Transgender అందాల పోటీలు.. కిరీటాన్ని అందుకున్న రవెనా

ABN , First Publish Date - 2022-06-27T02:18:19+05:30 IST

ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రజాదరణ పొందిన ట్రాన్స్‌జెండర్ అందాల పోటీ (Transgender Pageant)

Transgender అందాల పోటీలు.. కిరీటాన్ని అందుకున్న రవెనా

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రజాదరణ పొందిన ట్రాన్స్‌జెండర్ అందాల పోటీ (Transgender Pageant) మిస్ ఇంటర్నేషనల్ క్వీన్ 2022లో  ఫిలిప్పీన్స్‌కు చెందిన ఫుచియా అన్నే రవెనా (Fuschia Anne Ravena) విజేతగా నిలిచి కిరీటాన్ని చేజిక్కించుకున్నారు. థాయిలాండ్‌ (Thailand)లో జరిగిన ఈ పోటీల్లో 27 ఏళ్ల రవెనా 22 మందిని ఓడించి విజేతగా నిలిచారు.


కొలంబియా, ఫ్రాన్స్‌కు చెందిన కంటెస్టెంట్స్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.  సిల్వర్ గౌనులో మెరిసిపోతున్న రవెనా విజేతగా నిలిచిన అనంతరం మాట్లాడుతూ.. ప్రేమ, శాంతి, ఐక్యతను వ్యాప్తి చేయడమే ప్రతి ఒక్కరికీ తానిచ్చే తొలి సందేశమని పేర్కొన్నారు.  


 కరోనా మహమ్మారి కారణంగా ఈ ట్రాన్స్‌జెండర్ అందాల పోటీలు దాదాపు రెండేళ్లపాటు నిలిచిపోయాయి. లింగ సమానత్వాన్ని జరుపుకోవడానికి ప్రైడ్ నెలలో థాయ్ సముద్రతీర పట్టణం పట్టాయాలో ఈ పోటీలను తిరిగి ప్రారంభించినట్టు టిఫనీ షో సీఈవో అలీసా ఫాంతుసాక్ అన్నారు. దాదాపు దశాబ్దం క్రితం ప్రారంభించిన ఈ పోటీలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్‌జెండర్లను ఒక్క చోటికి చేర్చేందుకు బాగా ఉపకరించాయి. లింగమార్పిడి చేయించుకున్న మహిళలను సమాజం ఆదరిస్తుందని చెప్పడమే ఈ పోటీల వెనకున్న ముఖ్య ఉద్దేశం. 


ఆసియాలో అత్యంత బహిరంగంగా కనిపించే లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్ (LGBT) కమ్యూనిటీలలో థాయిలాండ్ ఒకటి. అయితే థాయ్ చట్టాలు, సంస్థలు మారుతున్న సామాజిక వైఖరిని ఇంకా ప్రతిబింబించలేదని, LGBT+ వ్యక్తులు, స్వలింగ జంటలపై ఇప్పటికీ వివక్ష కొనసాగుతోందని అంటున్నారు. 

Updated Date - 2022-06-27T02:18:19+05:30 IST