కిస్తీ కట్టాల్సిందే.. వాహనాలను సీజ్ చేస్తున్న ఫైనాన్స్ కంపెనీలు

ABN , First Publish Date - 2020-07-06T18:40:37+05:30 IST

కరోనా, లాక్‌డౌన్‌ తర్వాత ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. గ్రేటర్‌లో ఆటో రిక్షాలు, క్యాబ్‌ లు ఇంకా కుదురుకోలేదు. ఇంతకు ముందులా సవారీలు దొరకడం లేదు.

కిస్తీ కట్టాల్సిందే.. వాహనాలను సీజ్ చేస్తున్న ఫైనాన్స్ కంపెనీలు

ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీల వేధింపులు

ఆర్థిక ఇబ్బందుల్లో ఆటో, క్యాబ్‌ యజమానులు

వాహనాలు జప్తు చేస్తున్న వైనం


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): కరోనా, లాక్‌డౌన్‌ తర్వాత ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. గ్రేటర్‌లో ఆటో రిక్షాలు, క్యాబ్‌ లు ఇంకా కుదురుకోలేదు. ఇంతకు ముందులా సవారీలు దొరకడం లేదు. ఆటోలు, క్యాబ్‌లు రోడ్లపైకి వస్తున్నా ఎక్కేవారు కనిపించడం లేదు. రోజువారీ సంపాదనతో కుటుంబం గడవటమే కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఆటో, క్యాబ్‌ల నెలవారీ వాయిదాలు, త్రైమాసిక పన్నులు, ఇన్సూరెన్స్‌, అద్దెలు ఇలా రకరకాల చెల్లింపులు నిలిచిపోయాయి. ప్రభుత్వ ప్రకటనతో మూడు నెలలపాటు ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీలు ఆటో, కార్ల వాయిదాల చెల్లింపు విషయంలో మిన్నకున్నారు. కానీ, ప్రస్తుతం వారంతా వాయిదా లు చెల్లించాల్సిందేనని పట్టు పడుతున్నారు. కొందరు ఒకడుగు ముందుకేసి వాహనాలను సీజ్‌ చేసేందుకు వెనుకాడటం లేదు. దీంతో ఆటో, క్యాబ్‌ నిర్వాహకుల పరిస్థితి దిక్కుతోచకుందని క్యాబ్‌ డ్రైవర్‌ కమ్‌ ఓనర్‌ అయిన ఆంజనేయులు వాపోయారు. 


ఫైనాన్స్‌వే అధికం..  

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రజా రవాణా కోసం నడిచే ఆటో రిక్షా, క్యాబ్‌ల్లో అధిక శాతం ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంక్‌లతోపాటు ప్రైవేటు ఫైనాన్స్‌ల నుంచి రుణం తీసుకొని కొనుగోలు చేసినవే. ఇలాంటి వాహనాలు సుమారు 80 శాతం ఉంటాయని అంచనా. ఈ వాహనాలకు  త్రైమాసిక పన్ను, ఇన్సూరెన్స్‌, ఫిట్‌నెస్‌, రోజువారీ డీజిల్‌ ఖర్చు, ప్రతి నెలా నిర్వహణ ఖర్చుతోపాటు ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. నగరంలో  సుమారు 1.20 లక్షల వరకు ఆటో రిక్షాలు ఉండగా, క్యాబ్‌లు 1.10 లక్షల వరకు ఉంటాయి. కరోనా కారణంగా గత నాలుగు నెలలుగా  అవి  సరిగ్గా నడవ కపోవడంతో ఆదాయం లేక సతమతమవుతున్నారు.


లాక్‌డౌన్‌ సమయం లో రెండు నెలలపాటు ఖాళీగానే ఉన్నాయి. తర్వాత సడలింపులు ఇచ్చినా అవి ఇంతకు ముందులా నడవకపోవడంతో ఆదాయం రావడం లేదు. దీంతో ఈఎంఐలు కట్టలేకపోతున్నారు. ఈ విషయం ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీలకు తెలిసినా ఈఎంఐలు మాత్రం చెల్లించాల్సిందేనని, లేదంటే వాహనాన్ని జప్తు చేస్తామంటూ బెదిరిస్తున్నారు. మూడు నెలల వాయిదా కే కారు సీజ్‌ చేస్తే ఎలా అని మల్లాపూర్‌కు చెందిన క్యాబ్‌ యజమాని శంకర్‌ వాపోయాడు. ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే తమ లాంటి డ్రైవర్ల బతుకులు రోడ్డున పడతాయని ఆయన అంటున్నాడు.  


ఒత్తిడి చేస్తున్నారు: టి.రాజశేఖర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ క్యాబ్‌ డ్రైవర్స్‌ యూనియన్‌ 

రాష్ట్రంలో ఫైనాన్స్‌ కంపెనీలు, బ్యాంకుల ఈఎంఐలపై సెప్టెంబర్‌ 30 వరకు మారటోరియం ఉన్నా, కొన్ని ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలు ఈఎంఐలు కట్టాల్సిందేనని ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో క్యాబ్‌ల మీద జీవనం సాగిస్తున్న వారు ఈఎంఐలు కట్టే పరిస్థితుల్లో లేరు. మరో పక్క డీజిల్‌ ధరలూ పెరిగాయి. క్యాబ్‌లు నిర్వహించే కంపెనీలు ఈ సమయంలోనూ 20 నుంచి 25 శాతం కమీషన్‌ వసూలు చేస్తున్నాయి. ఐటీ, ఇతర కంపెనీల ఉద్యోగులు ఇళ్ల నుంచే పని చేస్తుండటంతో క్యాబ్‌లు సరిగ్గా నడవడం లేదు. చాలామంది నాలుగునెలలుగా ఇంటి వద్దే ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫైనాన్స్‌ కంపెనీల వేధింపులు తగవు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.  

Updated Date - 2020-07-06T18:40:37+05:30 IST