ఆర్థిక శాఖలో సొంత దందా

ABN , First Publish Date - 2022-05-18T07:41:08+05:30 IST

అధికారంలోకి వచ్చీ రాగానే... సొంత మీడియాకు చెందిన వారికి సలహాదారు పోస్టులు కట్టబెట్టారు.

ఆర్థిక శాఖలో సొంత దందా

జాయింట్‌ సెక్రటరీలుగా ప్రైవేటు వ్యక్తులు

ఐదు పోస్టుల కోసం ఇంటర్వ్యూలు.. అభ్యర్థులంతా ‘అస్మదీయులే’

‘ఇష్టారాజ్యం’ కోసం కొత్త పథకం.. ఉద్యోగుల అభ్యంతరం 

‘మీకేం చేతకాదు.. అందుకే ప్రైవేటు వ్యక్తులు’.. మండిపడ్డ పైఅధికారి


అధికారంలోకి వచ్చీ రాగానే... సొంత మీడియాకు చెందిన వారికి సలహాదారు పోస్టులు కట్టబెట్టారు. వివిధ విభాగాల్లో వివిధ హోదాల్లో అనేక మందిని చొప్పించారు! ఇప్పుడు... ఏకంగా ఆర్థిక శాఖలోనే ‘సొంత మనుషులు’ పాగా వేస్తున్నారు. నేరుగా జాయింట్‌ సెక్రటరీ హోదాలో ఐదుగురు ప్రైవేటు వ్యక్తులకు రాష్ట్ర సచివాలయంలోని ఆర్థిక శాఖలో కొలువులు కట్టబెడుతున్నారు. ‘ఇష్టారాజ్యం’ పాలనను నడిపించుకునేందుకే ప్రభుత్వ ఉద్యోగులను పక్కనపెట్టి... ప్రైవేటు వ్యక్తులను రంగంలోకి దించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.


(అమరావతి - ఆంధ్రజ్యోతి): ఆర్థిక వ్యవహారాలపై కేంద్రం పట్టు బిగిస్తున్న సమయమిది! ‘తప్పులు చేస్తే తప్పదు శిక్ష’ అని అధికారులను సైతం హెచ్చరిస్తోంది. దీంతో... రాష్ట్రంలోని ఆర్థిక శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. గతంతో పోల్చితే... ఫైళ్లను కొంత పద్ధతి ప్రకారం నడిపించడానికే మొగ్గు చూపుతున్నారు. బహుశా... ఇది ప్రభుత్వ పెద్దలకు నచ్చినట్లు లేదు! ‘మేం చెప్పింది చెయ్యనప్పుడు మీరెందుకు’ అంటూ ఆర్థిక శాఖలో ‘ప్రైవేటు అధికారుల’ను దించుతున్నారు. కలెక్టర్‌ హోదాతో సమానమైన ‘జాయింట్‌ సెక్రటరీ’ పోస్టుల్లో ‘తమ వారిని’ నియమించాలని నిర్ణయించుకున్నారు.  మంగళవారం దీనికి సంబంధించిన ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఆర్థికశాఖ స్పెషల్‌ కార్యదర్శి సత్యనారాయణ, సెక్రటరీ గుల్జార్‌ ఈ ఇంటర్వ్యూలు నిర్వహించారు. అంతిమంగా... తాము చెప్పింది చెప్పినట్లు వినే, ఇప్పటికే తమకు సంబంధించిన కంపెనీల్లో పనిచేస్తున్న వారినే జాయింట్‌ సెక్రటరీలుగా నియమించుకునే అవకాశముందని తెలుస్తోంది. ఇంటర్వ్యూకు వచ్చిన వారంతా వైసీపీకి చెందినవారేనని సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. వైసీపీకి చెందిన మీడియా సంస్థల్లో పనిచేసినవారు, ఆ పార్టీ నేతల ఆడిటింగ్‌ కంపెనీల్లో పనిచేసినవారే ఉన్నారని చెబుతున్నారు. ఆర్థిక శాఖలో జాయింట్‌ సెక్రటరీ హోదాలో ప్రైవేటు వ్యక్తులను నియమిస్తున్న విషయం తెలిసి... సచివాలయ ఉద్యోగుల సంఘం (అప్సా) అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి తప్ప మిగిలిన సభ్యులు సత్యనారాయణను కలిశారు. ‘‘సెక్రటరీలు వ్యక్తిగతంగా ఓఎ స్‌డీలు, కన్సల్టెంట్లను ప్రైవేటుగా నియమించుకోవడం సహజం. వారంతా సెక్రటరీ కింద, ఆయన పరిధిలో పనిచేసేవారు. అంతే తప్ప, ఎప్పుడూ వారికి రెగ్యులర్‌ పోస్టింగ్‌లు ఇవ్వలేదు. ఇప్పుడు బయట నుంచి వచ్చిన వ్యక్తులకు ఇవ్వడం సమంజసం కాదు. రెగ్యులర్‌ పోస్టింగ్‌ లేని వ్యక్తులకు ప్రభుత్వ ఫైళ్లను ఎలా పంపిస్తాం’’ అని అడిగారు. దీంతో సత్యనారాయణ వారిపై విరుచుకుపడ్డారని తెలిసింది. ‘మీకేమీ రాదు. మీతో ఉపయోగం లేదు. అందుకే ప్రైవేటు వ్యక్తులను తెచ్చుకుంటున్నాం. ఏం చేసుకుంటారో చేసుకోండి. ధర్నాలు చేసుకుంటారా? సీఎ్‌సని కలిసి వినతి పత్రాలు ఇచ్చుకుంటారా? ఇచ్చుకోండి’ అన్నారని చెబుతున్నారు.


