సైద్ధాంతిక సమరంగా యూపీ పోరు

ABN , First Publish Date - 2021-11-17T06:15:23+05:30 IST

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో విజయంతో 2024 సార్వత్రక పోరులో మన విజయానికి ద్వారాలు తెరుచుకుంటాయి. నేను కేవలం బిజెపి గెలుపు గురించి మాట్లాడడం లేదు. ఇవి సాధారణ ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు దేశాన్ని ముందుకు తీసుకువెళ్లి...

సైద్ధాంతిక సమరంగా యూపీ పోరు

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో విజయంతో 2024 సార్వత్రక పోరులో మన విజయానికి ద్వారాలు తెరుచుకుంటాయి. నేను కేవలం బిజెపి గెలుపు గురించి మాట్లాడడం లేదు. ఇవి సాధారణ ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు దేశాన్ని ముందుకు తీసుకువెళ్లి దేశ గౌరవాన్ని నిలబెట్టే ఎన్నికలు. దేశాన్ని ఆర్థిక శక్తిగా మార్చేందుకు తోడ్పడే ఎన్నికలు. మనలో ప్రతి వ్యక్తీ 60మందిని ప్రభావితం చేసి బిజెపికి ఓటు వేయించాలి. ప్రతి కార్యకర్తా కనీసం మూడు కుటుంబాల నుంచి ఓట్లను సాధించాలి. బూత్ జీతాతో యుపి జీతా (పోలింగ్ బూత్ స్థాయిలో గెలిస్తే యూపీని గెలిచినట్లే)’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత వారం వారణాసిలో పార్టీ కార్యకర్తలు, నేతలతో మాట్లాడుతూ అన్నారు. 403 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, బిజెపి జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్‌చార్జిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పోలింగ్ బూత్‌లను బలోపేతం చేయాలని, అసెంబ్లీ సీట్లను పార్టీకి అనుకూలంగా మార్చడంలో పన్నా ప్రముఖ్‌ల పాత్ర బలంగా ఉంటుందని అమిత్ షా స్పష్టం చేశారు. ‘300 సీట్లకు పైగా మనం గెలిచితీరాలి’ అని ఆయన చెప్పారు.


ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి మూడునెలల ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారంటేనే భారతీయ జనతా పార్టీకి ఈ ఎన్నికలు ఎంత ప్రాధాన్యం గలవో అర్థమవుతోంది. 2014లో నరేంద్రమోదీ ప్రధాని కావడానికి ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌లో ఫలితాలు తోడ్పడ్డాయి. అంతకు కొద్ది రోజుల ముందే అమిత్ షాను బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడమే కాకుండా ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఇన్‌చార్జిగా కూడా నియమించారు. 2014 ఎన్నికలు అమిత్ షా జీవితంలో అత్యంత కీలకమైనవి. బిజెపి భవిష్యత్‌ను, మోదీ భవిష్యత్‌ను నిర్ణయించిన ఎన్నికలవి. 2009 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రీయ లోక్‌దళ్‌తో కలిసి పోటీ చేసినప్పటికీ బిజెపికి కేవలం 10 సీట్లే వచ్చాయి. ఆ పార్టీ కంటే కాంగ్రెస్‌కు ఎక్కువగా, 21 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత మూడేళ్లకు 2012లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి కేవలం 47 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. 2009లో బిజెపి 17.5 శాతం సీట్లు రాగా 2012కు ఆ సీట్ల శాతం 15కు పడిపోయింది. వరుస పరాజయాలతో బిజెపి పూర్తిగా ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. 


