ఆర్థిక దుస్థితి

ABN , First Publish Date - 2022-07-21T06:19:41+05:30 IST

శ్రీలంక అధ్యక్షుడుగా రణిల్ విక్రమసింఘే ఎన్నికయ్యారు. ఆగ్ర హంతో తిరగబడిన జనం తగులబెట్టిన ఇంటిని ఇప్పుడు ఆయన చక్కదిద్దుకోవాల్సి ఉంది. కల్లోలంలో ఉన్న దేశాన్ని...

ఆర్థిక దుస్థితి

శ్రీలంక అధ్యక్షుడుగా రణిల్ విక్రమసింఘే ఎన్నికయ్యారు. ఆగ్ర హంతో తిరగబడిన జనం తగులబెట్టిన ఇంటిని ఇప్పుడు ఆయన చక్కదిద్దుకోవాల్సి ఉంది. కల్లోలంలో ఉన్న దేశాన్ని ఒడ్డునచేర్చవలసిన అధ్యక్షస్థానంలో ఆయన కూచుంటారని అధికులు అనుకోలేదు. అధ్యక్షుడయ్యాడని తెలియగానే నిరసనకారులు రణిల్ గోబ్యాక్ అని నినాదాలు చేశారు. రణిల్ మాకు ఆత్మీయుడే, లంకకు చేయవలసింది అంతా చేస్తాం అని భారతదేశం హామీ ఇచ్చింది. విచిత్రమేమంటే, లంకను ఆదుకోవడం ఎలా? అన్న అంశంమీద ప్రభుత్వం విపక్షనేతలతో ఓ సమావేశం కూడా నిర్వహించింది. దేశంలో ఎంతటి తీవ్రపరిస్థితులు ఏర్పడినా, కరోనా వంటి విపత్తులు చుట్టుముట్టినా విపక్షనేతలతో మాటమాత్రంగా కూడా చెప్పకుండా దేశాన్ని కుదిపేసేంత కీలకనిర్ణయాలు తీసుకొనే నరేంద్రమోదీ ప్రభుత్వానికి, ఈ సద్బుద్ధి ఎందుకు కలిగిందో తెలియదు. కానీ, లంక తెగులు మనకూ సోకవచ్చునన్న హెచ్చరిక ముసుగులో ఈ సమావేశాన్ని కొన్ని రాష్ట్రాలను తప్పుబట్టడానికి వాడుకోవడం విశేషం.


లంక సంక్షోభం గురించి మాట్లాడుకుందాం రమ్మని పిలిచి, రాష్ట్రాల ఆర్థిక నిర్వహణ గురించి మాట్లాడటమేమిటన్నది సరైన ప్రశ్నే. మంగళవారం నాటి ఈ అఖిలపక్ష సమావేశంలో విదేశాంగమంత్రి జయశంకర్, ఆర్థికవ్యవహారాల కార్యదర్శి అజయ్ సేఠ్ కలసి లంక ఆర్థికస్థితిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాజకీయ, విదేశాంగ విధానం కోణంలో జరిగిన ఈ కార్యక్రమంలో లంక గురించి మాట్లాడుతున్న ఆర్థిక కార్యదర్శి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, పంజాబ్ ఇత్యాది రాష్ట్రాల అప్పుల ప్రస్తావన ఉద్దేశపూర్వకంగానే తెచ్చారన్నది ఆరోపణ. లంకలాగానే భారతదేశం కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతుందన్న వాదనలను అర్థంపర్థంలేనివనీ, అసంబద్ధపోలికనీ ఒకపక్క జయశంకర్ గట్టిగా కొట్టిపారేస్తున్న స్థితిలో, మరి లంకనూ రాష్ట్రాలనూ సరిపోల్చడం భావ్యమేనా? అన్నది ప్రశ్న. ప్రయోజనం లేని, సద్వినియోగం కాని అప్పు ముంచుతుందన్న వాదనలో నిజం ఉన్నది. ఆ మేరకు లంకను చూసి రాష్ట్రాలేం ఖర్మ, అన్ని దేశాలూ జాగ్రత్తపడాల్సిందే. అర్థంలేని అప్పులు చేస్తున్న రాష్ట్రాలను హెచ్చరించే అధికారం కేంద్రానికి ఉన్నది. ఉచితం అనుచితం అని కచ్చితంగా చెప్పవచ్చు. గతనెలలో ధర్మశాలలో జరిగిన చీఫ్ సెక్రటరీల సమావేశంలో మోదీ పలు సూచనలతో పాటు హితవులు కూడా చెప్పారు. కానీ, ఇప్పుడు ప్రత్యక్షంగా సంబంధంలేని ఒక వేదికపైన రాష్ట్రాల పేర్లను ప్రస్తావించడం వల్ల, మీ ఏలుబడిలో దేశ ఆర్థికస్థితి మాత్రం బాగున్నదా? అన్న ప్రశ్న ఎదురుకాకమానదు. దీనితో, అసలు విషయం పక్కకు పోయి, ఇక్కడ కూడా బీజేపీ రాజకీయాలు చేస్తున్నదన్న విమర్శకు ఆస్కారం ఇచ్చినట్టు అయింది.


