Transgender Athletesకు వరల్డ్ స్విమ్మింగ్ గవర్నింగ్ బాడీ భారీ షాక్!

ABN , First Publish Date - 2022-06-21T00:44:33+05:30 IST

లింగమార్పిడి మహిళలు (Transgender Women)కు వరల్డ్ స్విమ్మింగ్ గవర్నింగ్ బాడీ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్

Transgender Athletesకు వరల్డ్ స్విమ్మింగ్ గవర్నింగ్ బాడీ భారీ షాక్!

బుడాపెస్ట్ (హంగేరీ): లింగమార్పిడి మహిళలు (Transgender Women)కు  వరల్డ్ స్విమ్మింగ్ గవర్నింగ్ బాడీ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ ఫెడరేషన్ (FINA) షాకిచ్చింది. మహిళల విభాగంలో వారు పోటీ పడడాన్ని నిషేధించింది. అంతేకాదు, ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఓ సరికొత్త ‘జెండర్ ఇన్‌క్లూజన్ పాలసీ’ని స్వీకరించింది. ఇందులో భాగంగా 12 ఏళ్లలోపు లింగమార్పిడి చేయించుకున్న వారికి మాత్రమే మహిళల పోటీల్లో పాల్గొనేందుకు అనుమతిస్తారు. అలాగే, ‘ఓపెన్ కాంపిటిషన్ కేటగిరీ’ని కూడా ప్రతిపాదించారు.


కొత్త విధానంపై ఫినా అధ్యక్షుడు హుస్సైన్ అల్ ముసల్లామ్ మాట్లాడుతూ.. కొత్త విధానం ద్వారా 12 ఏళ్లలోపు మార్పిడి చేయించుకోవాలని ప్రేరేపించడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. యుక్తవయసు వచ్చాక లింగమార్పిడి చేయించుకుంటే కొంత అదనపు ప్రయోజనం లభిస్తుందని, ఇది సరికాదని అన్నారు. 


ఈ ఏడాది మార్చిలో అమెరికాకు చెందిన లియా థామస్ ఎన్‌సీఏఏ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ 500 గజాల ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్‌లో విజయం సాధించి ఆ ఘనత సాధించిన తొలి ట్రాన్స్‌జెండర్ విమెన్‌గా రికార్డులకెక్కింది. గత నెలలో థామస్ మాట్లాడుతూ.. ఒలింపిక్ స్విమ్మర్‌ను కావడమే తన లక్ష్యమని పేర్కొంది. మహిళా అథ్లెటిక్స్ సమగ్రతను నాశనం చేసే అన్యాయమైన బయోలాజికల్ ఎడ్జ్ తనకు ఉందన్న వాదనను కొట్టేసింది. లింగమార్పిడి మహిళల వల్ల మహిళల క్రీడలకు ఎలాంటి ముప్పు ఉండబోదని స్పష్టం చేసింది. 


సైక్లింగ్ గవర్నింగ్ బాడీ ఇంటర్నేషనల్ సైక్లింగ్ యూనియన్ (UCI) కూడా గురువారం ట్రాన్స్‌జెండర్ అథ్లెట్ల అర్హత నిబంధనలను అప్‌డేట్ చేసింది. ఇందులో కఠిన ఆంక్షలు ఉన్నాయి. పురుషులుగా ఉండి స్త్రీలుగా మారినవారు కనీసం రెండేళ్లు వేచి చూడాల్సిందేనని తేల్చిచెప్పింది.


పుట్టుకతో స్త్రీగా ఉన్న వారితో పోలిస్తే పురుషులుగా ఉండి మహిళగా మారిన వారిలో అదనపు శక్తి ఉంటుందని, కండరాలు, ఇతర నిర్మాణాలు బలంగా ఉండడంతో అథ్లెట్లకు అది వరంగా మారుతుందన్న వాదన ఉంది. కొన్ని పరిశోధనలు కూడా అదే విషయాన్ని చెబుతున్నాయి. అదే యుక్త వయసు రావడానికి ముందే.. అంటే 12 ఏళ్లలోపే లింగమార్పిడి చేయించుకుంటే కనుక ఈ అదనపు ప్రయోజనాలు ఉండవు. కాబట్టే ఆ వయసు లోపు లింగమార్పిడి చేయించుకున్న వారిని మాత్రం మహిళా కేటగిరీలో ఆడేందుకు అనుమతిస్తామని ఫినా చెబుతోంది.    

Updated Date - 2022-06-21T00:44:33+05:30 IST