వాజపేయి లాంటి నేతల ప్రభావం పూర్తిగా క్షీణించిపోయింది. ఈ పరిస్థితుల్లో అమిత్ షా యూపీ ఎన్నికల బాధ్యత స్వీకరించారు. నిజానికి ఒక హత్యకేసులో సుప్రీంకోర్టు అమిత్ షాను గుజరాత్‌లో అడుగుపెట్టకూడదని ఆదేశించినప్పుడు యూపీ ఆయన భావి ప్రణాళికకు వేదికగా మారింది. 2010-12 సంవత్సరాల మధ్య ఆయన అత్యధిక సమయం ఉత్తరప్రదేశ్‌లో ప్రజల మధ్యే గడుపుతూ పార్టీ బలాబలాలను నిశితంగా అధ్యయనం చేశారు. 2010లో ఒక గుజరాత్ ఎమ్మెల్యేగా ఆయన తొలిసారి వారణాసి సందర్శించారు. 2012లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఆయన ప్రేక్షకుడుగానే ఉండిపోయారు. సరిగ్గా ఏడాది తర్వాత ఆయన యూపీ లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌చార్జిగా లక్నోలో అడుగుపెట్టి పార్టీ కార్యాలయంలో తన ఆఫీసును ఏర్పర్చుకున్నారు. రాష్ట్రమంతటా 4లక్షల మంది అంకితభావం కల కార్యకర్తల్ని తయారు చేశారు. ప్రతి ఒక్కరికీ మొబైల్ ఫోన్ ఇచ్చి పార్టీ కాల్ సెంటర్లతో నిత్యం సంబంధం ఏర్పర్చుకోమన్నారు. మొత్తం 52 జిల్లాల్లో 93 వేల కిలోమీటర్ల మేరకు పర్యటించారు. కేంద్ర కంట్రోల్‌రూమ్ ద్వారా అమిత్ షా ప్రతిరోజూ నివేదికలను తెప్పించుకుని అధ్యయనం చేసేవారు. బూత్‌స్థాయి కార్యకర్తలతో తానే మాట్లాడేవారు. సామాజిక, కుల వర్గ, సమీకరణల ఆధారంగా పార్టీని బలోపేతం చేసే ప్రక్రియ ప్రారంభించారు. జాతవేతర దళితులు, యాదవేతర బీసీలపై దృష్టి కేంద్రీకరించారు. బఘేల్, చౌహాన్, రాజ్‌భర్, మౌర్య, మాలి, నిషాద్ మొదలైన 20 కులాలను గుర్తించి అప్నాదళ్ వంటి చిన్న చిన్న పార్టీలతో పొత్తు కుదుర్చుకోవాలని నిర్ణయించారు. అన్నిటికన్నాపెద్ద మాస్టర్ స్ట్రోక్ – నరేంద్రమోదీని వారణాసి నుంచి పోటీ చేయించేందుకు ఒప్పించడం. తద్వారా మోదీ ప్రభంజనాన్ని, కొత్త హిందూత్వ గాలిని సృష్టించగలమని గ్రహించారు. ‘హర్ హర్ మోదీ, ఘర్ ఘర్ మోదీ, అబ్ కీ బార్- మోదీ సర్కార్’ వంటి నినాదాలను రూపొందించారు. 2014 మే 16న ఫలితాలు వెలువడినప్పుడు యూపీలో బిజెపి 71 సీట్లను సాధించి ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతి పరిచింది. గతంలో ఎన్నడూ లేనంతగా బిజెపికి 42.3 శాతం ఓట్లు లభించాయి. ఒకప్పటి రామ్ ప్రభంజనాన్ని కూడా మోదీ ప్రభంజనం అధిగమించింది. ఈ విజయంతో అమిత్ షా భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఎంపికయ్యారు. ఆ తర్వాత మూడేళ్లకు 2017లో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పటికి యోగీ ఆదిత్యనాథ్ రంగంలో లేరు. గోరఖ్‌పూర్ ఎంపీగా మాత్రమే ఉన్నారు. నిజానికి కేంద్రంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు వంటి నిర్ణయాలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి ప్రతికూలంగా మారతాయని ప్రతి ఒక్కరూ భావించారు. కాని పెద్దనోట్లతో నల్లధనం పోగేసిన ధనికులపై యుద్ధం ప్రకటించామని మోదీ చేసిన ప్రకటనలను నమ్మిన ప్రజలు మాయావతి, ములాయం లాంటి వారి బొక్కసాలకు గండికొట్టారని గ్రహించలేకపోయారు. రాష్ట్రమంతటా అమిత్ షా పరివర్తన యాత్రలు నిర్వహించారు. 2017 మార్చి 11న ఫలితాలు వెలువడ్డాయి. బిజెపి 41.5 ఓట్ల శాతంతో మొత్తం 325 అసెంబ్లీ సీట్లను సాధించింది. త్రిపుల్ తలాఖ్ నిషేధం వంటి కీలక నిర్ణయాలు ప్రకటించినప్పటికీ, ఒక్క ముస్లింకు కూడా సీటు ఇవ్వకుండా ముస్లిం మెజారిటీ సీట్లలో కూడా బిజెపి గెలుపు కైవశం చేసుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ యూపీలో ఇదే ఊపు కనపడింది. ఈ ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీ ఏకమయ్యాయి. ‘పర్ అగర్ ఆనా హైతో ఆజాయే. దేఖ్ లేంగే’ (వారు కలిసి మా మీదకు రానివ్వండి. చూసుకుంటాం) అని అమిత్ షా సవాలు విసిరారు. ఈ ఎన్నికల్లో కూడా బిజెపి యూపీలో 62 సీట్లు సాధించినప్పటికీ ఓట్లను 49.8 శాతానికి పెంచుకుని మోదీ రెండోసారి ప్రధాని కావడానికి తోడ్పడింది. ఈ విజయం తర్వాత అమిత్ షా కేంద్రంలో హోంమంత్రి కాగలిగారు.


