అప్పుల తిప్పలు

ABN , First Publish Date - 2021-06-18T04:55:12+05:30 IST

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ జిల్లాలో కల్లోలం సృష్టిస్తోంది. రోజూ వందలాది కేసులు వస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసు పత్రులు బాధితులతో కిటకిటలాడుతు న్నాయి.

అప్పుల తిప్పలు

ఖర్చులు యథాతథం.. ఆదాయం శరాఘాతం

ఫైనాన్స్‌ వ్యాపారుల ముందుచూపు !

రుణం దొరకదు.. అవసరం తీరదు

తాకట్టులో తాళిబొట్టు, ముక్కుపుడక 


కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ జిల్లాలో కల్లోలం సృష్టిస్తోంది. రోజూ వందలాది కేసులు వస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసు పత్రులు బాధితులతో కిటకిటలాడుతు న్నాయి. మరికొన్ని వేల మంది ఇళ్లల్లో హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతు న్నారు. మొన్నటి వరకు అటు కొవిడ్‌ సోకి ఆక్సిజన్‌ అందక, పరిస్థితి విషమించి, పడకలు దొరక్క వందల్లో కన్ను మూశారు. ఈ కల్లోల పరిస్థితి ఫైనాన్స్‌ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.  


పాలకొల్లు, జూన్‌ 17 :

యలమంచిలికి చెందిన కాళికమ్మ రోజువారీ పనులకు వెళుతుంది. బాడీ రిక్షా తొక్కే భర్తకు ఆర్థికంగా చేదోడుగా ఉంటుంది. రిక్షా బాడుగులు లేకపో వడం, ఆమెకు పనులు దొరక్కపోవడంతో ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. మెడలో పసుపు తాడుకు వున్న నాలుగు గ్రాముల బంగారు సూత్రాలు, ముక్కుపుడక ఆర్థిక అవసరాలకు గుర్తొచ్చాయి. పెళ్లినాటి ముక్కు పుడక పాతికేళ్లలో ఏనాడు ముక్కును  వీడలేదు. ఆమె కన్నీళ్లను దిగమింగుతూ మాస్కు మాటున ముక్కుపుడక కానరాదులే అంటూ రెంటినీ తాకట్టుకు ఇచ్చింది. 

భీమవరంలో చిన్న సోడా దుకాణం నిర్వహించుకునే ముఖేష్‌ వ్యాపారానికి పెట్టుబడి నిమిత్తం ఇద్దరు ఫైనాన్స్‌ వ్యాపారుల వద్ద రూ.10 వేలు అప్పు తీసుకున్నాడు. రోజూ రూ.వంద చొప్పున బాకీ చెల్లించాలి. కర్ఫ్యూ కార ణంగా అమ్మకాలు లేవు. యినప్పటికీ బాకీదారులు ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పుడు సక్రమంగా చెల్లించకపోతే వచ్చే రోజుల్లో అప్పు పుట్టదనే భయం మరోవైపు.

పాలకొల్లు పట్టణానికి చెందిన వేదవతి తన కుట్టు మిషను సంపాదన ద్వారా కాలనీలోని మరో మహిళ వద్ద రూ.లక్ష చిట్టీ కడుతోంది. డబ్బులు దగ్గర నిక్కర్చిగా ఉండే ఆమె నెలనెలా సక్రమంగా చిట్టీ వాయిదాలు చెల్లిస్తున్నప్పటికీ, కొందరు సక్రమంగా కట్టడం లేదంటూ చిట్టి పాటలు వాయిదా వేయడంతో చిట్టీ కట్టించుకునే మహిళతో ఆమె వాగ్వాదానికి దిగింది. ఈ నెలలో తనకు డబ్బులతో పెద్ద అవసరాలు ఉన్నాయని, పాట పెట్టకపోతే ఎలా అని నిలదీసింది. ఈ పంచాయతీ  పోలీస్‌స్టేషన్‌కు చేరింది.


