నెమ్మదిగా అయితేనేం... కదలిక మొదలైంది. సినీ రంగంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లాక్డౌన్ నుంచి వెసులుబాట్లు ఇస్తున్న సమయంలో షూటింగులు, థియేటర్ల పునఃప్రారంభం గురించి తెలుగు సినీపరిశ్రమ చర్చల్లో పడింది. షూటింగులకూ సిద్ధమేనంటూ ముందుకొస్తోంది. కానీ, కరోనా కాలంలో ఏ మేరకు సాధ్యం? ఎలా సాధ్యం?
రెండునెలల పైగా నిలిచిపోయిన తెలుగు సినిమా కార్యక్రమాలలో కదలిక వచ్చింది. శుక్రవారం నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసుకోవచ్చంటూ తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హీరో చిరంజీవి నివాసంలో దాదాపు 30 మంది సినీ ప్రముఖులతో సమావేశం తరువాత తెలంగాణ మంత్రి తలసాని మాటలతో సినీ పరిశ్రమలో పనులు నేటి నుంచి నెమ్మదిగా అధికారికంగా మొదలవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాల వారు పోస్ట్ ప్రొడక్షన్ పనులు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నా, ఇక పబ్లిక్‌గా చేసుకొనే వీలు చిక్కింది.
అనుమతులు అవసరమా?
దేశంలో కరోనా అధికంగా ఉన్న రాష్ట్రాలలో మొదటి స్థానం హిందీ చిత్రసీమకు కేంద్రమైన మహారాష్ట్ర (ముంబయ్)ది. రెండోస్థానం దక్షిణాది సినిమాకు కన్నతల్లి లాంటి తమిళనాడు (చెన్నై)ది. షూటింగ్, వగైరాను పరిమితంగా ఎలా అనుమతించాలన్న దానిపై యాక్షన్‌ప్లాన్ ఇవ్వాల్సిందిగా మహారాష్ట్ర సీఎం అక్కడి పరిశ్రమను తాజాగా కోరారు. ముంబయ్‌తో పోలిస్తే పరిస్థితి మెరుగ్గా ఉన్న చెన్నైలో సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ పది రోజుల క్రితమే మొదలైపోయింది. లాక్డౌన్ వెసులుబాట్లు రావడానికి వారం ముందే ఈనెల 11 నుంచే పోస్ట్ ప్రొడక్షన్‌కు తమిళనాడు ప్రభుత్వం అనుమతించింది. ఆ మాటకొస్తే, 50 మందికి పైగా సెట్లో ఉండే షూటింగులంటే ఈ కరోనా వేళ ఇబ్బంది కానీ, ఆరేడుగురితో సాగిపోయే పోస్ట్ ప్రొడక్షన్‌కు ప్రత్యేకించి ప్రభుత్వ అనుమతి ఎప్పుడూ అవసరం లేదు. జనం పెద్దయెత్తున కూడే హాళ్ళ పరిస్థితీ అలా కాదు కాబట్టి, ప్రభుత్వ అనుమతి కోసం పరిశ్రమ ఎదురుచూస్తోంది.
‘చిరు’ చొరవపై... ప్రశంసలు, విమర్శలు
గురువారం పరిణామాలతో అందరి దృష్టీ మరోసారి హీరో చిరంజీవిపై నిలిచింది. ఫిల్మ్‌ఛాంబర్ లాంటి ప్రాతినిధ్య సంస్థలున్నా... ఒకప్పటి దాసరిలా చిరంజీవి ఇప్పుడు తెలుగు సినీసీమకు పెద్దమనిషి పాత్ర పోషించడం ఆకర్షించింది. అయితే, ‘‘స్టూడియో, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ సెక్టార్లు నాలుగింటికీ కలిపి ఛాంబర్ లాంటి ప్రతిష్ఠాత్మక ప్రాతినిధ్య వ్యవస్థ ఉంది. ఛాంబర్‌లోనో, ఛాంబర్ పెద్దలను పూర్తిగా విశ్వాసంలోకి తీసుకొనో కాకుండా చిరంజీవి సొంత వ్యవహారంలా ఇంట్లో సమావేశాలు నిర్వహించడం ఏమిటి? అలాగే, ఛాంబర్ సైతం సమస్యల గురించి తానే ముందుకొచ్చి చర్చించే చొరవ తీసుకోకపోవడం ఏమిటి?’’ అంటూ కొందరు విమర్శలు సంధిస్తున్నారు. ఛాంబర్‌తో సంబంధం లేకుండా చిరంజీవి ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ (సి.సి.సి) మొదలుపెట్టినప్పుడూ ‘సమాంతరంగా మరో ఛాంబర్నీ, ఇండస్ట్రీనీ నడుపుతున్నారా’ అంటూ ఇలాంటి విమర్శలే వచ్చాయి. అయితే, ఎవరో ఒకరు పిల్లి మెడలో గంట కట్టాలి కాబట్టి, చిరంజీవి చొరవను అర్థం చేసుకొని, అభినందించాలని వాదిస్తున్నవారూ లేకపోలేదు.
జూన్ మొదట్లో షూటింగ్స్?
