May 23 2020 @ 02:28AM

అరచేతిలో వినోద వైకుంఠం

కరోనాతో సినిమా విడుదల ఆగిన నిర్మాతలు కొందరు డైరెక్ట్‌ ఓ.టి.టి. రిలీజుకు మొగ్గుచూపడం పెరుగుతోంది. ఇప్పుడు సినీసీమలో ఇదే హాట్‌ టాపిక్‌. నెలన్నరలో ఏడు సినిమాలు డైరెక్టుగా అమెజాన్‌లో రిలీజ్‌ కానుండడం సంచలనంతో పాటు వివాదమూ రేపింది. థియేటర్ల గుండెల్లో గుబులు రేపుతున్న ఈ ఓ.టి.టి.తో ఎవరికి లాభం? 


శుక్రవారం సినిమాలు థియేటర్లలో రిలీజవుతాయి. కానీ, ఈ శుక్రవారం నవాజుద్దీన్‌ సిద్దిఖీ ‘ఘూమ్‌కేతు’ ఓ.టి.టి. వేదిక ‘జీ5’లో రిలీజైంది. అవును కరోనాతో ఆగిన సినిమా లను థియేటర్లలో కాక ఇప్పుడు నేరుగా ఆన్‌లైన్‌లో అమె జాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ లాంటి ఓ.టి.టిల్లో నిర్మాతలు వదిలేయడం పెరుగుతోంది. నిర్మాతలకూ, ఎగ్జిబిటర్లకూ మధ్య అనివార్య  ఘర్షణనెలకొంది. అయితే రెండేళ్ళ క్రితం మొదలైన ఓ.టి.టి హవా... పెరిగిన నెట్‌స్పీడు, అందుబాటులో అనేక సినిమాలు, తక్కువ చందా రేట్ల కారణంగా తెలుగునాట వినోదాన్ని మార్చేస్తోంది. యువతరం, మధ్యవయస్కులు ఓ.టి.టి చూడడం పెరిగింది. ఇది సాంప్రదాయిక థియేటర్‌ సినీ వినోదానికి ప్రత్యర్థిగా మారింది. 


ఏమిటీ ఓ.టి.టి?

కొత్త మిలీనియమ్‌లో సినీవినోదంలో జరిగిన అతి పెద్ద పరిణామం ఓ.టి.టి. నిజానికి, ప్రపంచంలో ఏటా 1500 చిత్రాలను రూపొందిస్తున్నది మనమే. ఏటా 150 కోట్ల టికెట్లు అమ్ముడయ్యేదీ ఇక్కడే! ఉపాధి కోసం ఈ రంగం మీద 4 లక్షల మంది ఆధారపడ్డారు. ఒకప్పుడు వి.సి.పి లతో, తరువాత టీవీతో, ఆ పైన డి.వి.డి.లతో, తాజాగా ఓ.టి.టిలతో - ఇలా కాలగతిలో ఎప్పటికప్పుడు వెండితెరకు కొత్త సవాళ్ళు ఎదురవుతూ వచ్చాయి. ఇన్‌స్టంట్‌ వినోదాన్ని కోరుకొనే తరం వచ్చాక కరోనా పరిస్థితుల్లో చాలావరకు నిర్మాతలే తమ చిత్రాలను అమ్మడానికి అమెజాన్‌ లాంటి ఓ.టి.టిలను సంప్రతిస్తున్నట్టు సమాచారం. ఓ.టి.టిలో సినిమాల కొనుగోళ్ళకు మధ్యవర్తిత్వం వహిస్తూ, మ్యాంగో మీడియా, సిల్లీమాంక్స్‌ లాంటి సంస్థలు యాగ్రిగేటర్లుగా వ్యవహరిస్తుంటాయి. కరోనా దెబ్బకు రిలీజ్‌ ఆగిపోయిన చిన్న సినిమాలు అనేకం వీటి వైపు ఆశగా చూస్తున్నాయి. 


ఎలా కొంటున్నారు? ఎలా అమ్ముతున్నారు? 

తెలుగు సహా దక్షిణాదిలో సినిమాలు కొనడంలో అమెజాన్‌ది అగ్రస్థానం. దానికి ప్రధాన పోటీదారైన నెట్‌ఫ్లిక్స్‌ది తరువాతి స్థానమే. ఓ.టి.టిలు సినిమాల హక్కులు కొనే పద్ధతులు దేనికది భిన్నం. కొత్త సినిమా కొనాలంటే, చిత్ర బడ్జెట్‌లో సుమారు 20 శాతం మేర చెల్లిస్తామంటూ అమెజాన్‌ బేరం మొదలుపెడుతోంది. తారాగణాన్ని బట్టి టయర్‌ వన్‌, టు, త్రీ అంటూ 3 రకాలుగా సినిమాలను విభజిస్తోంది. పెద్ద తారల టయర్‌వన్‌ చిత్రాలకు నిర్మాణ వ్యయంలో 70 శాతం, కార్తీక్‌ గుమ్మకొండ లాంటి ద్వితీయ శ్రేణి తారల టయర్‌ టు చిత్రాలకు 40-50 శాతం, చిన్న శ్రేణి సినిమాలైన టయర్‌ త్రీ చిత్రాలకు 10 నుంచి 25 శాతం చెల్లిస్తున్నట్టు సమాచారం. అమెజాన్‌ పేర్కొన్న మొత్తం నచ్చకపోతే, రెవెన్యూ షేర్‌ ప్రాతిపదికన నిర్మాత ఒప్పందం కుదుర్చుకోవచ్చు. అప్పుడు ఎంతమంది, ఎంత సేపు ఆ చిత్రాన్ని చూశారన్నదాన్నిబట్టి రెవెన్యూ ఉంటుంది. దాన్ని నిర్మాతతో ఓ.టి.టి వాళ్ళు పంచుకుంటారు. ఇక, నెట్‌ఫ్లిక్స్‌ లాంటివి పెద్ద రేట్లకు సినిమాలు కొంటున్నా, ఏక మొత్తంగా కాక మూడు వాయిదాల్లో చెల్లిస్తున్నారు. స్టార్‌ టీవీకి అనుబంధమైన ‘హాట్‌ స్టార్‌’, సన్‌ టీవీ అనుబంధ ‘సన్‌ నెక్ట్స్‌’, జీ టీవీ అనుబంధ ‘జీ 5’ లాంటి ఓ.టి.టిలు కూడా తమవైన పద్ధతులు పాటిస్తున్నాయి. ఇక, పూర్తిగా తెలుగులో కరోనా కాలానికి కొద్దిగా ముందు మొదలైన తొలి తెలుగు ఓ.టి.టి ‘ఆహా’ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సారథ్యంలో దూసుకుపోతోంది. ఇప్పటికే ఉన్న శాటిలైట్‌ హక్కులకు అదనంగా ఈ డిజిటల్‌ హక్కుల ఆదాయం కోసం ఓ.టి.టిలను నిర్మాతలు ఆశ్రయిస్తున్నారు. 


