ఎట్టకేలకు ఉచిత బియ్యం

ABN , First Publish Date - 2022-08-01T06:09:12+05:30 IST

కరోనా సమయంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని కేంద్రం ఉచితంగా బియ్యం పంపిణీకి నిర్ణయం తీసుకుంది.

ఎట్టకేలకు ఉచిత బియ్యం

నేటి నుంచి పంపిణీ

పేదలకు అందని 5 నెలల బియ్యం 

నెలకు మాత్రమే సరఫరా

ఏప్రిల్‌  నుంచి జూలై బియ్యంపై సందిగ్ధత

జిల్లాలో 6,09,376 కార్డులు... 

18.96 లక్షల మందికి

ఒక్కొక్కరికి ఐదు కేజీలు పంపిణీ

వలంటీర్ల ద్వారా కూపన్లు,

 డీలర్ల ద్వారా బియ్యం

అనంతపురం టౌన జూలై 31: కరోనా సమయంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని కేంద్రం ఉచితంగా బియ్యం పంపిణీకి నిర్ణయం తీసుకుంది. అది కూడా ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌యోజన(పీఎంజీకేవై) కింద రేషన కార్డు పొందిన లబ్ధిదారులకు ఈ ఉచిత బియ్యం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. 2020 ఏప్రిల్‌ నుంచి ఈ బియ్యంను కేంద్రప్రభుత్వం అందిస్తూ వస్తోంది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకు ఉచిత బియ్యంను అందించాలని కేంద్రం నిర్ణయించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం గత ఐదు నెలలుగా ఈ ఉచిత బియ్యంను అందించకుండా పేదలకు అన్యాయం చేస్తూ వస్తోంది. అనంత జిల్లాలో అధికారిక లెక్కల మేరకు 6,49,672 తెల్ల రేషన కార్డులు ఉన్నాయి. ఈ కార్డులున్నవారందరికీ అందులో ఎంత మంది కుటుంబ సభ్యులు ఉంటే అందులో ఒక్కొక్కరికి ఐదు కిలోలు చొప్పున బియ్యం ఇవ్వాల్సి ఉంది. 

    అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కోటా బియ్యం ఇస్తున్నా లబ్ధిదారులకు దాదాపు ఏప్రిల్‌ నెల నుంచి ఉచిత బియ్యం పంపిణీ చేయలేదు. దీంతో లక్షలాది మంది నిరుపేదలు ఉచిత బియ్యం అందక నిరాశ చెందుతూ వస్తున్నారు. ప్రతిపక్ష టీడీపీతో పాటు బీజేపీ ఈ ఉచిత బియ్యం నిలుపుదలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇటీవల బీజేపీ ఉచిత బియ్యం సరఫరా చేయాలంటూ ఏకంగా కలెక్టరేట్‌లు, పౌరసరఫరాల శాఖల కార్యాలయాల వద్ద ఆందోళనలు కొనసాగించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఉచిత బియ్యం సరఫరాకు కదిలింది.


6,09,376 కార్డులు... 18.96లక్షల మందికి బియ్యం

ప్రభుత్వం ఉచిత బియ్యం సరఫరాకు గ్రీన సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో జిల్లా అధికారులు ఉచిత బియ్యం పంపిణీకి సమాయత్తమయ్యారు. జాయింట్‌ కలెక్టర్‌ కేతనగార్గ్‌, డీఎ్‌సఓ శోభారాణి, ఇంచార్జ్‌ డీఎం ఆర్డీఓ మధుసూదన గత నాలుగు రోజులుగా బియ్యం సరఫరాపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తూ సాగుతూ వస్తున్నారు. జిల్లాలో 6,49,672 తెల్లరేషన కార్డులు ఉండగా ఇందులో 6,09,376 కార్డుదారులు మాత్రమే ఉచిత బియ్యంకు అర్హులని తేల్చారు. మిగిలిన 40,296 మంది ఈ ఉచిత బియ్యంకు అనర్హులుగా గుర్తించారు. దీంతో 6,09,376 కార్డుదారుల్లో 18,96,857 మంది ఉన్నారు. వీరందరికీ ఒక్కొక్కరికి ఐదు కేజీలు చొప్పున బియ్యంను అందించనున్నారు. 