ఆ మాటలెలా ఉన్నా ప్రభుత్వం అనుమతించాక షూటింగు ఎలా చేయాలన్నది అసలు ప్రశ్న. దీనికి తామెలా జాగ్రత్తలు తీసుకొనేదీ మాక్ షూట్ చేసి, చూపడానికి సినీసీమ ముందుకొచ్చింది. ప్రస్తుతం తమ భారీ చిత్రాల షూటింగు ఆగిన దర్శకులు రాజమౌళి (ఆర్.ఆర్.ఆర్), కొరటాల శివ (ఆచార్య) ఆ బాధ్యతలు భుజానికెత్తుకున్నారు. అవుట్డోర్ షూటింగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో రాజమౌళి, ఇండోర్ షూట్లో ఎలాంటి జాగ్రత్త తీసుకొనేదీ శివ ఎవరికివారు మాక్ షూట్ చేసి ఇవ్వనున్నారు. వాటిని అందించి, ముఖ్యమంత్రి కె.సి.ఆర్.ను కలిసి, అసలు షూటింగులకు ఒప్పించాలన్నది ప్లాన్. అనుకున్నట్టు జరిగితే, లాక్డౌన్ ముగిశాక, జూన్ ప్రథమార్ధంలో షూటింగులు చిన్నగా మొదలు కావచ్చు.
మాక్ షూట్ సరే... రియల్ షూట్ సేఫేనా?
కరోనా మళ్ళీ విజృంభించకపోతే ప్రభుత్వం పర్మిషనిస్తుంది. అనుమానం లేదు. కానీ, సాధారణంగా అలక్ష్యం నిండే సెట్లో ప్రభుత్వషరతులు, జాగ్రత్తలను ప్రాక్టికల్‌గా ఎంతవరకు పాటిస్తారన్నదే అనుమానం. ‘‘అది కొంత నిజమే. ఎందుకంటే, సెట్లో ఏ ఒక్కరికి కరోనాతో ఇబ్బంది వచ్చినా, అందరూ భయపడిపోయే ప్రమాదమైతే ఉంది. అప్పుడు స్టార్లు సైతం తరువాత షూట్ చేద్దామనే రిస్కూ ఉంది. ఒకసారి షూట్ మొదలుపెట్టాక, మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సివస్తే అది మరింత ఇబ్బందే’’ అని తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ పి. రామమోహనరావు సైతం అంగీకరించారు. అందుకే, ఇది చిన్న సినిమాలకు ఓకే కానీ, పెద్ద తారల భారీచిత్రాలు వెంటనే షూటింగుకు రాకపోవచ్చు.
థియేటర్ల మాటేమిటి?
మరోపక్క ఏసీలో ఎంతోమంది కలసి కూర్చోవాల్సి వస్తుంది కాబట్టి, మల్టీప్లెక్సులపై దేశవ్యాప్త నిర్ణయం అవసరం. ‘‘థియేటర్లు తీసినా, జనం వస్తారో రారో అనే అనుమానమూ ఉంది. జనంరారని నిర్మాతలు రిలీజ్లు చేయకపోతే, మేమేంచేయాలి! పైగా సీటు విడిచి సీటులోనే ప్రేక్షకులను అనుమతిస్తే, టికెట్ రేట్లు పెంచకుండా గిట్టుబాటు అవుతుందా’’ అని ఎగ్జిబిటర్ టి. రామ్‌ప్రసాద్ ప్రశ్నించారు. అందుకే, నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్, ‘‘మేమేమీ తొందరపడదలుచుకోలేదు. అన్ని అంశాలూ మాలో మేము చర్చించడం మొదలుపెట్టాం. షూటింగు సహా ఏది చేసినా భయంతో కూడిన బాధ్యతతో చేస్తాం’’ అన్నారు.
త్వరలోనే సినిమా, టీవీ షూటింగులకు అనుమతులొచ్చినా, ఇప్పటి దాకా అలవాటైన పనిపద్ధతులను బోలెడంత మార్చుకోక తప్పదు. ‘‘రేపు మళ్ళీ పనిచేయడం మొదలుపెట్టాక అందరం, అన్ని అంశాల్లో ఎనలేని క్రమశిక్షణ చూపాలి. నిర్మాణవ్యయం దగ్గర నుంచి సెట్స్‌లో వ్యవహారం దాకా అన్నిటిలో నియంత్రణ పాటించాలి. లేదంటే కరోనా సంక్షోభం నుంచి మనం పాఠాలు నేర్చుకోనట్టవుతుంది. ఇప్పటికే ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న పరిశ్రమ పైకి లేవడం కష్టమవుతుంది’’ అని నిర్మాత డి.సురేశ్‌బాబు వ్యాఖ్యానించారు. మొత్తానికి, సినీరథం కదిలినా... కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నవేళ ప్రయాణం నల్లేరుపై నడక మాత్రం కాకపోవచ్చు.
-డాక్టర్ రెంటాల జయదేవ(నవ్య డెస్క్)
ఇవి కూడా చదవండి
సినిమా కష్టాలుసీరియల్ కన్నీళ్లు