర్యాల కల్పన కోసం సేకరించిన నిధులను దుర్వినియోగం చేసిందని బడోలే ఆరోపించారు.గత 14 ఏళ్లలో ఎన్‌ఎన్‌ఎ వివిధ వనరుల నుంచి రూ. 13.50 కోట్లు పొందిందని, అయితే ఈ నిధులను రాజకీయ, దేశ వ్యతిరేక ఎజెండా కోసం ఉపయోగించారని, దీనికి విచారణ అవసరమని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.


ఎఫ్‌ఐఆర్‌లో మేధా పాట్కర్, పర్వీన్ రూమీ జహంగీర్, విజయ చౌహాన్, కైలాష్ అవస్య, మోహన్ పాటిదార్, ఆశిష్ మాండ్లోయ్, కేవల్ సింగ్ వాసవే, సంజయ్ జోషి, శ్యామ్ పాటిల్, సునీత్ ఎస్ఆర్, నూర్జీ పద్వీ,కేశవ్ వాసవే పేర్లు ఉన్నాయి.‘‘ఈ కేసు రెండు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు సంబంధించినది. పత్రాలు, వాస్తవాలను సమర్పించడానికి అనుమస్తాం. దర్యాప్తులో తేలిన వాస్తవాల ప్రకారం తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని ఎస్పీ చెప్పారు.ఈ ఆరోపణలను కొట్టిపారేసిన పాట్కర్, పోలీసుల నుంచి కేసు నమోదుపై తనకు ఇంకా ఎటువంటి సమాచారం రాలేదని అన్నారు.తాను ఇలాంటి ఆరోపణలకు గురికావడం ఇదే మొదటిసారి కాదని పాట్కర్ పేర్కొన్నారు. 


బ్యాంకు ఖాతా నిధులు,ఆడిట్ అందుబాటులో ఉన్నందున వాటన్నింటికీ సమాధానం ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని మేధా పాట్కర్ పేర్కొన్నారు.ఫిర్యాదుదారు ఆర్ఎస్ఎస్,ఏబీవీపీతో సంబంధం కలిగి ఉండవచ్చని ఆమె ఆరోపించారు. తన సంస్థకు విదేశాల నుంచి నిధులు అందడం లేదని, అన్ని నిధులను ఏటా క్షుణ్ణంగా ఆడిట్ చేస్తున్నామని పునరుద్ఘాటించారు.ఈ కేసు వెనుక రాజకీయ కారణాలు ఉండవచ్చునని లేదా పరువు తీయడానికి కుట్ర కావచ్చునని మేధాపాట్కర్ అన్నారు.‘‘వ్యవస్థపై ప్రశ్నలు వేసి సరైన పని చేసేవారిని దేశ వ్యతిరేకులు అంటారు.. ప్రజలే నిర్ణయిస్తారని’’ పాట్కర్ వివరించారు. 


Updated Date - 2022-07-11T13:27:02+05:30 IST