Abn logo
Sep 21 2021 @ 00:05AM

సినీ వైవిధ్యం ‘సింగీతం’

సింగీతం శ్రీనివాసరావు

నేడు 90వ జన్మదినం

నెల్లూరు (సాంస్కృతిక ప్రతినిధి) సెప్టెంబరు 20 : సినీ పరిశ్రమలో వైవిధ్యానికి, ప్రయోగాలకు చిరునామాగా నిలిచిన దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు. ఒక్క తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ భాషల్లోనూ ఆయన చిత్రాలు రూపొందించారు. మరొకరికి సాధ్యంకాదన్న రీతిలో వెండి తెరపై విభిన్న కథాంశాలను పండించిన ఆయన నెల్లూరురీయుడు కావడం గర్వకారణం.


 ఉదయగిరిలో 1931 సెప్టెంబరు 21న శ్రీనివాసరావు జన్మించారు. చెన్నైలో చదివేటప్పుడు హరీంద్ర ఛటోపాధ్యాయ పర్యవేక్షణలో నాటక రంగ ప్రవేశం చేశారు. సూళ్లూరుపేటలో ఉపాధ్యాయ వృత్తి సాగించేటప్పుడు ఠాగూర్‌ చిత్రాన్ని సంగీత నాటకంగా రూపొందించి ప్రశంసలు అందుకున్నారు. ఢిల్లీలో తొలి ప్రధాని నెహ్రూ కూడా ఆ నాటకాన్ని వీక్షించారు. ఇంగ్లీషు అనువాదాన్ని అమెరికన్‌ టెలివిజన్‌ ప్రసారం చేసింది. స్వతంత్ర పత్రికలో సింగీతం ఎన్నో రచనలు చేశారు. సుప్రసిద్ధ దర్శకుడు కేవీ రెడ్డి అనుచరుడిగా మాయాబజార్‌ చిత్రంతో సినిమాల్లోకి ప్రవేశించారు. సంస్కార సినిమాకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. దీనికి బంగారు పతకం రాష్ట్రపతి నుంచి లభించింది. 1972లో నీతినిజాయితీ సినిమా చేసి ప్రశంసలు అందుకున్నా అది ఆర్థికంగా విఫలమైంది. 1975లో జమిందారుగారి అమ్మాయి, ఆ తర్వాత పంతులమ్మ, అమెరికా అమ్మాయి వంటి సినిమాలతో వరుస విజయాలు అందుకున్నారు. కమల్‌హాసన్‌తో సొమ్మోకడిది సోకొకడిది, అమావాస్య చంద్రుడు, మైఖేల్‌మదనకామరాజు వంటి వరుస ప్రయోగాత్మక చిత్రాలు చేశారు. పుష్పకవిమానం, తరంమారింది, మయూరిలాంటి 99 చిత్రాలకు దర్శకత్వం వహించి సెంచరీకి చేరువలో ఉన్నారు. పరిశ్రమకు పాతకాపు అయినా సరికొత్త ఆలోచనలకు, ప్రయోగాలకు వేదిక సింగీతం.