Partying video leak: ఫిన్లాండ్ ప్రధాని చిందులు... వీడియో లీక్... డ్రగ్ టెస్ట్‌లో దొరికిపోతారా?...

ABN , First Publish Date - 2022-08-20T15:45:31+05:30 IST

ఫిన్లాండ్ ప్రధాన మంత్రి సన్నా మారిన్ (Sanna Marin) తన స్నేహితులతో

Partying video leak: ఫిన్లాండ్ ప్రధాని చిందులు... వీడియో లీక్... డ్రగ్ టెస్ట్‌లో దొరికిపోతారా?...

న్యూఢిల్లీ : ఫిన్లాండ్ ప్రధాన మంత్రి సన్నా మారిన్ (Sanna Marin) తన స్నేహితులతో, వ్యాపార ప్రముఖులతో పార్టీ చేసుకుని, చిందులేస్తూ, పాటలు పాడినట్లు కనిపిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. దీంతో ఆమె డ్రగ్స్ సేవించారా? లేదా? తెలుసుకునేందుకు డ్రగ్ స్క్రీనింగ్ చేయించుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల డిమాండ్‌కు తలొగ్గిన ఆమె డ్రగ్ టెస్ట్ చేయించుకున్నారు. తాను ఎన్నడూ మాదక ద్రవ్యాలను సేవించలేదని చెప్పారు.


సన్నా మారిన్ (36) విలేకర్ల సమావేశంలో  మాట్లాడుతూ, శనివారం రాత్రి తాను తన అధికారిక విధులను నిర్వహించేందుకు ఎటువంటి ఆటంకాలు కలగలేదని చెప్పారు. విధి నిర్వహణకు హాజరు కావలసిన పరిస్థితి వచ్చి ఉంటే, తాను హాజరై ఉండేదానినని చెప్పారు. మాదక ద్రవ్యాలను వాడే చోట తాను ఉన్నానని, తాను మాదక ద్రవ్యాలను వాడానని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఈ ఆరోపణలను తాను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నానని చెప్పారు. డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలనే డిమాండ్ అన్యాయమని భావిస్తున్నానని, అయితే చట్టపరమైన రక్షణ కోసం, సందేహాలను నివృత్తి చేయడం కోసం తాను డ్రగ్ టెస్ట్ చేయించుకున్నానని తెలిపారు. ఈ పరీక్షల ఫలితాలు ఓ వారంలో వస్తాయన్నారు. 


మారిన్ ఫిన్లాండ్‌లోని అత్యంత పలుకుబడిగలవారితో పార్టీ చేసుకుని, నృత్యం చేసి, పాటలు పాడినట్లు వీడియో బయటపడటంతో ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆమె మాదక ద్రవ్యాలు సేవించారా? లేదా? తెలుసుకునేందుకు డ్రగ్ స్క్రీనింగ్ చేయించుకోవాలని డిమాండ్ చేశాయి. గతంలో కూడా ఆమె అనేక మ్యూజిక్ ఫెస్టివల్స్‌కు హాజరయ్యారు, పాలనపై కన్నా పార్టీలు చేసుకోవడంపైనే ఆమెకు ఎక్కువ శ్రద్ధ ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటువంటి పనులు ప్రధాన మంత్రి పదవిని నిర్వహిస్తున్నవారు చేయదగినవి కాదని మండిపడుతున్నాయి. 


సన్నా మారిన్ 2019 డిసెంబరులో ఫిన్లాండ్ ప్రధాన మంత్రి పదవిని చేపట్టారు. ప్రపంచంలో అత్యంత తక్కువ వయసులో ఓ దేశానికి నాయకత్వం వహిస్తున్న నేతగా రికార్డు సృష్టించారు. 


ఇదిలావుండగా, ప్రధాన మంత్రి పదవితోపాటు ప్రైవేటు జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తున్నారని ఆమెను కొందరు ప్రశంసిస్తున్నారు. 


రష్యా సరిహద్దుల్లో ఫిన్లాండ్ ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత నాటో (The North Atlantic Treaty Organization)లో తమను చేర్చుకోవాలని ఫిన్లాండ్ దరఖాస్తు చేసింది. 


Updated Date - 2022-08-20T15:45:31+05:30 IST