HYD : ఖాళీ స్థలాల్లో చెత్త ఉంటే.. జరిమానా

ABN , First Publish Date - 2022-06-04T14:52:54+05:30 IST

గ్రేటర్‌లో నాలుగో విడత పట్టణ ప్రగతి శుక్రవారం మొదలైంది. కార్యక్రమంలో భాగంగా..

HYD : ఖాళీ స్థలాల్లో చెత్త ఉంటే.. జరిమానా

  • ప్రారంభమైన పట్టణ ‘ప్రగతి’
  • ప్రతిపక్షాల బహిష్కరణ, నిరసనలు
  • నిధులివ్వకుండా ప్రగతి ఎలా..? అంటోన్న కార్పొరేటర్లు

హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌లో నాలుగో విడత పట్టణ ప్రగతి శుక్రవారం మొదలైంది. కార్యక్రమంలో భాగంగా పలు ప్రాంతాల్లో చెత్తా చెదారం, వ్యర్థాలు తొలగించారు. ప్రతిపక్షాల బహిష్కరణ, నిరసనల మధ్య మొదటి రోజు కార్యక్రమం సాగింది. నిధులివ్వకుండా ప్రగతి ఎలా సాధ్యమని బీజేపీ, కాంగ్రె‌స్‌లు ప్రశ్నించాయి. ఖైరతాబాద్‌లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివా‌స్‌యాదవ్‌, జూబ్లీహిల్స్‌ ఎన్‌బీటీ నగర్‌లో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, తార్నాకలో డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతారెడ్డి ప్రారంభించారు.


ఈ సందర్భంగా దోమల నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలతో ముద్రించిన కరపత్రాన్ని మేయర్‌ ఆవిష్కరించారు. అనంతరం విజయలక్ష్మి మాట్లాడుతూ.. ప్రైవేట్‌ వ్యక్తులకు చెందిన ఖాళీ స్థలాల్లో (ప్లాట్లలో) చెత్తా చెదారం, ముళ్ల పొదలను యజమానులే తొలగించాలని, లేని పక్షంలో అందుకయ్యే ఖర్చును పెనాల్టీ రూపంలో వసూలు చేయాలని అధికారులకు సూచించారు. ఇళ్ల ముందు నిర్మాణ రంగ వ్యర్థాలుంటే, సంబంధిత వ్యక్తులకు ముందు నోటీసులు జారీ చేయాలని, తొలగించని పక్షంలో జరిమానా విధించాలని చెప్పారు.


విపక్ష కార్పొరేటర్లు దూరం.. 

కార్యక్రమానికి మెజార్టీ బీజేపీ, కాంగ్రెస్‌ కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. జీహెచ్‌ఎంసీలో బీజేపీ కార్పొరేటర్ల బలం 47. కొందరు పట్టణ ప్రగతిలో భాగస్వాములు కాగా, ఇంకొందరు పాల్గొనలేదు. కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ రజితారెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి ఉప్పల్‌ సర్కిల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బోగస్‌ పట్టణ ప్రగతి ఎందుకంటూ నిరసన వ్యక్తం చేశారు. నిధులు విడుదల చేయకుండా ప్రగతి ఎలా సాధ్యమని బీజేపీ కార్పొరేటర్‌ దేవర కరుణాకర్‌ ప్రశ్నించారు. అందుకే కార్యక్రమానికి దూరంగా ఉన్నట్టు తెలిపారు. 


మొదటి రోజు ఇలా..

పట్టణ ప్రగతిలో భాగంగా మొదటి రోజు 6,837 టన్నుల చెత్త, 2188.47 టన్నుల నిర్మాణ వ్యర్థాలు తొలగించినట్టు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. 180.425 కి.మీల మేర ముళ్ల పొదలు, 21.608 కి.మీల మేర నాలా పూడికతీత పనులు, ఆరు శిథిల భవనాలు కూల్చివేశారు. గుతల పూడ్చివేత, దోమల నివారణకు ఇళ్లలో రసాయనాల పిచికారి చేసినట్టు పేర్కొన్నారు. 11 వేలకుపైగా మొక్కలు నాటడంతోపాటు.. వైకుంఠధామాల్లో వ్యర్థాలు తొలగించారు.

Updated Date - 2022-06-04T14:52:54+05:30 IST