మునిగిన పంట

ABN , First Publish Date - 2020-11-29T06:08:24+05:30 IST

నివర్‌ ప్రభావం మూడో రోజూ జిల్లాలో కొనసాగింది. వరి, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలకు నష్టం జరుగుతోంది. కోతకొచ్చిన పంటలు నీట మునిగాయి.

మునిగిన పంట
పాములపాడు మండలంలో నేలకొరిగిన వరిపైరు

  1. 26,126 హెక్టార్లలో పంట నష్టం
  2. వరి రైతులకు కోలుకోలేని దెబ్బ
  3. 193 గొర్రెలు, ఎద్దులు మృత్యువాత
  4. వణికిస్తున్న వర్షం, చలి, ఈదురు గాలులు
  5. కేబినెట్‌ భేటీపై భూమా అఖిల విమర్శలు


(న్యూస్‌ నెట్‌వర్క్‌, ఆంధ్రజ్యోతి)

నివర్‌ ప్రభావం మూడో రోజూ జిల్లాలో కొనసాగింది. వరి, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలకు నష్టం జరుగుతోంది. కోతకొచ్చిన పంటలు నీట మునిగాయి. కోసి ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. ఈదురు గాలులు, చలి తీవ్రతకు మూగ జీవాలు మృత్యువాత పడుతున్నాయి. జిల్లాలో 193 గొర్రెలు, ఎద్దులు మృతిచెందాయని పశుసంవర్థక శాఖ అధికారులు ప్రకటించారు. 


41 మండలాల్లో వర్షం

నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలోని 41 మండలాల్లో వర్షం కురిసింది. నవంబరులో సాధారణ వర్షపాతం 27.6 మి.మీ. కాగా, మూడు రోజుల్లో 43.6 మి.మీ. కురిసింది. సాధారణం కన్నా 58 మి.మీ. అధికంగా నమోదైంది. ఎమ్మిగనూరులో 39.2, ఆళ్లగడ్డలో 36.8, బేతంచెర్లలో 36.6, డోన్‌లో 35, గోనెగండ్లలో 33.8, గూడూరులో 32.6, క్రిష్ణగిరిలో 31.2, నందవరంలో 28.4, రుద్రవరంలో 28, దేవనకొండలో 27.8, పెద్దకడు బూరులో 26.2, శ్రీశైలంలో 26, పత్తికొండలో 24.2, కోడుమూరులో 23.1, మంత్రాలయంలో 22.8, సీ.బెళగల్‌లో 21.4, వెల్దుర్తిలో 20.6, ఆలూరులో 20.4, కోవెలకుంట్లలో 20.2, ఓర్వకల్లులో 20, కొలిమిగుండ్లలో 19.8, ఆస్పరిలో 18 మి.మీ. వర్షపాతం నమోదైంది. 


ఆలూరు మండలం పెద్దహోతూరు, మొళగవల్లి, మనేకుర్తి, హత్తిబెళగల్‌ తదితర గ్రామాల్లో తుఫాను కారణంగా వాము పంటకు నష్టం వాటిల్లింది. ఈదురు గాలులు, వర్షాలకు పంట నేలకొరిగింది. రూ.2 లక్షలు నష్టం వాటిల్లిందని పెద్దహోతూరు రైతులు కృష్ణ, రామాంజినేయులు వాపోయారు. అరికెర, కురువల్లి చెరువుల కింద రైతులు వరి పంటకు నష్టం వాటిల్లింది. 


బేతంచెర్ల పట్టణంలోని వీధులు, రహదారులు బురదమయంగా మారాయి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒకటో గ్రామ సచివాలయ ప్రాంగణంలో నీరు నిలిచింది. 


డోన్‌ మండలంలోని దేవరబండ, కమలా పురం, చిన్నమల్కాపురం, కొచ్చెర్వు, గోసానిపల్లె గ్రామాలలో వేసిన ఉల్లి, మిరప, బొప్పాయి పంటలు దెబ్బతిన్నట్లు   హార్టికల్చర్‌ అధికారి సాగరిక తెలిపారు. 37 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ఆమె వెల్లడించారు. 


పాములపాడు, ఎర్రగూడూరు, బానకచర్ల, వేంపెంట, తదితర గ్రామాల్లో వరిపంట నేల వాలింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు.


