Sanna Marin: ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలో చిందేసిన ఫిన్లాండ్ పీఎం.. డ్రగ్ టెస్ట్ నిర్వహించాలంటున్న ప్రతిపక్షాలు

ABN , First Publish Date - 2022-08-19T02:36:42+05:30 IST

ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధానిగా రికార్డులకెక్కిన ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్‌ (Sanna Marin) వివాదంలో

Sanna Marin:  ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలో చిందేసిన ఫిన్లాండ్ పీఎం.. డ్రగ్ టెస్ట్ నిర్వహించాలంటున్న ప్రతిపక్షాలు

హెల్సింకి: ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధానిగా రికార్డులకెక్కిన ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్‌ (Sanna Marin) వివాదంలో చిక్కుకున్నారు.  కారణం.. ఓ వీడియో. 28 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలను చుట్టేస్తోంది. ఒక్క రోజు కూడా కాకుండానే ఏకంగా 3.1 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న ఈ వీడియో ఓ పార్టీకి సంబంధించినది. అందులో ప్రధాని సనా కూడా ఉండడమే ప్రతిపక్షాల విమర్శలకు అసలు కారణం.  ప్రధాని తన స్నేహితులతో కలిసి పాడుతూ చిందేస్తూ కనిపించారు. 


వీడియో బయటకు రావడమే ఆలస్యం ప్రధాని సనా మారిన్‌పై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. ఆ పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకుని ఉంటారని, అందుకనే అలా చిందులేస్తున్నారని విమర్శించాయి. అంతేకాదు, ఆమెకు డ్రగ్ టెస్ట్ కూడా చేయించాలని డిమాండ్ చేస్తున్నాయి. తనపై వస్తున్న ఆరోపణలపై ప్రధాని మారిన్ స్పందించారు. డ్రగ్స్ తీసుకున్నానన్న వార్తలను ఖండించారు. ఆ పార్టీలో తను ఆల్కహాల్ మాత్రమే తీసుకున్నానని వివరించారు. వీడియో తీస్తున్న విషయం తనకు తెలుసన్న ప్రధాని.. అది బహిరంగం కావడం మాత్రం విచారకరమని పేర్కొన్నారు. 


తాను ఓ పాటకు డ్యాన్స్ చేశానని, అది చట్టబద్ధమేనని ప్రధాని పేర్కొన్నారు. ఈ మాత్రానికి తాను తన ప్రవర్తనను మార్చుకోవాల్సిన అవసరం లేదని, తానెప్పుడూ ఎలా ఉంటానో ఇకపై కూడా అలానే ఉంటానన్నారు. 36 ఏళ్ల సనా తరచూ మ్యూజిక్ ఫెస్టివల్స్‌కు హాజరవుతుంటారు. ఫొటోలకు పోజులిస్తుంటారు. గతేడాది ఓ కరోనా రోగితో సన్నిహితంగా మెలిగిన తర్వాత క్లబ్‌కు వెళ్లినందుకు మారిన్ క్షమాపణలు తెలిపారు. కాగా, గత వారం జర్మనీకి చెందిన న్యూస్ అవుట్‌లెట్ ‘బిల్డ్’ మారిన్‌ను ‘కూలెస్ట్ ప్రధానమంత్రి’గా అభివర్ణించింది. 



Updated Date - 2022-08-19T02:36:42+05:30 IST