భళా నేత కళ!

ABN , First Publish Date - 2022-08-07T06:13:04+05:30 IST

ఇలాంటి నేత కార్మికులను ప్రోత్సహించేందుకు ఏటా రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను అందజేస్తుంది. ఈసారి సిద్దిపేటకు చెందిన ముగ్గురు చేనేత కళాకారులకు ఈ రాష్ట్రస్థాయి పురస్కారం లభించింది.

భళా నేత కళ!
పట్టు చీరపై నేసిన రామప్ప ఆలయంపై గల శిలలు

ముగ్గురు నేతన్నలకు రాష్ట్రస్థాయి పురస్కారాలు

రామప్ప, గొల్లభామ రకం పట్టుచీరలు నేసిన నేత కళాకారులకు దక్కిన గౌరవం

నేడు చేనేత దినోత్సవం సందర్భంగా ప్రదానం 


సిద్దిపేట రూరల్‌, ఆగస్టు 6 : కుచ్చిళ్ల నుంచి కొంగు వరకు వినూత్న డిజైన్‌లలో చీరలను నేస్తున్న నేతన్నల కళ భళా అనిపిస్తుంది. జిల్లాలోని పలువురు చేనేత కార్మికులు నేస్తున్న పట్టుచీరలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆ పట్టుచీరలపై ఒదిగిన డిజైన్లను చూస్తే వారిని నేత కార్మికులని కాదు నేత కళాకారులు అనాల్సిందే. ఓ నేత కళాకారుడు రామప్ప ఆలయ ఆకృతిని పట్టుచీరపై నేస్తే, మరో కళాకారుడు రామప్ప ఆలయ నృత్య శిలలును పట్టుచీరపై రూపొందించాడు. ఇక ఏనాటి నుంచో పేరుగాంచిన మన సిద్దిపేట ప్రత్యేక చీరలు గొల్లభామ రకం గురించి ఎంత చెప్పినా తక్కువే ఇలాంటి నేత కార్మికులను ప్రోత్సహించేందుకు ఏటా రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను అందజేస్తుంది. ఈసారి సిద్దిపేటకు చెందిన ముగ్గురు చేనేత కళాకారులకు ఈ రాష్ట్రస్థాయి పురస్కారం లభించింది. 

రామప్ప ఆలయం ఆకృతి పట్టుచీర నేసిన ఆదర్శ చేనేత సహకార సంఘం నేత కార్మికుడు పత్తిపాక ఎల్లయ్య, రామప్ప ఆలయం నృత్య శిలలతో పట్టుచీర రూపొందించిన ఇర్కోడు చేనేత సహకార సంఘానికి చెందిన వీరబత్తిని శివరాజం, గొల్లభామ పట్టుచీరకు కాళ్లకుంటకాలనీకి చెందిన వేముల దేవదాసుకు ఈ గౌరవం దక్కింది. నేడు చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో వారు ఈ పురస్కారాన్ని అందుకోనున్నట్లు చేనేత సహకార సంఘాల జిల్లా అధికారి సంతోష్‌కుమార్‌ తెలిపారు. జిల్లాకు చెందిన ఈ ముగ్గురు నేత కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం అవార్డుతో సత్కరించనుందని ఆయన వెల్లడించారు.

చాలా సంతోషంగా ఉంది

ఇటీవల ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రామప్ప ఆలయం నమూనాను పట్టుచీరలపై నేయడం నాకు లభించిన అవకాశం అదృష్టంగా భావిస్తున్నాను. చీర నేసేటప్పుడు అనేక సందేహాలు వచ్చినప్పటికీ పట్టుచీర నేసి తీరాను. ప్రభుత్వం గుర్తిస్తుందని అనుకోలేదు. స్థానిక అధికారుల సహకారంతో తోటి కార్మికుల సలహాలతో రోజుకు సుమారు మూడు చీరలు నేస్తూ జీవనం సాగిస్తున్నాను. భవిష్యత్తులో మరిన్ని వినూత్నమైన పట్టుచీరలు నేసేందుకు కృషి చేస్తాను.

- పత్తిపాక ఎల్లయ్య, ఆదర్శ చేనేత సహాకార సంఘం, సిద్దిపేట

అదృష్టంగా భావిస్తున్నాను

రామప్ప ఆలయంపై గల నృత్య కళాకారుల ప్రతిమలను పట్టుచీరపై నేయడం అదృష్టంగా భావిస్తున్నాను. పట్టుచీరపై పని మొదలు పెట్టినప్పుడు కొంత ఇబ్బంది అనిపించిన తదనంతరం సులభతరమైంది. సిద్దిపేట ప్రాంతం చీరలు నేయడంలో నైపుణ్యం గల కార్మికులు ఉన్నారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సబ్సిడీ వంటి సహకారాలు అందిస్తే బాగుంటుంది. అవార్డు తీసుకోవడం మరింత ఉత్సాహాన్ని నింపింది.

- వీరబత్తిని శివరాజం, ఇందిరనగర్‌

గొల్లభామ చీరతో గుర్తింపు

సిద్దిపేటలో నేసిన గొల్లభామ చీరలు వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేకతను చాటుకున్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి గొల్లభామ ప్రతిమలతో పట్టుచీరనేసే అవకాశం నాకు లభించడం సంతోషంగా ఉంది. గొల్లభామ ప్రతిమల పోతతోనే నాకు రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తే చేనేత కార్మికుల జీవితాలు మారుతాయి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్‌తో పాటు ముడిసరుకులకు సబ్సిడీ సహాకారం అందిస్తే బాగుంటుంది.

- వేముల దేవాదాసు, కాళ్లకుంట కాలనీ


Updated Date - 2022-08-07T06:13:04+05:30 IST