వినోదం మారక తప్పదు! కానీ...

ఇంట్లోనే కూర్చొని వివిధ భాషల్లోని మంచి సినిమాలు ఓ.టి.టిలతో చూడడం అలవాటైన వీక్షకులు తెలుగులోనూ అలాంటి వినూత్నయత్నాలను ఆశించవచ్చు. మరి, డైరెక్ట్‌ ఓ.టి.టి రిలీజులు థియేటర్లకు మరణశాసనం రాస్తాయా? లాక్‌డౌన్‌ తరువాత కూడా ఇలాగే పెద్ద సినిమాలు డైరెక్ట్‌ ఓ.టి.టి రిలీజులైతే, అయిదారేళ్ళలో థియేటర్‌ వ్యూయర్‌షిప్‌ 30 శాతం పడిపోవచ్చని భయాందోళన. కానీ, ‘‘ఓ.టి.టిలు ఎన్నటికీ థియేటర్లతో సమానం కాలేవు. హక్కులు ముందే అమ్ముకోనట్లయితే సినిమాకు థియేటర్‌ రిలీజ్‌ ద్వారా వచ్చే రాబడి ఫ్లాప్‌- హిట్‌ను బట్టి ఏకంగా 70 - 80 శాతం దాకా ఉంటుంది. అంత మొత్తం డబ్బులను ఏ ఓ.టి.టిలోనూ ఆశించలేం. పైగా, కరోనా వల్ల ప్రస్తుతం మనం ఇళ్ళల్లోనే ఉన్నా, బయటకు వెళ్ళి, చుట్టూ పదిమందితో హాలులో సినిమా అనుభూతిని ఆస్వాదించా లనే ఆసక్తి, కోరిక పోవు. థియేటర్లకు అదే శ్రీరామరక్ష’’ అని సినీ వ్యాపార రంగ అనుభవశాలి కొమ్మినేని వెంకటేశ్వరరావు అన్నారు.


హీరో రామ్‌ ‘రెడ్‌’ చిత్రం థియేటర్లలో విడుదల చేయడానికి వేచిచూస్తున్న నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్‌ మాటల్లో చెప్పాలంటే, ‘‘సినిమా వ్యాపారమే అయినా, ఇక్కడకు వచ్చే వారు డబ్బు కోసమే రారు. ముందుగా కోరుకొనేది ప్రేక్షకుల నుంచి ప్రశంసలు, ఆత్మతృప్తి. తరువాతే డబ్బు. అందుకే, ఏ నిర్మాతైనా ఆశించేది తన సినిమా ముందుగా హాళ్లలోనే రిలీజు కావాలని!’’ సినీరూపకర్తల్లో ఆ ఆలోచన ఉన్నంత వరకు ఎన్ని ఓ.టి.టి.లు వచ్చినా, థియేటర్లు చిరంజీవులే. కాకపోతే, స్మార్ట్‌ టీవీలు, ఫోన్లతో ప్రేక్షకులకు అరచేతిలో వినోదవైకుంఠం చూపిస్తున్న ఓ.టి.టిలతో కరోనాతో చేసి నట్లే శాశ్వతసహజీవనం చేయక తప్పదు.  


ఓ.టి.టి.కి దీటుగా ఓ.ఎఫ్‌.టి!

ఓ.టి.టి రిలీజ్‌లపై తొలి వివాదం రేగిన తమిళనాట ‘ఓన్లీ ఫర్‌ థియేటర్‌’ (ఓ.ఎఫ్‌.టి) పేరిట సినిమా తీయా లని తమిళనాడు థియేటర్‌ ఓనర్ల సంఘ అధ్యక్షుడు తిరుప్పూర్‌ సుబ్రమణియమ్‌ కొత్త ఆలోచన చేస్తున్నారు. ‘‘నటులకూ వ్యాపారంలో వాటా కల్పిస్తూ, 2 కోట్లలో, 30 రోజుల్లో నిర్మిస్తాం’’ అని ఆయన తెలిపారు. దర్శకుడు కె.ఎస్‌. రవి కుమార్‌ చేసే ఈ ప్రయోగంలో నటించడానికి సత్యరాజ్‌, విజయ్‌ సేతుపతి, పార్తీబన్‌ లాంటి ప్రముఖులు అంగీకారం తెలపడం విశేషం.


-డాక్టర్ రెంటాల జయదేవ(నవ్య డెస్క్)