కొనసాగుతున్న ‘పీఆర్సీ’ పగ!

పీఆర్సీపై ప్రభుత్వానికి, ఉద్యోగులకు పెద్ద యుద్ధమే నడిచింది. ప్రభుత్వం తరఫున ఐఏఎ్‌సలు.. మాయమాటలు, లెక్కలతో ఉద్యోగులను మోసగించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సచివాలయంలో ఉద్యోగులు, ఐఏఎ్‌సల మధ్య దూరం పెరిగింది. ఈ దూరాన్ని ఇలాగే ఉంచాలని ప్రభుత్వం, సదరు ఐఏఎ్‌సలు భావిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే జగన్‌ ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉండే వ్యక్తులను ఇలా అడ్డగోలుగా వ్యవస్థలో దూర్చి పరిపాలనా వ్యవస్థకు తూట్లు పొడుస్తోందని ఉద్యోగులు చెబుతున్నారు. రెగ్యులర్‌ ఉద్యోగులైతే ప్రతి ఫైలునూ కూలంకషంగా అధ్యయనం చేసి అనుకూలంగా ఉంటే పాజిటివ్‌గా, ప్రతికూలంగా ఉంటే నెగటివ్‌గా రాస్తారని చెప్పారు. ఇందుకోసమే సొంత మనుషులను పరిపాలన వ్యవస్థలోకి దొడ్డిదారిన తీసుకొస్తోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పైగా కిందిస్థాయి ఉద్యోగులు నెగటివ్‌గా రాసినప్పటికీ సెక్రటరీలు సంతకాలు పెట్టి ఫైలును ఆమోదిస్తున్నారు. ఎప్పటికైనా అవి వారి మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇకపై ఆ ఫైళ్లను సెక్రటరీలు కాకుండా ప్రభుత్వంతో సంబంధం, భయం, బాధ్యత లేని ఈ ప్రైవేటు వైసీపీ ఉద్యోగులకు అప్పజెప్పాలని సర్కారు భావిస్తోందని అంటున్నారు.


 చెల్లింపుల వ్యవస్థ ‘సీఎ్‌ఫఎంఎ్‌స’కు సంబంధించిన కార్పొరేషన్‌కు టెక్నికల్‌ అర్హతలు కలిగిన ఒక ప్రైవేటు టెకీని చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. దీనిపై అప్పట్లో వైసీపీ నానాయాగీ చేసింది. ఇప్పుడు ఏకంగా ఆర్థిక శాఖలోకి ఐదుగురు ప్రైవేటు వ్యక్తులను ఉన్నత పోస్టుల్లోకి తెచ్చే ప్రక్రియకు తెరతీసింది. ఇలా ఎలా చేస్తారంటే ‘మీతో ఉపయోగం లేదు. దిక్కున్న చోట చెప్పుకోండి’ అని ఉద్యోగులను ఛీత్కరిస్తోంది. 


సీఎం అయిన కొత్తల్లో అధికారులతో జగన్‌ సమావేశమయ్యారు. సచివాలయంలో, హెచ్‌వోడీల్లో, కలెక్టరేట్లలో, ఇంకా దిగువ స్థాయి కార్యాలయాల్లో మొత్తం ఎందరు ఉద్యోగులున్నారని ఆరా తీశారు. ప్రభుత్వాన్ని నడపడానికి ఇంతమంది ఉద్యోగులు ఎందుకని జగన్‌ అన్నారు. సీఎంవోకి ఒక వంద మందిని, జిల్లాల్లో కలెక్టరుకు 20 మంది చొప్పున ఉద్యోగులను ఇస్తే సరిపోతుంది కదా అని వ్యాఖ్యానించారట! ఈ మాటలే ఇప్పుడు నిజం అవుతున్నాయని ఆర్థిక శాఖ ఉద్యోగులు అంతర్గత సంభాషణల్లో గుర్తు చేసుకుంటున్నారు.

Updated Date - 2022-05-18T07:41:08+05:30 IST