ఫైనాన్సర్‌ దారుణం.. వడ్డీ చెల్లించడం లేదని ఇల్లు స్వాధీనం

ABN , First Publish Date - 2021-06-22T14:10:17+05:30 IST

ఆ వృద్ధ దంపతులు అవసరం నిమిత్తం ఓ ఫైనాన్సర్‌ వద్ద రూ. 30 లక్షలు అప్పు తీసుకున్నారు....

ఫైనాన్సర్‌ దారుణం.. వడ్డీ చెల్లించడం లేదని ఇల్లు స్వాధీనం

  • వారిని బయటకు గెంటేసి ఇంటికి తాళం
  • కట్టుబట్టలతో రోడ్డున పడ్డ వృద్ధులు

హైదరాబాద్ సిటీ/అల్వాల్‌ : ఆ వృద్ధ దంపతులు అవసరం నిమిత్తం ఓ ఫైనాన్సర్‌ వద్ద రూ. 30 లక్షలు అప్పు తీసుకున్నారు. నెల నెలా వడ్డీలు కడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కొన్ని నెలలుగా వడ్డీ చెల్లించడం లేదు. దీంతో వారు నివాసం ఉంటున్న ఇంటికి గూండాలను పంపించిన ఫైనాన్సర్‌ వారిని బయటకు గెంటించి వేశాడు. ఈ సంఘటన అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. అల్వాల్‌లోని యాదమ్మనగర్‌ ప్రాంతానికి చెందిన రిటైర్డ్‌ ఉద్యోగులు ఓంప్రకాష్‌ (70), మృణాళిని(61) భార్యాభర్తలు. 2015లో డబ్బులు అవసరం ఉండటంతో సునీల్‌రెడ్డి అనే ఫైనాన్సర్‌ వద్ద అప్పు తీసుకున్నారు. ఆ సమయంలో ఓంప్రకాష్‌కు చెందిన భవనంపై ఏజీపీఏ తీసుకుని సునీల్‌రెడ్డి డబ్బులు ఇచ్చారు.


నెల నెలా వడ్డీ కింద ఏడాది పాటు రూ. 12.5 లక్షలు ఓంప్రకాష్‌ సునీల్‌ రెడ్డికి చెల్లించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా 8 నెలలుగా డబ్బులు ఇవ్వలేదు. కోటి రూపాయల విలువ ఉన్న భవనాన్ని ఏజీపీఏ ఆధారంగా సునీల్‌ రెడ్డి ఇటీవల తన భార్య పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. దీంతో ఆ దంపతులు 2018లో కోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు నడుస్తుండగానే, ఈ నెల 19న 10 మంది గూండాలు బలవంతంగా ఇంట్లో చొరబడి ఓంప్రకా్‌షకు చెందిన సామాన్లను, రూ.1.55 లక్షల నగదు, 10 తులాల బంగారు అమ్మవారి విగ్రహం, 6 చిన్న సిల్వర్‌ గిన్నెలను లారీలో వేశారు. వారిని బెదిరించి బయటకు నెట్టేశారు. ఇంటికి తాళం వేసుకున్నారు. ఈ క్రమంలో మృణాళినికి స్వల్ప గాయమైంది. దీంతో ఆ దంపతులు పోలీసులను ఆశ్రయించారు.

Updated Date - 2021-06-22T14:10:17+05:30 IST