ఇలా... కరోనాతో సామాన్య, మధ్య తరగతి వర్గాల ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. కనీస సరదాలు, అవసరాలు వదులుకున్నప్పటికీ బతక డానికి, ఆసుపత్రి ఖర్చులకు సైతం సొమ్ములు చేతిలో లేని దుర్భర పరిస్థితికి జీవన ప్రమాణాలు దిగజారాయి. మధ్య తరగతి కుటుంబాల్లో ఆర్థిక అవసరాలు పెను చిచ్చు రేపుతున్నాయి. జిల్లాలో మూడు లక్షల మధ్య తరగతి కుటుంబాలుండగా పేద, సామాన్య కుటుం బాలు ఐదు లక్షలు, ఎగువ మధ్య తరగతి వారు లక్ష, సంపన్న శ్రేణులు మరో 50 వేలు ఉన్నాయి. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాల్లోనే ఆర్థిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి. పేదలకు ప్రభుత్వపరంగా, స్వచ్ఛంద సంస్థలు కొంతమేరకు ఆర్థికచేయూతను ఇస్తున్నాయి. జిల్లాలో ఇప్పుడు ఫైనాన్స్‌ కంపెనీలు, కుదవ(తాకట్టు) వ్యాపారులు తమ వ్యాపార జోరును తగ్గించాయి. ఎందుకైనా మంచిది చేతిలో కొంత సొమ్ము ఉంచుకుంటే మేలని వ్యాపారులు భావిస్తున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ఏ కుటుంబం పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో? అప్పు తీసుకున్న వారు రేపటికి ఉంటారో ? లేదో ? అనే అపనమ్మకం పెరిగి అప్పులు ఇచ్చేందుకు వెనక్కి తగ్గుతున్నారు. ఫలితంగా అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుందా మన్నా డబ్బులు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇదంతా ఒకెత్తయితే ఒకవేళ అప్పులు ఇస్తే తమకు కొవిడ్‌తో ఏమైనా అయితే ఆ డబ్బు వసూల వదనే భయం మరోవైపు వడ్డీ వ్యాపారం నిలిపి వేయడానికి మరో కారణంగా కనిపి స్తోంది. దీంతో చాలామంది వడ్డీ వ్యాపారం మానేయడంతో కొందరు మాత్రమే ఇస్తు న్నారు. అత్యవసరంగా వైద్యావస రాలకు బంగారం తాకట్టు పెడదామని వెళితే కాసు ధరపై కనిష్టంగానే అప్పు ఇస్తున్నారు. నిర్ణీత గడువులో చెల్లించకుంటే తాకట్టు వాకట్టు అవుతుందనే ఒప్పందంతో అప్పు ఇస్తున్నారు. ఆర్థిక  ఇబ్బందులతో బ్యాంకుల ఆర్థిక లావాదేవీలకు ఇబ్బం దులు ఎదురవుతున్నాయి.కోట్లాది రూపాయల బకాయిలు పేరుకుపోతున్నాయి. మరోవైపు పౌరులు ముందు జాగ్రత్తగా పెద్ద మొత్తంగా నగదు ఇంటి వద్దే ఉంచుకోవడంతో నగదు కొరత ఏర్పడింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఇప్పుడు మళ్లీ నగదు కష్టాలు మొదలయ్యాయి. తేలికపాటి జలుబు, దగ్గు, జ్వరం వచ్చినప్పటికి భయపడే పరిస్థితుల్లో సామాన్య జనంతో పాటు సంపన్నులు, రాజకీయ నాయకులు పెద్ద మొత్తంలో నగదును వైద్యావసరాలకు దాచుకుంటున్నారు. ఏ సమయంలో ఏ అవసరం వస్తుందో తెలియదని ముందు జాగ్రత్తగా రూ.10 లక్షల నగదు ఉంచుకున్నానని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఎమ్మెల్యే చెప్పడం గమనార్హం. మిగిలిన వారిలోనూ ఇలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయి.


Updated Date - 2021-06-18T04:55:12+05:30 IST