Abn logo
Sep 24 2021 @ 00:00AM

కనువిప్పు

దేశం, మతం, కాలం ఏదైనా కావచ్చు... మనుషులు వాళ్ళు చేసిన పాపపరిహారం కోసమో, పుణ్యాన్ని సంపాదించడానికో ఆలయాలకు వెళ్ళడం, దానధర్మాలు చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సంస్థలు కూడా సమాజంలోని పేదలకు మేలు చేయాలన్న ఆలోచనతో... ధనవంతుల నుంచి దానధర్మాల కోసం విరాళాలను వసూలు చేస్తాయి. ఎక్కువ మొత్తాలు ఇచ్చినవారి పేర్లనూ, ఫొటోలనూ, ఇతర వివరాలనూ ప్రకటిస్తూ ఉంటాయి.. పేరు ప్రఖ్యాతుల మీద మమకారం ఉన్నవారు పెద్ద మొత్తం విరాళంగా ఇస్తారు. వారికి బిరుదులను కూడా కొన్ని సంస్థలు ప్రకటిస్తాయి. ఆ బిరుదులను తమ పేర్లకు తగిలించుకొని, ఆ దాతలు మురిసిపోతూ ఉంటారు. వారిని ఇతరులు గౌరవిస్తారు. ఆలయాల్లో వారికి ప్రత్యేక పూజలు, దర్శనాలు, తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందుతూ ఉంటాయి. అది తమ హక్కుగా కూడా కొందరు ధనవంతులు భావిస్తూ ఉంటారు. 


పూర్వం డోజో అనే జెన్‌ పూజారి ఉండేవాడు. అతను పూజాదికాలు నిర్వహించే ఆలయానికి దర్పాన్ని ప్రదర్శించే ఒక ధనికుడు వచ్చాడు. ఆ ధనికుడి చేతిలో పదివేల బంగారు నాణేలు ఉన్న సంచీ ఉంది. ఆలయానికి వచ్చినవారందరూ డోజోకు ఎంతో కొంత ధనం ఇస్తున్నారు. ఆయన దాన్ని తీసుకొని పక్కన పెడుతున్నాడు. 


‘‘ఈ సంచీలో పదివేల బంగారు నాణేలున్నాయి’’ అని ధనికుడు అందరితో చెప్పడం డోజో గమనించాడు.


తన కానుకను డోజోకు ఇస్తూ ‘‘ఇందులో పదివేల బంగారు నాణేలు ఉన్నాయి’’ అని మరీ మరీ చెప్పాడా ధనికుడు.


అతని మాటలను పెద్దగా పట్టించుకోకుండా, అందరూ ఇచ్చిన కానుకల మాదిరిగానే ఆ సంచీని తీసుకొని ఒక మూల పెట్టాడు డోజో.


అంత పెద్ద మొత్తాన్ని కానుకగా ఇచ్చినా, తనపట్ల ప్రత్యేక గౌరవాన్నీ, శ్రద్ధనూ డోజో కనబరచకపోవడం ఆ ధనికుడికి ఆశ్చర్యాన్నీ, ఆగ్రహాన్నీ కలిగించింది. అక్కడ ఉన్నవారందరూ వినేలా ‘‘నేను ఇచ్చిన కానుక పదివేల బంగారు నాణేలు’’ అన్నాడు.


అప్పుడు డోజో ‘‘మీరు ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పారు. నేను చాలాసార్లు విన్నాను. నేనేమైనా వినికిడి లోపం ఉన్నవాడిననుకుంటున్నారా? అయినా మీ ఉద్దేశం ఏమిటి? నేను మీకు ధన్యవాదాలు చెప్పాలనా?’’ అని అడిగాడు.


ఆ ధనికుడు నిర్ఘాంతపోయి ‘‘అంత పెద్ద మొత్తాన్ని విరాళంగా ఇస్తే మీరు కనీసం ధన్యవాదాలు చెప్పొచ్చు కదా?’’ అన్నాడు.


‘‘అలాగా! అయితే మీ విరాళాన్ని నేను అంగీకరించను. మీరే వెనక్కు తీసుకువెళ్ళండి. నిజానికి దాన్ని అంగీకరించి, తీసుకున్నందుకు మీరే నాకు కృతజ్ఞతలు చెప్పాలి. నేను మీకు ధన్యవాదాలు చెప్పడమేమిటి?’’ అని ప్రశ్నించాడు డోజో. ‘‘అయినా ‘దాతలు కృతజ్ఞతలు తెలియజేయాలి’ అని ఆలయం గోడల మీద రాసి ఉంది, మీరు గమనించలేదా?’’ అని గద్దించాడు. 


‘మేము దానకర్ణులం, చాలా ఉన్నతులం’ అనుకొనే ధనికుల్లో అహంకారాన్నీ, పేరు ప్రతిష్టల మీద కోరికనూ పెంచడానికి ప్రయత్నించే ధార్మిక సంస్థలకు డోజో కథ ఒక కనువిప్పు. ‘‘పేదలకు ఇచ్చే బహుమతుల ద్వారా ప్రశంసలు ఆశించకండి. వారికి కృతజ్ఞులై ఉండండి’’ అంటారు స్వామి వివేకానంద. దాతృత్వ గుణం వినయాన్ని పెంచాలి, గర్వాన్ని కాదు.


 రాచమడుగు శ్రీనివాసులు