ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐపీఎస్ అధికారి రష్మి శుక్లాపై ఎఫ్ఐఆర్

ABN , First Publish Date - 2022-02-27T01:17:38+05:30 IST

అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పుణె మాజీ కమిషనర్, ఐపీఎస్ అధికారిణి ..

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐపీఎస్ అధికారి రష్మి శుక్లాపై ఎఫ్ఐఆర్

పుణె: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పుణె మాజీ కమిషనర్, ఐపీఎస్ అధికారిణి రష్మి శుక్లాపై తాజాగా ఎఫ్ఐఆర్ నమోదైంది. పుణెలోని బంద్ గార్డెన్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ హయాంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటేలే ఫోన్‌‍ను ఆమె ట్యాపింక్ చేశారనే ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసు అధికారులు శనివారంనాడు తెలిపారు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్-1885‌లోని సెక్షన్ 26 కింద ఈ కేసు నమోదైంది.


నార్కోటిక్స్ స్మగ్లింగ్ కేసులో అంజాద్ ఖాన్‌ అనే వ్యక్తికి ప్రమేయం ఉందనే సాకుతో 2016-17తో తన ఫోన్‌ను ట్యాప్ చేశారని గత ఏడాది నానా పటోలే ఆరోపంచారు. కేంద్ర మంత్రి దన్వే వ్యక్తిగత సహాయకుడు. అప్పటి బీజేపీ ఎంపీ సంజయ్ కాకడే, ఇతర ఎన్నికైన ప్రతినిధుల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినట్టు ఆయన ఆరోపించారు.


అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నట్టు ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించింది. 2015-2019 మధ్య ఫోన్ ట్యాపింగ్ కేసులపై దర్యాప్తు జరిపేందుకు డీజీపీ సంజయ్ పాండే సారథ్యంలో త్రిసభ్య కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీలో ఇతర సభ్యులుగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ (ఎస్ఐడీ) కమిషనర్, స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ కమిషనర్ ఉన్నారు. కమిటీ ఇటీవల సమర్పించిన నివేదికను ప్రభుత్వం ఆమోదించడంతో రష్మి శుక్లాపై బంద్ గార్డెన్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పుణె పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.


రష్మి శుక్లా 2016 మార్చి, 2018 జూలై మధ్య పుణె సిటీ పోలీస్ కమిషనర్‌గా ఉన్నారు. ఆ సమయంలోనే ఆమె ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో సీఆర్‌పీఎఫ్ (సౌత్ జోన్) అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. ఇటీవలే భీమా కొరెగావ్ దర్యాప్తు కమిషన్ ముందు విచారణకు హాజరైన రష్మి ఆ కేసులో వాంగ్మూలం ఇచ్చారు.

Updated Date - 2022-02-27T01:17:38+05:30 IST