ఎట్టకేలకు షెడ్యూల్ విడుదల.. Engineering ప్రవేశాలు ఎప్పటినుంచి అంటే..

ABN , First Publish Date - 2021-10-22T15:41:07+05:30 IST

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ ప్రవేశాలకు..

ఎట్టకేలకు షెడ్యూల్ విడుదల.. Engineering ప్రవేశాలు ఎప్పటినుంచి అంటే..

25నుంచి ఇంజనీరింగ్‌ ప్రవేశాలు

దరఖాస్తులకు నోటిఫికేషన్‌ విడుదల

నవంబరు 10న సీట్ల కేటాయింపు

15న కళాశాలలో విద్యార్థుల చేరిక

కాలేజీలు 258..సీట్లు 1,39,862

ఇందులో 70శాతం కన్వీనర్‌ కోటా

ఫార్మసీ ప్రవేశాలకూ దరఖాస్తులు

ఆదిమూలపు సురేశ్‌ ప్రకటన


అమరావతి(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ ప్రవేశాలకు ఎట్టకేలకు షెడ్యూలు ప్రకటించారు. దీనిప్రకారం నోటిఫికేషన్‌, ఆన్‌లైన్‌ రిజిస్ర్టేషన్‌, ధ్రువపత్రాల పరిశీలన, అభ్యర్థులు ఆప్షన్‌లు నమోదు చేసుకోవడం, సీట్ల కేటాయింపు, కేటాయించిన కళాశాలలో చేరడం, తరగతుల ప్రారంభం.. ఇలా పలు దశల్లో ఈ ప్రక్రియ ఉంటుంది. అందులోభాగంగా భాగంగా నోటిఫికేషన్‌ ప్రకటించారు. ఈ నెల 25వ తేదీనుంచి ఇంజనీరింగ్‌ సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 30వ తేదీ వరకు దీనికి సమయం ఉంటుంది. ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలి. అక్టోబరు 26 నుంచి 30 వరకు రిజిస్ర్టేషన్‌ చేసుకున్న అభ్యర్థుల  ధ్రుపవత్రాలను పరిశీలిస్తారు. సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో పరిశీలిస్తారు. అదేవిధంగా అభ్యర్థులు జిల్లాలవారీగా ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్‌ కేంద్రాలకు వెళ్లి పరిశీలన పూర్తిచేయించుకోవచ్చు. రెండునుంచి నాలుగు హెల్ప్‌లైన్‌ కేంద్రాలను ఆయా జిల్లాల్లోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఏర్పాటుచేశారు.


నవంబరు ఒకటి నుంచి ఐదో తేదీ వరకు రిజిస్ర్టేషన్‌ చేసుకుని ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసుకున్న అభ్యర్థులు తమకు నచ్చిన కళాశాల, కోర్సుకు సంబంధించి వెబ్‌సైట్‌లో ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఆరోతేదీన వెబ్‌ ఆప్షన్లు మార్చుకోవడానికి అవకాశం కల్పించారు. ఆ తర్వాత మూడురోజులపాటు వాటన్నింటినీ పరిశీలించి 10వ తేదీన సీట్ల కేటాయింపు చేస్తారు. 10నుంచి 15వరకు కళాశాలల్లో రిపోర్టు చేయాలి. 15వ తేదీన కళాశాలల్లో తరగతులు ప్రారంభమవుతాయి. ఈ మేరకు ప్రవేశాల ప్రకటనను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌...సాంకేతిక విద్య కమిషనర్‌ పోలా భాస్కర్‌, సెట్స్‌ కన్వీనర్‌ సుధీర్‌రెడ్డి, జేడీలు నిర్మల్‌కుమార్‌, కల్యాణ్‌లతో కలిసి గురువారం విడుదల చేశారు. ప్రవేశ ప్రకటన పూర్తి వివరాలను ఎస్‌సీహెచ్‌ఈ.ఏపి.గవ్‌.ఇన్‌ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని తెలిపారు. ప్రవేశాల ప్రకటనను శుక్రవారం పత్రికల్లో ప్రకటనగా ఇస్తామన్నారు. మరోవైపు డిఫార్మసీ, ఫార్మసీ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు. 


అఫిలియేషన్‌ దక్కని 90 కాలేజీలు

రాష్ట్రంలో మొత్తం 258 ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 1,39,862 సీట్లున్నాయి. ఇందులో కన్వీనర్‌  కోటాలో 70శాతం భర్తీచేస్తారు. మరోవైపు యాజమాన్యాల కోటాలో మరో 30శాతం ఇంజనీరింగ్‌ సీట్లున్నాయి. ఈ 30శాతంలో సగం ఎన్‌ఆర్‌ఐ కోటా, సగం మేనేజ్‌మెంట్‌ కోటాల కింద భర్తీచేస్తారు.  ఒకవేళ ఈ కోటాల్లో మిగిలిపోయిన సీట్లు ఏమైనా ఉంటే...వాటికోసం మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చి కన్వీనర్‌ కోటాలోనే భర్తీచేస్తారు. మరోవైపు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో దాదాపు 91కళాశాలలకు ఇప్పటివరకు అఫిలియేషన్‌ ఇవ్వలేదు. జేఎన్‌టీయూ కాకినాడ పరిధిలోనే ఈ కళాశాలలున్నాయి. అఫిలియేషన్‌ ఫీజుల్ని ఆయా కళాశాలలు చెల్లించకపోవడం వల్ల ఇలా జరిగింది. అయితే ఈ సమస్య రెండురోజుల్లో పరిష్కారమవుతుందని మంత్రి సురేశ్‌ వెల్లడించారు. ఆయా కళాశాలలు అఫిలియేషన్‌ ఫీజుల కింద  సుమారు రూ.120కోట్లు కట్టాల్సి ఉంటుందని అంటున్నారు. 


ధ్రువీకరణ పత్రాలివే...

ఏపీఈఏపీసెట్‌-2021 ర్యాంక్‌ కార్డు, ఏపీఏఈపీ సెట్‌ హాల్‌ టికెట్‌, పదోతరగతి మార్కుల జాబితా, ఇంటర్‌ మెమో, ఆరోతరగతినుంచి ఇంటర్‌ వరకు స్టడీ సర్టిఫికెట్‌, చివరగా చదివిన కళాశాల నుంచి ఆదాయ ధ్రువపత్రం (1.1.2018 తర్వాత తీసుకుంది), కుల ధ్రువీకరణ పత్రం(ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు), స్థానిక సర్టిఫికెట్‌. కాగా, ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ కన్వీనర్‌ కార్యాలయ నంబర్లు 8106876345, 8106575234, 7995865456.

Updated Date - 2021-10-22T15:41:07+05:30 IST