ఎన్నికల పద్దు..!

ABN , First Publish Date - 2022-01-28T08:48:00+05:30 IST

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వచ్చే మంగళవారం (ఫిబ్రవరి 1) ప్రవేశపెట్టనున్న (మోదీ 2.0 ప్రభుత్వ) నాలుగో బడ్జెట్‌ జనాకర్షంగా ఉండే అవకాశం ఉంది. ప్రజలపై అదనపు భారాలు వేసే పరిస్థితులు దాదాపు ఉండకపోవచ్చును. ఐదు రాష్ట్రాల (ఉత్తరప్రదేశ్‌, గోవా, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌,,...

ఎన్నికల పద్దు..!

  • జనంపై అదనపు భారాలు ఉండవ్‌!
  • ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే కారణం
  • కరోనా నియంత్రణ చర్యలకు పెద్దపీట
  • ఐటీ పరిమితి పెంచాలని వేతనజీవి డిమాండ్‌
  • పన్ను రహిత పీఎఫ్‌ పరిమితి రూ.5 లక్షలకు
  • ప్రోత్సాహకాలు కోరుతున్న పారిశ్రామిక వర్గాలు
  • బడ్జెట్‌ -2022 పై పెరుగుతున్న అంచనాలు
  • ఉపాధి, గ్రామీణ సంక్షేమాలకు భారీ కేటాయింపులు
  • సాగు ప్యాకేజీని ప్రకటించే చాన్స్‌, రుణమాఫీ కూడా
  • బడ్జెట్‌ రూపు ఆర్థికమంత్రి నిర్మలకు కత్తిమీద సామే


కేంద్ర బడ్జెట్‌ ఈ ఏడాది కూడా డిజిటల్‌ రూపంలోనే రానుంది. ముద్రణ వ్యయాలను తగ్గిస్తూ బడ్జెట్‌ పత్రాలను డిజిటల్‌గా అందించే ప్రక్రియను నిర్మలా సీతారామన్‌ గత ఏడాది ప్రారంభించిన విషయం తెలిసిందే. 


(బిజినెస్‌ డెస్క్‌- ఆంధ్రజ్యోతి)

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వచ్చే మంగళవారం (ఫిబ్రవరి 1) ప్రవేశపెట్టనున్న (మోదీ 2.0 ప్రభుత్వ) నాలుగో బడ్జెట్‌ జనాకర్షంగా ఉండే అవకాశం ఉంది. ప్రజలపై అదనపు భారాలు వేసే పరిస్థితులు దాదాపు ఉండకపోవచ్చును. ఐదు రాష్ట్రాల (ఉత్తరప్రదేశ్‌, గోవా, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌) అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి, మార్చిలో జరగనున్న నేపథ్యంలో బడ్జెట్‌లో కఠిన నిర్ణయాలు తీసుకోకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే కరోనాతో కుదేలైన  ఆర్థిక వ్యవస్థలో జోరును పెంచడం, భిన్న వర్గాల ప్రజల డిమాండ్లను సమతూకం చేసుకుంటూ పట్టువిడుపు ధోరణితో బడ్జెట్‌ను ఆవిష్కరించడం ఆర్థికమంత్రికి కత్తిమీద సాము కానుంది. అన్నింటికి మించి ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లతో విరుచుకుపడుతున్న కరోనా మహమ్మారిని అదుపు చేయడంలో భాగంగా సార్వత్రిక వ్యాక్సినేషన్‌, ఆత్మనిర్భర్‌ భారత్‌, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి ప్రధాని కలల ప్రాజెక్టులకు భారీ మొత్తంలోనే నిధులు కేటాయించడం తప్పనిసరి కావచ్చునంటున్నారు. ప్రజల్లో ప్రత్యేకించి వేతన వర్గాలు బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. అదేసమయంలో తమ విషయంలో కాస్త మెతకవైఖరిని ప్రదర్శించాలని, ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితంచేయడానికి వీలుగా తమకు మరిన్ని రాయితీలు ఇవ్వాలని పారిశ్రామిక వర్గాలు ఆశిస్తున్నాయి. 


ఈసారైనా 80సీ కి మోక్షం ఉంటుందా?

ఐటీ చట్టం 80సీ కింద గంపగుత్తగా ఏడాదికి రూ.1.5 లక్షల పొదుపునకు ఐటీ మినహాయింపు ఇస్తున్నారు. దీనిని మరింతగా పెంచాలని అభ్యర్థనలు వస్తున్నాయి. అలాగే ఇందులో బీమాకు అతి తక్కువ వాటా లభిస్తోందని, అందుకోసం బీమాకు ప్రత్యేకంగా పన్ను మినహాయింపు ప్రకటిస్తే ప్రజలు బీమా చేయించుకోవడానికి ముందుకు వస్తారని ఆ రంగం ప్రతినిధులు ఇప్పటికే ఆర్థికమంత్రికి వినతిపత్రం సమర్పించారు.  


కొవిడ్‌ వైద్య ఖర్చులకు..