జిల్లా వ్యాప్తంగా 26,126 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని జేడీఏ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. నంద్యాల డివిజన్‌ పరిధిలోని పలు మండలాలలో ఆమె శనివారం పర్యటించారు. వరి 19,693 హెక్టార్లు, పత్తి 341 హెక్టార్లు, జొన్న 1,100 హెక్టార్లు, మినుము 1,250 హెక్టార్లు, పెసర 85 హెక్టార్లు, కంది 295 హెక్టార్లు, వేరుశనగ 33 హెక్టార్లు, పప్పు శనగ 3,297 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. డిసెంబరు 10 వరకు వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని గుర్తిస్తారని తెలిపారు. డిసెంబరు 15న ప్రభుత్వానికి నివేదిక అందచేస్తామని అన్నారు. డిసెంబరు 30 నాటికి రైతులకు పంట నష్టపరిహారం రైతుల బ్యాంకు ఖాతాలలో జమ అవుతుందని తెలిపారు. మహానంది, నంద్యాల, గోస్పాడు, పాణ్యం మండలాలలో ఆమె పంటలను పరిశీలించారు.


తుఫాను కారణంగా జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారని, సీఎం, మంత్రులు కేబినెట్‌ సమావేశంలో మాటలతో సరిపెట్టారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ విమర్శించారు. రైతులకు పరిహారం ప్రకటించ లేదన్నారు. రాయల సీమలో ఇప్పటికి నాలుగుసార్లు వదరలు వచ్చాయని, ప్రభుత్వం ఒక్కరికీ పరిహారం ఇవ్వలేదన్నారు. రుద్రవరం, చాగలమర్రి మండలాల్లో పర్యటించారు. వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.


కర్నూలు మండలం గొందిపర్ల గ్రామ పంచాయతీలో చలి, ఈదురు గాలులకు 30 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. దొడ్డిపాడు శివారులో గొందిపర్ల కాపరులు గొర్రెల మందను నిలిపారు. చలి, ఈదుగాలులతో కూడిన వర్షం కురవడతో శనివారం అర్ధరాత్రి గొర్రెలు ఒకదాని తర్వాత ఒకటి మృతి చెందాయి. శివకుమార్‌ గొర్రెలు 15, నరసింహ గొర్రెలు 9, రామకృష్ణ గొర్రెలు 6 మృతిచెందాయి. పశువైద్యులు పొలానికి చేరుకుని పోస్టుమార్టం నిర్వహించారు. రూ.3 లక్షలు దాక నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. 


జిల్లాలో తుఫాన్‌ కారణంగా గొర్రెలు, ఎద్దులు మృత్యువాత పడ్డాయని పశుసంవర్థకశాఖ జేడీ రమణయ్య తెలిపారు. బేతంచెర్ల, ఆళ్లగడ్డ, రుద్రవరం, డోన్‌, కోవెలకుంట్ల, అవుకు, చాగలమర్రి, కొలిమిగుండ్ల, డోన్‌ మండలాల్లో 90 గొర్రెలు, అలాగే 103 ఎద్దులు మృతి చెందాయని, రైతులకు రూ.9.65 లక్షల నష్టం జరిగిందని తెలిపారు. బీమా ద్వారా రైతులకు పరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. 


చాగలమర్రి మండలంలోని పెద్దవంగలి, చిన్నవంగలి, ముత్యాలపాడు, చింతలచెరువు, కేపీ తాండా గ్రామాల్లో వరి పంట దెబ్బతినింది. రైతులకు రూ.3 కోట్ల వరకూ నష్టం జరిగింది. 17 సచివాలయాల పరిధిలో 20 వేల ఎకరాల్లో వరి, మినుము, జొన్న పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. 


రాజోలి ఆనకట్ట వద్ద కుందూలో నీటి ప్రవాహం పెరిగింది. ఆనకట్ట వద్ద 6,800 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని ఏఈ మురళీకృష్ణ తెలిపారు. ఆనకట్ట నుంచి కడప జిల్లాకు 6,500 క్యూసెక్కులు, కేసీ కాలువకు 250 క్యూసెక్కులు, చాపాడు చానల్‌కు 35 క్యూసెక్కులు విడుదల చేశామని తెలిపారు రెండు రోజుల్లో కుందూ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని, రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


ఉయ్యాలవాడ మండలంలో 225 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. పత్తి, మిరప, శెనగ తదితర పంటలకు భారీ నష్టం వాటిల్లింది.



Updated Date - 2020-11-29T06:08:24+05:30 IST