చిన్న పిల్లల ఆస్పత్రికి స్థలం గుర్తించండి

ABN , First Publish Date - 2021-03-02T08:13:53+05:30 IST

తిరుపతిలో చిన్న పిల్లల ఆస్పత్రి నిర్మాణానికి అనువైన ఐదెకరాల స్థలాన్ని గుర్తించాలని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి ఆదేశించారు.

చిన్న పిల్లల ఆస్పత్రికి స్థలం గుర్తించండి
సమావేశంలో ప్రసంగిస్తున్న జవహర్‌రెడ్డి

అలిపిరి, తిరుమలలో మల్టీలెవల్‌ కార్‌ పార్కింగ్‌ 

టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి 


తిరుపతి (వైద్యం), మార్చి 1: తిరుపతిలో చిన్న పిల్లల ఆస్పత్రి నిర్మాణానికి అనువైన ఐదెకరాల స్థలాన్ని గుర్తించాలని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో సీనియర్‌ అధికారులతో సమీక్షించారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం అలిపిరిలో, తిరుమలలోని అనువైన ప్రాంతాల్లో మల్టీలెవల్‌ కార్‌ పార్కింగ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. కొండపై భక్తులకు కనువిందు చేసేలా ముఖ్య కూడళ్లలో ఎత్తుగా పెరిగే బంతిపూల మొక్కలు పెంచాలన్నారు. అలిపిరి నడకమార్గంలో భక్తులు ఇబ్బందులు పడకుండా పైకప్పు నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. టీటీడీ పరిధిలోకి తీసుకున్న ఆలయాల్లో రోజూవారీ పాలనా వ్యవహారాల నిర్వహణకు సమగ్ర మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ధర్మప్రచారం చేసేందుకు వీలుగా ధర్మప్రచార రథాలు సిద్ధం చేయాలన్నారు. టీటీడీ విద్యాసంస్థల్లో బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ అమలుపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఎస్వీబీసీలో ఏడాదికి అవసరమైన కార్యక్రమాలతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఎండీని కోరారు. టీటీడీలోని పాత రికార్డులను డిజిటలైజేషన్‌ చేయాలన్నారు. సప్తగిరి మానపత్రిక పాఠకాసక్తిని పెంచేందుకు వీలుగా మంచి పండితులు, రచయితలతో వ్యాసాలు రాయించాలన్నారు. టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవో సదాభార్గవి, సీవీఎస్వీ గోపీనాథ్‌ జెట్టి, స్విమ్స్‌ డైరెక్టర్‌ వెంగమ్మ, ఎఫ్‌ఏసీఏవో బాలాజీ, చీఫ్‌ ఇంజనీర్‌ రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-02T08:13:53+05:30 IST