ఇప్పుడు మళ్లీ యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా పరిణామాలు జరిగాయి. ఏడేళ్ల మోదీ ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో తీవ్రంగా చర్చ ప్రారంభమైంది. ఆర్థిక సంస్కరణలు తీవ్రస్థాయిలో అమలు చేయడం, నిత్యావసర వస్తువులు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగడం, నిరుద్యోగం పెరిగిపోవడం, సాగుచట్టాలపై రైతులు గత ఏడాదిగా నిరసనలు వ్యక్తం చేయడం, లఖీంపూర్ ఖేరీ వంటి ఘటనలు జరగడం యూపీలో బిజెపికి ప్రతికూలంగా మారతాయని కొందరు మేధావులు అనుకుంటున్న సమయంలో మళ్లీ అమిత్ షా రంగంలోకి దిగారు. యూపీలో 2014 లోక్‌సభ, 2017 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికలలో బిజెపి అత్యధిక సీట్లు సాధించడం మోదీ ప్రధానమంత్రి కావడానికి తోడ్పడినట్లే 2022లో జరగనున్న శాసనసభ ఎన్నికలు మోదీతో పాటు పార్టీ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయనడంలో సందేహం లేదు. ఈసారి విజయం పార్టీ భవిష్యత్‌నే కాదు, దేశ భవిష్యత్‌నూ నిర్ణయిస్తుందని, బిజెపికి ఓటు వేయకపోతే దేశ భవితవ్యం అంధకార బంధురంగా మారుతుందని అమిత్ షా హెచ్చరించడం ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో కేవలం అభివృద్ధి, ఆదిత్యనాథ్ పరిపాలన గురించి మాట్లాడడమే కాకుండా ఆ పోరాటాన్ని ఒక సైద్ధాంతిక సమరంగా మార్చేందుకు బిజెపి సిద్ధమవుతోంది. 


దేశంలో ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ సైద్ధాంతికంగా ఈ సవాలును స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాయా? అన్నది అనుమానమే. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో బిజెపి పట్ల ప్రజల వ్యతిరేకత కొంత వ్యక్తమైంది. హిమాచల్ ప్రదేశ్ లో అన్ని సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. మధ్యప్రదేశ్‌లో ఉపఎన్నికలు జరిగిన మూడు సీట్లలో బిజెపి కంటే కేవలం రెండు శాతం తేడాతో కాంగ్రెస్ ఓడిపోయింది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ తన సీటును నిలబెట్టుకోవడమే కాక బిజెపి గతంలో గెలిచిన సీటును కూడా కైవశం చేసుకుంది. పశ్చిమబెంగాల్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండోస్థానం సాధించిన బిజెపి ఈ సారి జరిగిన ఉపఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నిజానికి ఈ ఉపఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ఏదో జాతీయస్థాయిలో పెద్దగా వ్యూహరచన చేయడం వల్ల వచ్చినవి కావు. ఈ ఫలితాల ఆధారంగా దేశవ్యాప్తంగా తమ పార్టీకి ఊపు కల్పించి బిజెపి వ్యతిరేక పవనాలు సృష్టించగలిగిన శక్తి కూడా కాంగ్రెస్‌కు లేదు. ఉత్తరప్రదేశ్‌లో అమిత్ షా ఒక్కడు కల్పించిన ప్రభావాన్ని మొత్తం కాంగ్రెస్ సంస్థ కలిసికట్టుగా కూడా కల్పించగలిగిన స్థితిలో లేదు.


విచిత్రమేమంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం పొందిన తర్వాత ఢిల్లీలో పార్టీ నేతలు పదిమంది రాష్ట్ర నేతలను పిలిచి చర్చించినప్పుడు వారు ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకోవడం తప్ప జరిగిందేమీ లేదు. బిజెపి గెలుపు ద్వారా టీఆర్‌ఎస్ విజయానికి గండిపడిందని కొందరు వికృత వివరణలూ ఇచ్చుకున్నారు. వారిలో పరివర్తనం వచ్చే అవకాశాలు లేవు. పార్టీలో అన్ని నిర్ణయాలూ తీసుకునే రాహుల్ గాంధీ ఈ సమీక్షలో పాల్గొనకుండా ఎక్కడో విహారయాత్రకు వెళ్లారు. ఈటల రాజేందర్ రాజీనామా చేయగానే బిజెపి అతివేగంగా స్పందించింది. అమిత్ షా ఆదేశాలతో పార్టీ అధ్యక్షుడు ఆయనను ఢిల్లీ పిలిపించుకున్నారు. రాహుల్ గాంధీకి అంత వేగంగా స్పందించగల నాయకత్వ ప్రతిభ కానీ, వ్యూహరచనా సామర్థ్యం కానీ ఉన్నట్లు ఇంతవరకు రుజువు కాలేదు. 


పరాజయ వాతావరణాన్ని విజయోన్ముఖంగా మార్చే సత్తా గల నాయకత్వం లేకపోయినా సరే, విజయ వాతావరణం పరాజయంగా మారుతుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిన ప్రతిపక్ష నేతల వల్లే ఇవాళ బిజెపికి తిరుగులేకుండా పోతోంది.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2021-11-17T06:15:23+05:30 IST