చరిత్రలో ఎన్నడూలేనంత కనిష్ఠస్థాయికి రూపాయి మారక విలువ పడిపోయిన సందర్భం ఇది. డాలరు ధాటిని, దాడిని తట్టుకోలేక కొన్ని దేశాలతో వోస్త్రో ఖాతాతో లావాదేవీలు నిర్వహించబోతున్నది భారతదేశం. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల కరెన్సీలు కుప్పకూలిపోయాయనీ, మనం ఒక్కళ్ళమే కాదన్న వాదన ఉన్నప్పటికీ, గతంలో అమెరికా దెబ్బతిన్నప్పుడూ, ఆసియా సంక్షోభంలో ఉన్నప్పుడూ కూడా స్వశక్తితో తట్టుకొని నిలచిన సందర్భాలూ లేకపోలేదు. రూపాయి విలువ పతనానికి వెలుపలి ప్రభావాలతో పాటు, మన ఆర్థికవ్యవస్థ బలహీనత, కట్టుతప్పిన ద్రవ్యోల్బణం వంటి అంతర్గత కారణాలూ ఉంటాయి. ఎగుమతులు తగ్గడం, విదేశీపెట్టుబడులు తరలిపోవడం, కరెంట్ ఎకౌంట్ లోటు జీడీపీలో మూడుశాతానికి చేరుకోవడం వంటివి ప్రమాద సంకేతాలు. కీలకమైన ఆర్థిక సూచికలన్నింటా భారత్ బలహీనంగానే ఉన్నది. ద్రవ్యోల్బణం ఎనిమిది శాతానికి చేరడం, వృద్ధిరేటు పెరగకపోవడం, ఎగుమతులకంటే దిగుమతులు హెచ్చడం వంటివి గమనించుకోవాలి. ధరల విపరీత పెరుగుదలతో సామాన్యుల జీవనం భారంగా మారిన స్థితిలో బియ్యం, పప్పు, పాలు వంటి ఆహారపదార్థాలను కూడా వదలకుండా పాలకులు జీఎస్టీ బాదేస్తున్నారు. కొత్త ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం, ఉన్నవాటిని పైమెట్టు ఎక్కించి ఎక్కువ పన్నువేయడం వంటి విన్యాసాలు జరుగుతున్నాయి. ఎర్రని గ్యాస్ సిలండర్ మీద పాలకులకు ఎప్పుడూ మంటే. పొరుగున ఉన్న లంకను ఆదుకోవడం ఎంత ముఖ్యమో, మన ఆర్థికస్థితినీ, ముంచుకొస్తున్నముప్పునూ కచ్చితంగా అంచనావేసుకొని జాగ్రత్తపడటం అంతకంటే ముఖ్యం.

Updated Date - 2022-07-21T06:19:41+05:30 IST