ఆగస్టుకు మాత్రమే... ఆ నాలుగు నెలలపై సందిగ్ధతే..

మొత్తం ఐదు నెలలకు కరోనా ఉచిత బియ్యం లబ్ధిదారులకు అందాల్సి ఉంది. ఏప్రిల్‌, మే, జూన, జూలై నెలలకు బియ్యం పంపిణీ చేయలేదు. పెండింగ్‌లో ఉన్న అన్ని నెలలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కరోనా ఉచిత బియ్యం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఐదు నెలల బియ్యం అందుతాయని లబ్ధిదారులు ఆనందపడ్డారు. అయితే ప్రభుత్వం ప్రస్తుతం కేవలం ఒక నెలకు మాత్రమే ఆగస్టు నెలకు సంబంధించి ఉచిత బియ్యంను సరఫరా చేస్తున్నారు. అది కూడా కార్డుదారులందరికీ ఈ బియ్యం ఇస్తామని గొప్పగా చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 40,296 మందికి అర్హత లేదని పక్కన పెట్టారు. మిగిలిన వారికి సోమ వారం  నుంచి ఒక్కొక్కరికి ఐదు కేజీలు చొప్పున బియ్యం ఉచితంగా అందజేయనున్నారు. మిగిలిన నాలుగు నెలల బియ్యం ఇస్తారో లేదో తెలీయడం లేదు. 


వలంటీర్ల ద్వారా కూపన్లు... 

ఈ సారి ఉచిత బియ్యంకు కూపనలు పెట్టారు. అర్హత కలిగిన తెల్లరేషన కార్డుదారులకు వలంటీర్ల ద్వారా ఆయా గ్రామాల్లో ఉచిత బియ్యం కూపనలు పంపిణీ చేయిస్తున్నారు. ఆ కూపనలు ఉంటేనే బియ్యం ఇవ్వనున్నారు. ఈ ఉచిత బియ్యంను రేషన షాప్‌ డీలర్ల ద్వారా పంపిణీకి యంత్రాంగం చర్యలు తీసుకుంది. 


ప్రభుత్వ ఆదేశాల మేరకే బియ్యం పంపిణీ..

కేంద్ర ప్రభుత్వం అందించే ఉచిత బియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తాయి. ఆ మేరకు అనంత జిల్లాలో తెల్లరేషన కార్డుదారులకు ఉచిత బియ్యం అందించేందుకు అన్ని చర్యలు చేపట్టాం. ఈ ఉచిత బియ్యంను ఆగస్టు 1 నుంచి పంపిణీ చేస్తున్నాం. డీలర్ల ద్వారానే ఈ బియ్యం లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. పారదర్శకంగా అందించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.  

- కేతనగార్గ్‌, జాయింట్‌ కలెక్టర్‌


కూపన్లు తీసుకెళితేనే..

ఉచిత బియ్యంకు సంబంధించి కూపనలు ఇచ్చాం. ఆ కూపనలు డీలర్ల వద్దకు తీసుకెళితేనే సంతకాలు పెట్టించుకొని బియ్యం ఇస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రతి డీలరు ఈ ఉచిత బియ్యంను సరఫరా చేస్తారు. ఆ సమయంలో లబ్ధిదారులు కూపన్లు తీసుకెళ్ళి బియ్యం తీసుకోవాలి. ఇప్పటికీ ఎన్ని రోజులు అని గడువు లేదు. కార్డుదారులందరికీ ఒక నెల బియ్యం ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన నెలలకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదు. 

-  శోభారాణి, డీఎస్‌ఓ

Updated Date - 2022-08-01T06:09:12+05:30 IST