ఆర్థిక గారడీలు

ABN , First Publish Date - 2022-03-08T06:39:06+05:30 IST

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభమైనాయి. తెలంగాణలో తొలిరోజునే ఆర్థికమంత్రి తన్నీరు హరీష్‌రావు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు...

ఆర్థిక గారడీలు

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభమైనాయి. తెలంగాణలో తొలిరోజునే ఆర్థికమంత్రి తన్నీరు హరీష్‌రావు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశంతో సమావేశాలు ఆరంభం కావడమన్నది రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇదే మొదటిసారి. శాసనసభ, మండలి సంయుక్త భేటీని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే సంప్రదాయాన్ని కూడా కేసీఆర్ ప్రభుత్వం పక్కనబెట్టింది. గత సమావేశాలు ప్రొరోగ్ కాలేదనీ, ఈ సమావేశాలు వాటికి కొనసాగింపు మాత్రమేనని చెబుతోంది. ఏవో సాంకేతిక కారణాలు అడ్డుపెట్టుకొని తనమీద రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారని గవర్నర్ తమిళసై అసంతృప్తి వెలిబుచ్చితే, సభలో చర్చకు తావు లేకుండా చేయడం అధికారపక్షం అసలు లక్ష్యమని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. గవర్నర్‌ను దూరంగా ఉంచాలన్న నిర్ణయంతో సమావేశాలు వాడిగా వేడిగా ఉంటాయని ఊహించినదే.


సోమవారం పరిణామాలు అందుకు తగినట్టుగానే ఉన్నాయి. హరీష్‌రావు బడ్జెట్ ప్రవేశపెడుతుండగా అడ్డుకున్న ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశం మొత్తం నిషేధిస్తూ స్పీకర్ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. మార్షల్స్ తరలించిన తరువాత వారు నల్ల కండువాలతో అసెంబ్లీ గేటుముందు ధర్నా చేశారు కూడా. స్పీకర్ తమను ఖాతరుచేయడం లేదనీ, గవర్నర్ ప్రసంగం లేకపోవడంతో పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినా పట్టించుకోవడం లేదనీ, అవమానిస్తున్నారనీ కాంగ్రెస్ నేతలు సైతం సభనుంచి వాకౌట్ చేయడంతో అధికారపక్షం కోరుకున్న రీతిలో మిగతాది నడపడం సాధ్యమైంది.


ఇక, హరీష్‌ బాహుబలి బడ్జెట్ కళ్ళు మిరుమిట్లు గొలిపేట్టుగానే ఉన్నది. గతంలో మాదిరిగానే ముందస్తుకుపోవాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా వస్తున్న ఊహాగానాలను అటుంచినా, అధికార తెలంగాణ రాష్ట్రసమితికి ఈ పదవీకాలంలో ఇదే పూర్తిస్థాయి బడ్జెట్ కూడా. తదనుగుణంగానే కొన్ని రంగాలకు భూరి కేటాయింపులు జరిగాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక ముందు తెరమీదకు వచ్చిన దళితబంధు పథకానికి 17,700కోట్ల రూపాయల కేటాయింపు దళితుల అభ్యున్నతి పట్ల తమకు చిత్తశుద్ధి ఉన్నదని చెప్పుకోవడానికి పాలకులకు ఉపకరిస్తుంది. వెయ్యికోట్ల కేటాయింపుతో ఆరంభమై, క్రమంగా విస్తరిస్తూ వచ్చిన ఈ పథకం ద్వారా వచ్చే సంవత్సరాంతానికి రెండు లక్షలమందికి లబ్ధిచేకూర్చుతామని ఆర్థికమంత్రి చెబుతున్నారు. వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి వంటి రంగాలకు సైతం కేటాయింపులు పెద్దపెద్ద సంఖ్యల్లోనే ఉన్నాయి. రైతుల రుణమాఫీకి సంబంధించి కూడా 75వేల లోపు రుణాలున్నవారికి గట్టి హామీ లభించింది.


అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రస్థానం నిలబడిందంటూ ఆరంభమైన బడ్జెట్ ప్రసంగంలో రాజకీయ విమర్శలకు సైతం చోటు దక్కింది. తెలంగాణ విభజన ఘట్టానికి సంబంధించి మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా గుర్తుచేస్తూ, ఆదినుంచీ కేంద్రం వైఖరి కాళ్ళలో కట్టెపెట్టినట్టు ఉన్నదన్నారు ఆర్థికమంత్రి. ఆంధ్రకు ఏడు మండలాల బదలాయింపు, హైకోర్టు విభజనలో జాప్యం ఇత్యాదివి గుర్తుచేశారు. కేంద్రం ఏయే అంశాల్లో వివక్ష చూపుతున్నదో చెప్పుకొచ్చారు. రైతు వ్యతిరేక విద్యుత్ సంస్కరణలకు నోచెప్పడం వల్ల పాతికవేల కోట్లు వదులుకుంటున్నామన్నారు. పన్నులు, సెస్సుల్లో రాష్ట్రాలకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్నీ ఏకరువుపెట్టారు. నరేగా కేటాయింపులు తగ్గించకండి ప్లీజ్ అని కూడా విన్నవించారు. ఇదంతా బాగున్నది కానీ, వాస్తవ రాబడులతో నిమిత్తం లేకుండా, కేంద్రం గ్రాంట్లు, అప్పులను నమ్ముకొని బడ్జెట్‌ను భారీగా తీర్చిదిద్దడం వెనుక, రేపు కేంద్రాన్ని మరింతగా దుమ్మెత్తిపోసే రాజకీయవ్యూహాలేమీ లేవా అన్నది కొందరి అనుమానం. భూముల అమ్మకాల వంటి నమ్మకంలేని రాబడులనుంచి అధికంగా ఆశించడం వల్ల ప్రయోజనం ఉండదు. నడుస్తున్న బడ్జెట్ కూడా భారీగానే ఉన్నా, వ్యయంలో దాదాపు నాలుగోవంతు కోతపడుతున్న వాస్తవం కాదనలేనిది. పలు కేటాయింపుల్లో కూడా ఈ మారు కోతలు కనిపిస్తున్నాయి. బడ్జెట్లో నిరుద్యోగులకు ఊరటనిచ్చే అంశాలు లేకపోవడం విచిత్రం. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగభృతి, యూనివర్సిటీల అభ్యున్నతి కానరావడం లేదు. రైతుల ఆత్మహత్యలూ సాగుతున్న నేపథ్యంలో, 18లక్షలమంది కౌలురైతుల శ్రేయస్సు మీదా దృష్టిపెడితే బాగుండేది. హైదరాబాద్ మెట్రోను ఇంతగా అభిమానిస్తున్న పాలకులకు ఆర్టీసీని ఆదుకోవడానికి కూడా ఎందుకో చేతులు రాలేదు. తమకు నచ్చినవి తప్ప చాలా రంగాలకు పాలకులు ఈ బడ్జెట్‌లో తగిన న్యాయం చేయలేదన్న విమర్శ కాదనలేనిది.

Updated Date - 2022-03-08T06:39:06+05:30 IST