Abn logo
Aug 2 2021 @ 03:10AM

మరో ఆర్థిక నేరం!!

ఎస్‌డీసీ గుట్టు రట్టుతో తెరపైకి మరో కంపెనీ

పేరు.. స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌

డిపాజిట్లు తీసుకోకూడని సంస్థగా నమోదు

కానీ అక్రమంగా రూ.3,000 కోట్ల స్వీకరణ

అప్పుల పరిమితిని తప్పించుకోవడానికి ఎత్తు!

ఐఏఎస్‌ అధికారులు సంతకం చేయని వైనం

అక్రమమని తెలిసే వారు దూరం?


అప్పుల కోసం జగన్‌ ప్రభుత్వం చేయని అక్రమం లేదు! ప్రైవేటు వ్యక్తులు సూట్‌కేసు కంపెనీలు, షెల్‌ కంపెనీలు సృష్టించి ఆర్థిక అక్రమాలకు ఎలా పాల్పడతారో.. అలాగే కార్పొరేషన్లు, ఎన్‌బీఎఫ్‌సీలంటూ ఈ ప్రభుత్వం అక్రమంగా అప్పులు తెచ్చేందుకు ఎత్తుగడలు వేస్తోంది. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ ద్వారా ఇక అప్పులు పుట్టవని తేలడంతో మరో అడ్డదారి తొక్కింది.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రప్రభుత్వ ఆర్థిక అక్రమాల అడ్డాగా ఉన్న రాష్ట్రాభివృద్ధి సంస్థ (ఏపీఎ్‌సడీసీ) గుట్టు జాతీయ స్థాయిలో రట్టవడంతో.. జగన్‌ సర్కారు కొత్త అప్పుల కోసం కొత్త కంపెనీని లైన్లోకి తెచ్చింది. ‘ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పేరు’తో ఈ కంపెనీని రాష్ట్ర ఆర్థిక శాఖ భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ)కి చెందిన హైదరాబాద్‌ బ్రాంచ్‌లో నమోదు చేసింది. దీనిని నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ(ఎన్‌బీఎ్‌ఫసీ)గా, నాన్‌ డిపాజిట్‌ టేకింగ్‌ విభాగం కింద ఆర్‌బీఐ నమోదు చేసుకుంది. అంటే ఎలాంటి డిపాజిట్లు స్వీకరించకూడదు. కానీ గడచిన నెల రోజుల్లోనే రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలు, బోర్డులు, యూనివర్సిటీలు, కొన్ని కార్పొరేషన్ల నుంచి 5 శాతం వడ్డీకి రూ.3,000 కోట్ల డిపాజిట్లను ఈ కంపెనీ స్వీకరించింది. అప్పుల పరిమితిని తప్పించుకోవడానికి ఇదొక ఎత్తుగడ.


ప్రస్తుతం బ్యాంకులు అప్పులివ్వడం లేదు. కేంద్రం ఇచ్చిన పరిమితి దాటిపోయింది. కానీ అయిపోలేదంటూ ఆర్థిక శాఖ ఆర్‌బీఐకి తప్పుడు లెక్కలు చూపుతోంది. వైట్‌కాలర్‌ మోసగాళ్లు చట్టాల్లోని లొసుగులు వాడి.. ఎలాగైతే ఆర్థిక అక్రమాలకు పాల్పడతారో.. జగన్‌ సర్కారు కూడా సరిగ్గా అదే పని ఇప్పుడు చేస్తోందనిపిస్తోందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఎన్‌బీఎ్‌ఫసీలు డిపాజిట్లు స్వీకరించకూడదనే అంశంపై ఐఎ్‌ఫఎ్‌సఎల్‌, మార్గదర్శి లాంటి సంస్థల విషయంలో చాలా రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పంథాలో రాష్ట్ర ప్రభుత్వం పయనిస్తోందని నిపుణులు చెబుతున్నారు.


ఏటికేడాదీ పెరిగేదే!

