క్రమంగా ఐటీ మినహాయింపుల తగ్గింపు

ABN , First Publish Date - 2020-02-17T06:48:17+05:30 IST

కేంద్ర బడ్జెట్‌లో ఆదాయ పన్నుకు సంబంధించి రెండో ప్రత్యామ్నాయ శ్లాబ్‌ విధానం ప్రతిపాదించడం పన్ను వ్యవస్థను మరింత సరళం చేసే ప్రక్రియలో భాగంగానే జరిగిందని..

క్రమంగా ఐటీ మినహాయింపుల తగ్గింపు

  • సరళమైన  విధానం 
  • కోసమే ప్రత్యామ్నాయ 
  • శ్లాబ్‌ల ప్రతిపాదన
  • ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కేంద్ర బడ్జెట్‌లో ఆదాయ పన్నుకు సంబంధించి రెండో ప్రత్యామ్నాయ శ్లాబ్‌ విధానం ప్రతిపాదించడం పన్ను వ్యవస్థను మరింత సరళం చేసే ప్రక్రియలో భాగంగానే జరిగిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. బడ్జెట్‌ ప్రతిపాదనలపై భిన్న వర్గాల్లో అపోహలు తొలగించేందుకు ప్రధాన నగరాల్లో నిర్వహిస్తున్న అవగాహనా సమావేశాల్లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఎలాంటి మినహాయింపులు లేని సరళమైన పన్ను విధానం అందుబాటులో తేవడానికి తాము కృషి చేస్తున్నట్టు చెప్పారు. అయితే మినహాయింపులు పూర్తిగా తొలగించేందుకు ఎలాంటి కాలపరిమితి పెట్టుకోలేదన్నారు. ఆ ప్రక్రియ అంతా అంచెలవారీగా జరుగుతుందని ఆమె వెల్లడించారు. రెవిన్యూ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే దీనిపై మరింతగా వివరణ ఇస్తూ క్రమక్రమంగా ఐటీ మినహాయింపులన్నీ తొలగించి పన్ను రేట్లు తగ్గించడం తమ లక్ష్యమని చెప్పారు.  ప్రభుత్వానికి పన్ను రాబడులు పెరిగితే పన్ను శ్లాబ్‌లు మరింతగా తగ్గుతాయని, పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గుతుందని ఆయన అన్నారు. 


ఆరోగ్య వసతుల విస్తరణకే సెస్‌ 

విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వైద్య పరికరాలపై 5 శాతం సెస్‌ విధించడంపై వచ్చిన ప్రశ్నకు స్పందిస్తూ ద్వితీ య, తృతీయ శ్రేణి నగరాల్లో వైద్య మౌలిక వసతులు నిర్మించడానికి ఆ నిధులు ఉపయోగిస్తామని, దేశీయంగా ఆ యంత్రపరికరాల తయారీని ప్రోత్సహించడానికి కూడా ఆ చర్య దోహదపడుతుందని ఆర్థిక మంత్రి అన్నారు. యాక్టివ్‌ ఫార్మా ఇంగ్రీడియెంట్లపై (ఏపీఐ) దిగుమతులపై ఫార్మా రంగం ఆధారనీయత తగ్గించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఒకప్పుడు ఏపీఐల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న మన దేశం తదుపరి ఆ స్థానం కోల్పోయిందంటూ తిరిగి ఆ స్థానం పొందేలా చర్యలు తీసుకోవాలన్నదే తమ ఆలోచన అని చెప్పారు. పెట్టుబడుల కొరతతో అల్లాడే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎ్‌సఎంఈ) పరిశ్రమలను ఆదుకునేందుకు వారికి అదనపు వర్కింగ్‌ కాపిటల్‌ అందించే ఏర్పాటు చేశామని ఆమె చెప్పారు. 


రేపు కరోనా వైరస్‌ ప్రభావంపై సమావేశం

వాణిజ్య రంగం పైన, మేక్‌ ఇన్‌ ఇండియా పైన  కరోనా వైరస్‌ ప్రభావాన్ని సమీక్షించేందుకు ఆర్థిక శాఖ మంగళవారం సమావేశం ఏర్పాటు చేసింది. భారత్‌కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని, ఈ కారణంగా చైనాలో కరోనా వైరస్‌ విజృంభణ వల్ల ఏర్పడిన పరిస్థితి భారత్‌ ఎగుమతులు విస్తరించడానికి మంచి అవకాశం అవుతుందని ఆర్థిక మంత్రి ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. 

వాణిజ్య ప్రతినిధులందరూ ఈ సమావేశంలో పాల్గొనవచ్చునని, ఒకవేళ రాలేని పరిస్థితి ఉంటే తమ అభిప్రాయాలు జఝౌఃుఽజీఛి.జీుఽకు ఈ-మెయిల్‌ చేయాలని ఆమె సూచించారు. 


జిల్లా స్థాయిలో జీఎస్టీ అవగాహనా  సదస్సులు


జీఎస్టీ విషయంలో ప్రభుత్వం ఎన్ని వివరణలు ఇచ్చినా ఇంకా  ఎన్నో అనుమానాలు, అపోహలు ఉన్నాయని ఈ ప్రక్రియ ద్వారా తనకు అర్ధమైందని, ఇక నుంచి జీఎ్‌సటీ బృందం మొత్తం జిల్లా ప్రధాన కేంద్రాలకు తరలివెళ్లి ఎవరికి ఎలాంటి అపోహలున్నా తొలగించే ప్రయత్నం చేయాలని నిర్మలా సీతారామన్‌ ఆదేశించారు. ఇప్పటివరకు ఈ ప్రక్రియ రాష్ట్ర రాజధానుల స్థాయికే పరిమితమైందని, దాన్ని జిల్లా స్థాయిలకు కూడా చేర్చాలని అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు జీఎ్‌సటీలో అవసరమైన మార్పులు చేస్తూనే ఉన్నామని, ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్న సరళీకృత జీఎ్‌సటీ విధానంలో మరిన్ని సాంకేతిక లోపాలు తొలగిపోతాయని ఆమె హామీ ఇచ్చారు. జీఎ్‌సటీ విధానంలో ఉన్న ప్రతీ లోపాన్ని సవరించి దాన్ని ఒక ఆదర్శనీయమైన పన్ను విధానంగా మార్చాలన్నదే తమ లక్ష్యమని ఆమె చెప్పారు. 

Updated Date - 2020-02-17T06:48:17+05:30 IST