80డి సెక్షన్‌ కింద సంపాదించే వ్యక్తి తన ఆరోగ్య బీమాతో పాటు భార్య, పిల్లలు, తల్లిదండ్రుల ఆరోగ్య బీమాకు చెల్లించే ప్రీమియంపై ఏడాదికి రూ.లక్ష వరకు గరిష్ఠంగా పన్ను మినహాయింపు ఉంది. ఈ పరిమితిని మరింత పెంచడంతో పాటు కొవిడ్‌ వైద్య ఖర్చులకూ కవరేజీ కల్పించాలన్న డిమాండ్‌ కూడా వస్తోంది. పిల్లల స్కూలు ఫీజులపై రూ.1.5 లక్షల పన్ను మినహాయింపు పరిమితినీ పెంచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.


రూ.5 లక్షలకు పన్ను రహిత పీఎఫ్‌ పరిమితి

ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎ్‌ఫ)కు సంబంధించి పన్ను రహిత (టాక్స్‌ ఫ్రీ) కంట్రిబ్యూషన్స్‌ పరిమితిని రెండింతలు పెంచాలని డిమాండ్‌ వినిపిస్తోంది. వాస్తవానికి 2021-22 బడ్జెట్‌లో ఏటా రూ.2.5 లక్షల పీఎఫ్‌ కంట్రిబ్యూషన్స్‌పై ప్రభుత్వం పన్ను మినహాయింపును ప్రకటించింది. ఆ తర్వాత దీన్ని యజమానులతో సంబంధం లేకుండా ఉద్యోగి సొంతంగా నిధులను జమ చేసుకునే అవకాశాన్ని కల్పించటంతో పాటు టాక్స్‌ ఫ్రీ పరిమితిని రూ.5 లక్షలకు పెంచింది. అయితే కొంతమంది ప్రభుత్వోద్యోగులకే లబ్ధి కలుగుతుండటంతో ఈ పరిమితిని అందరికీ వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 


నిరుద్యోగానికి కళ్లెం

కరోనాతో దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. ఫలితంగా పేదరికం కూడా పెరిగినట్టు పలు సర్వేలు స్పష్టంచేస్తున్నాయి. ఇప్పటికే 3.2 కోట్ల మంది మధ్యతరగతి శ్రేణి నుంచి దిగువకు చేరారని, మరో 3.5 కోట్ల మంది పేదరికం నుంచి నిరుపేదలుగా మారారని గణాంకాలు చెబుతున్నాయి. మధ్యతరగతి ప్రజల సంఖ్య తగ్గుదల ప్రభావం వినియోగ వ్యయాలపై అధికంగా పడనుంది. ఈ విషవలయం నుంచి బయటపడాలంటే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తేవడం, తద్వారా ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపరచడంపై దృష్టి సారించడం తప్పనిసరి. దీనికోసం  ఈ బడ్జెట్‌లో ఉపాధికల్పన, గ్రామీణ సంక్షేమ పథకాలపై అధికంగా కేటాయింపులు చేయాల్సిరావచ్చునని భావిస్తున్నారు. ముఖ్యంగా మహాత్మాగాంధీ నరేగా, పీఎం కిసాన్‌ వంటి పథకాలపై ఎక్కువగా నిధులు కేటాయించే అవకాశముందని తెలుస్తోంది.  అదేవిధంగా రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ రుణాల మాఫీపై కూడా దృష్టి పెట్టాల్సిరావచ్చని కొందరు ఆర్థికవేత్తల అభిప్రాయపడుతున్నారు.


వ్యవ‘సాయం’ అందేనా?

దేశం స్థిరంగా 8 శాతం జీడీపీ వృద్ధి రేటు సాధించాలంటే వ్యవసాయ రంగం ఏటా నాలుగు శాతం సగటు వృద్ధి సాధించడం తప్పనిసరి అని నిపుణులంటున్నారు. ఆ స్థాయి పని తీరు కనబరచాలంటే వ్యవసాయానికి ప్రభుత్వ చేయూత అవసరమవుతుంది. నిజానికి రెండేళ్లుగా అన్ని రంగాలూ కరోనా ప్రభావంతో కుప్పకూలిన నేపథ్యంలో వ్యవసాయరంగమే జీడీపీకి ఆసరాగా నిలిచింది. అయితే వివాదాస్పద కొత్త వ్యవసాయ చట్టాల కారణంగా కొంత కాలం పాటు  వ్యవసాయరంగంలో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆ చట్టాలను  ఉపసంహరించిన ప్రభుత్వం...నేరుగా  రైతుకే లబ్ధి చేకూర్చే కొన్ని చర్యలను ఈ బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉందని కొందరి అభిప్రాయం. ఈ దిశగా ఆర్థికమంత్రి వ్యవసాయ ప్యాకేజీని కూడా ఆవిష్కరించవచ్చునని అంటున్నారు.


పెట్రో సుంకాల తగ్గింపుపై దృష్టి..!

పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలన్న డిమాం డ్లు పెరుగుతున్నాయి. అయితే దీనికి రాష్ర్టాలు సుముఖంగా లేనందున మరో విడత సుంకాల తగ్గింపుపై ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశముందని భావిస్తున్నారు.


కార్పొరేట్లకు ఊరట లభించేనా..?

వైరస్‌ విజృంభణతో రెండేళ్లుగా కార్పొరేట్‌, పారిశ్రామిక, వాణిజ్య రంగాలూ కుదేలైపోయాయి. ప్రైవేటు పెట్టుబడులు తగ్గాయి. ఫలితంగా పారిశ్రామిక రంగం నిస్తేజంగా మారింది. దీని నుంచి బయటపడేందుకు తమకు మరిన్ని రాయితీలు కల్పించాలని ఆయా వర్గాలు కోరుతున్నాయి. కొవిడ్‌ దెబ్బకు ఆతిథ్య, పర్యాటక రంగాలూ భారీగా దెబ్బతిన్నాయి. లక్షలాది మంది ఆధారపడ్డ ఈ రంగాలూ  ప్రభుత్వం నుంచి సాయం కోసం ఎదురుచూస్తున్నాయి.  


కాగా, అన్ని వర్గాల అపరిమిత డిమాండ్ల నేపథ్యంలో సమతూకంగా బడ్జెట్‌ను రూపొందించడం ఆర్థికమంత్రికి పెను సవాలు కానుందని అంటున్నారు. ప్రభుత్వంపై ఇప్పటికే విత్తలోటు భారం ఎక్కువగా ఉంది. కరోనా ప్రభావం వల్ల ఈ ఏడాది విత్తలోటు 6.5 శాతం వరకు ఉండవచ్చని పలు అధ్యయనాలు స్పష్టంచేస్తున్నాయి. దీంతో అందరికీ ఎంతో కొంత ఊరట కల్పిస్తూనే విత్తలోటు కట్టలు తెంచుకోకుండా చూడాల్సిన బాధ్యత ఆర్థికమంత్రిపై ఉంది. దీనిని నిర్మలా సీతారామన్‌ ఎంతసమర్థంగా నిర్వహిస్తారో కొద్దిరోజుల్లో తేలిపోనుంది.


సగటు జీవి ఆశ...ఐటీ మినహాయింపు

ఎన్నో ఏళ్లుగా ఐటీ వినహాయింపు వార్షిక ఆదాయ పరిమితి రూ.2.5 లక్షలకే పరిమితమయింది. ఈ  పరిమితిని వేతన జీవులకు రూ.5 లక్షలకు, సీనియర్‌ సిటిజెన్లకు రూ.10 లక్షలకు పెంచుతారని వారు ఏటా ఆశపడ్డా ఫలితం దక్కలేదు. పరిమితిని పెంచడానికి బదులుగా ప్రభుత్వం ఐటీ శ్లాబ్‌లను విస్తరించుకుంటూ పోతోంది. కనీసం ఈ ఏడాదైనా ఐటీ మినహాయింపు పరిమితిని పెంచగలరన్న ఆశతో ఆ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. 


ఈ ఏడాదీ డిజిటల్‌ రూపంలోనే

’కేంద్ర బడ్జెట్‌ ఈ ఏడాది కూడా డిజిటల్‌ రూపంలోనే రానుంది. ముద్రణ వ్యయాలను తగ్గిస్తూ బడ్జెట్‌ పత్రాలను డిజిటల్‌గా అందించే ప్రక్రియను నిర్మలా సీతారామన్‌ గత ఏడాది ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భారీ సంఖ్యలో బడ్జెట్‌ పత్రాలు ముద్రించే ప్రక్రియకు మోదీ ప్రభుత్వం స్వస్తి పలికింది. తొలుత పాత్రికేయులు, విశ్లేషకులకు బడ్జెట్‌ ముద్రణ కాపీలు అందించడం నిలిపివేసిన సర్కార్‌.. కొవిడ్‌ తీవ్రత నేపథ్యంలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు కూడా ముద్రణ కాపీలు ఇవ్వడంలేదు. ఎంపీలు, సాధారణ ప్రజలకు  బడ్జెట్‌ పత్రాలు అందుబాటులో ఉంచేందుకు 2021లో ‘కేంద్ర బడ్జెట్‌ మొబైల్‌ యాప్‌’ను ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. సాధారణంగా బడ్జెట్‌ పత్రాలు ముద్రించే సిబ్బంది అంతా నార్త్‌బ్లాక్‌ బేస్‌మెంట్‌లో గల ప్రింటింగ్‌ ప్రెస్‌లో కనీసం రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చేది. ఆర్థికమంత్రి, డిప్యూటీ మంత్రులు పాల్గొనే హల్వా వేడుకతో ఈ క్వారంటైన్‌ ప్రారంభమయ్యేది. అయితే కరోనా కారణంగా ఈ కార్యక్రమాలను నిలిపేశారు.

Updated Date - 2022-01-28T08:48:00+05:30 IST