అప్పుల కోసం రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ను సృష్టించి మద్యంపై అదనపు పన్ను వేసి దాన్ని ఎస్ర్కో చేసి అక్రమంగా రూ.21,500 కోట్లు అప్పు తెచ్చారు. ఈ అప్పంతా ఆ ఏడాదిలోనే, లేదా రెండూ మూడేళ్లలోనే కట్టేస్తున్నారా అంటే లేదు 14 ఏళ్లకు చెల్లింపు కాలం పెట్టారు. ఈ రూ.21,500 కోట్లు ఒక్క ఏడాది చేస్తే సరిపోతుందా అంటే అదీ లేదు . ప్రతి ఏడాది అవసరమే. రెండో ఏడాది వాటి రీపేమెంట్‌ అసలు, వడ్డీ, కొత్త పథకాల డబ్బులు కలిసి ఆ మొత్తం రూ.25,000 కోట్లకు చేరుకుంటుంది. మూడు, నాలుగు సంవత్సరాల్లో ఇంకా పెరుగుతుంది. అవసరాలు పెరుగుతున్నాయి కాబట్టి అప్పుల పరిమితి పెంచుకోవాలని, అలా పెంచుకోవాలంటే ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి నుంచి తప్పించుకోవాలన్న ఆలోచనతో రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. ఇప్పుడు కేంద్రం దానిపై అభ్యంతరపెట్టడంతో ఎస్‌డీసీని వదిలేసి కొత్తగా ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ను అడ్డం పెట్టుకుని.. అంతో ఇంతో డబ్బులుండే కార్పొరేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, బోర్డులు, వర్సిటీల డబ్బులను 5 శాతం వడ్డీ ఆశ చూపి లాగేసుకుంటూ.. వాటి ఖాతాలను ఖాళీ చేసే పనిలో పడ్డారు. నిజానికి ఇవన్నీ అత్యవసర నిధులు.


అందులో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వివిధ పనులకు ఉద్దేశించిన గ్రాంట్లు ఉన్నాయి. ఈ నిధులను ఆయా ఖాతాల నుంచి మొదట ఆ కంపెనీకి.. అక్కడి నుంచి రాష్ట్ర ఖజానాకు మళ్లించారు. అలా ఖజానాలో చేరిన నిధులను ప్రభుత్వం తన అవసరాలకు వాడుకుంటోంది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి నుంచి తప్పించుకునేందుకు రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ఎలా కేంద్రానికి దొరికిపోయారో.. ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. అప్పుల పరిధి నుంచి తప్పించుకునేందుకు ఈ కొత్త కంపెనీని తెరపైకి తెచ్చారు.


ఐఏఎస్‌లు సంతకం ఎందుకు పెట్టలేదు?

ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌లో డబ్బులు డిపాజిట్‌ చేయండి.. 5 శాతం వడ్డీ ఇస్తామంటూ కార్పొరేషన్లకు, విద్యాసంస్థలకు పంపిన లేఖపై ఉన్న ఓ కన్సల్టెంటు సంతకం ఉంది. అంటే ప్రైవేటు వ్యక్తి. ఇవాళ ఉన్నారు. రేపు ఉంటారో లేదో తెలియదు. 5 శాతం వడ్డీకి వేల కోట్ల అప్పు తీసుకుంటున్న లేఖపై ఐఏఎస్‌ అధికారులు ఎందుకు సంతకం పెట్టలేదు? ఇది అక్రమం కాబట్టి.. విషయం బయటకు వస్తే ఇరుక్కుపోతామన్న ఉద్దేశంతోనే వారు పెట్టలేదని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.


కొత్త కార్పొరేషన్‌కు ఎలాంటి ఆస్తులు లేవు కాబట్టి ఎలాంటి డిపాజిట్లు తీసుకోకూడదన్న నిబంధన కింద నమోదు చేయడానికే ఆర్‌బీఐ అనుమతిచ్చింది. దీనిని 100 శాతం రాష్ట్ర ప్రభుత్వ కంపెనీగా నమోదు చేశారు. అంటే ఈ సంస్థకు ఆస్తులు లేకపోయినప్పటికీ అప్పుల తిరిగి చెల్లింపులో విఫలమైతే ఆ బాధ్యత రాష్ట్రం తీసుకుంటుంది. అంటే ఆ కంపెనీ నుంచి తీసుకునే అప్పులు కూడా రాష్ట్ర ఖాతాలోకే వస్తాయి. ఈ రకంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని ఉల్లంఘించినట్లే!