‘సన్నాల’పై నిరాశ

ABN , First Publish Date - 2020-10-30T11:03:08+05:30 IST

ప్రభుత్వం వానాకాలం పంటల్లో రైతులను నియంత్రిత సాగు వైపు మళ్లించింది.

‘సన్నాల’పై నిరాశ

సన్నరకం ధాన్యానికి మద్దతు ధర ప్రకటించని కేంద్రం

దొడ్డు రకం ఏ గ్రేడ్‌ ధాన్యం కంటే సన్నాలకు తక్కువ ధరే 

బోనస్‌ ప్రకటించాలని రైతుల డిమాండ్‌

జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు షురూ


(ఆంధ్రజ్యోతిసిరిసిల్ల): ప్రభుత్వం వానాకాలం పంటల్లో రైతులను నియంత్రిత సాగు వైపు మళ్లించింది. ఈసారి సన్న రకాలను సాగు చేసే విధంగా ప్రొత్సహించినా చివరకు రైతులకు నిరాశే మిగిలింది. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందని దొడ్డు రకాని కంటే మద్దతు ధర ఎక్కువ లభిస్తుందని ప్రకృతి కష్టాలను అఽధిగమించి సన్నరకాలను సాగు చేసిన రైతులు అయోమయంలో పడ్డారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించకపోగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం కూడా ప్రకటించలేదు. మరోవైపు దొడ్డు రకం ఏ గ్రేడ్‌ కంటే తక్కువ ధరకే కొనుగోలు చేసే పరిస్థితి ఉండడంతో రైతులు మళ్లీ దళారులను అశ్రయించే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు సన్నాల సాగులో అధిక ఖర్చుతో పాటు దిగుబడి, కాలపరిమితి కూడా ఎక్కువగానే ఉండడంతో రైతులు నష్టపోతామని తమకు బోనస్‌ ఇవ్వాలని కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 224 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలను పలు చోట్ల ప్రారంభించారు. గత వానాకాలం సీజన్‌లో 1.80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించగా ఈ సారి 3.10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బందులు లేకుండా ఐకేపీ ద్వారా 72, సింగిల్‌ విండోల ద్వారా 140, డీసీఎంస్‌ ద్వారా మూడు, మెప్మా ద్వారా రెండు, ఎంఎన్‌సీ ద్వారా ఏడు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 


సన్న రకాలపైనే అయోమయం 

జిల్లాలో ఈ సారి 2.47 లక్షల ఎకరాల్లో వానాకాలం సాగు చేపట్టగా సన్న రకాల సాగు గణనీయంగా పెంచారు. ఇందులో వరి 1.39 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఇందులో 47.69 శాతం నియంత్రిత సాగులో భాగంగా సన్నరకం వేశారు. 66,621 ఎకరాల్లో సన్నరకం సాగు చేయగా 73,070 ఎకరాల్లో దొడ్డు రకం సాగు చేశారు. ప్రభుత్వం సన్నరకాలకు ప్రొత్సహాకాన్ని ఎక్కువగా అందిస్తుందని రైతులు భావించారు. ప్రస్తుతం ప్రభుత్వం కనీస మద్దతు ధర కింద గ్రేడ్‌ ఏ రకం దొడ్డు ధాన్యానికి క్వింటాలుకు రూ.1,888, సాధారణ రకానికి క్వింటాలుకు రూ. 1,868 ప్రకటించారు. ప్రభుత్వం నుంచి సన్నరకాలకు ప్రొత్సాహం ఉంటుందని భావించినా ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు సన్నరకం ధాన్యం ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారం సాధారణ రకం కిందనే రూ. 1,868కే కొనుగోలు చేయనున్నారు. రైతులు మాత్రం సన్నాలకు క్వింటాలుకు రూ.2,500 మద్దతు ధర ప్రకటించాలని లేదంటే రూ. 200 వరకు బోనస్‌ ఇవ్వాలని కోరుతున్నారు. సన్నరకం సాగులో దొడ్డురకం నాలుగు నెలలకే పంట చేతికి వస్తే బీపీటీ, ఇతర సన్నరకాలు మాత్రం ఐదు నెలలకు దిగుబడి వస్తుంది. అంతేకాకుండా తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటుంది. దొడ్డురకం ఎకరానికి 40 బస్తాల దిగుబడి వస్తే, సన్నాలు 30 బస్తాలే వస్తాయి. చివరకు గడ్డి కూడా దొడ్డు రకందే ఎక్కువగా కొనుగోలు చేస్తారు. దీంతో రైతులు సన్నరకాల అమ్మకాలపై అందోళన చెందుతున్నారు.


 జిల్లాలో మండలాల వారీగా వరి సాగు.. 

 వరిసాగులో జిల్లాలోని  ఇల్లంతకుంట మండలంలో 17,810 ఎకరాలు, సిరిసిల్లలో 2,937 ఎకరాలు, తంగళ్లపల్లిలో 15,537 ఎకరాలు, బోయినపల్లిలో 11,148 ఎకరాలు, చందుర్తి 10,908 ఎకరాలు, కోనరావుపేట 13,000 ఎకరాలు, రుద్రంగి 3,845 ఎకరాలు, వేములవాడ 3,672 ఎకరాలు, వేములవాడ రూరల్‌ 8,379 ఎకరాలు, గంభరావుపేట 16,856 ఎకరాలు, ముస్తాబాద్‌ 17,812 ఎకరాలు, వీర్నపల్లి 10,600 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 10,620 ఎకరాల్లో సాగు చేశారు.  


సన్న రకానికి మద్దతు ధర పెంచాలి..సామ నర్సింహ్మరెడ్డి, రైతు, ముస్కానిపేట

 ప్రభుత్వం చెప్పినట్టు సన్న రకపు వరిని సాగుచేసినందున మద్దతు ధరను పెంచాలి. సన్న రకపు వరి సాగుచేయడం వల్ల పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువగా వచ్చింది. రెండు ఎకరాలలో వరి పంటను వేశాను. ప్రభుత్వం క్వింటాళుకు రూ. 2500 చెల్లించాలి. లేకుంటే తీవ్రంగా నష్టపోతాం. 


బోనస్‌ చెల్లించాలి..చెవుల శ్రీనివాస్‌, రైతు అక్కపల్లి

మాది ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి. నాకున్న ఆరు ఎకరాల్లో మూడు ఎకరాలు సన్న రకం, మరో మూడెకరాలు దొడ్డు రకం వరి పంటను సాగు చేశాను. సన్న రకానికి తెగుళ్లు సోకితే మందులకే బాగా పైసలైనయి. ప్రభుత్వం సన్న రకం వడ్లకు ధర చెప్పలేదు.  దొడ్డు రకం ధరకే కొనుగోలు చేస్తే అప్పులు తీరవు. మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ. 50 బోనస్‌ ఇవ్వాలి. 

Updated Date - 2020-10-30T11:03:08+05:30 IST