రిమ్స్‌లో ‘నిండు’ నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2022-05-21T05:35:02+05:30 IST

ఆదిలాబాద్‌ రిమ్స్‌లో వైద్యుల నిర్లక్ష్యం నిండు గర్భిణి మృతికి కారణమైంది. ప్రసవం కోసం వచ్చిన గర్భిణిని పట్టించుకోకపోవడంతో పురిటి నొప్పులతో అస్వస్థతకు గురై మరణించింది.

రిమ్స్‌లో ‘నిండు’ నిర్లక్ష్యం


సకాలంలో వైద్యం అందక గర్భిణి మృతిప్రసవం కోసం వస్తే 

వైద్యులు పట్టించుకోలేదని కుటుంబీకుల ఆగ్రహం

ఆస్పత్రి ఎదుట మృతదేహంతో ఆందోళన


ఆదిలాబాద్‌ టౌన్‌, మే 20 : ఆదిలాబాద్‌ రిమ్స్‌లో వైద్యుల నిర్లక్ష్యం నిండు గర్భిణి మృతికి కారణమైంది. ప్రసవం కోసం వచ్చిన గర్భిణిని పట్టించుకోకపోవడంతో పురిటి నొప్పులతో అస్వస్థతకు గురై మరణించింది. దీంతో కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని బొక్కలగూడకు చెందిన అక్షిత (22)అనే గర్భిణి డెలివరీ కోసం గురువారం సాయంత్రం రిమ్స్‌ ఆసుపత్రికి వచ్చారు. డెలివరీకి ఇంకా సమయం ఉందని, వేచి ఉండాలని వైద్యులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున అక్షితకు తీవ్రమైన పురిటి నొప్పులు వచ్చినా.. వైద్యులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు. పురిటి నొప్పులతోనే గర్భిణి మృతి చెందింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబీకులు వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే గర్భిణి మృతి చెందిందని ఆస్పత్రి ఎదుట మృతదేహంతో రెండు గంటల పాటు ఆందోళన చేశారు. వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయలశంకర్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసినిరెడ్డి ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితులకు ధైర్యం చెప్పారు. న్యాయపరమైన విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. స్పందించిన రిమ్స్‌ డైరెక్టర్‌ డా.జైసింగ్‌రాథోడ్‌ మృతురాలి కుటుంబీకులకు సర్దిచెప్పారు. వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదని అన్నారు. అయినప్పటికీ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్టు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన కుటుంబసభ్యులు మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లారు. 

Updated Date - 2022-05-21T05:35:02+05:30 IST