వైరస్‌పై పోరు

ABN , First Publish Date - 2021-12-30T06:30:31+05:30 IST

ఒమిక్రాన్ కేసులు ఊహించినట్టుగానే అతివేగంగా పెరిగిపోతున్న నేపథ్యంలో, ప్రధాని నరేంద్రమోదీ కొత్త టీకా విధానాన్ని ప్రకటించడం ద్వారా ప్రజలకు కాస్తంత మనోస్థైర్యాన్ని అందించే ప్రయత్నం చేశారు...

వైరస్‌పై పోరు

ఒమిక్రాన్ కేసులు ఊహించినట్టుగానే అతివేగంగా పెరిగిపోతున్న నేపథ్యంలో, ప్రధాని నరేంద్రమోదీ కొత్త టీకా విధానాన్ని ప్రకటించడం ద్వారా ప్రజలకు కాస్తంత మనోస్థైర్యాన్ని అందించే ప్రయత్నం చేశారు. వైరస్‌ను ఢీకొట్టడానికి టీకా తప్ప ప్రస్తుతానికి మరో బలమైన ఆయుధం లేదు. టీకా ప్రసాదించే రోగనిరోధకతను కూడా ఈ ఒమిక్రాన్ అత్యధికుల్లో దాటిపోతున్నదని సమాచారం అందుతున్న స్థితిలో వైరస్‌పై పోరాటం బహుముఖంగా సాగవలసిందే.


ప్రభుత్వ నిర్ణయాన్ని మెచ్చుకుంటూనే ఆలస్యంగా తీసుకున్నదని అనేకమంది నిపుణులు అంటున్నారు. రెండుడోసులు పోను, అదనంగా అనేక దేశాలు ఇప్పటికే ఇచ్చిన బూస్టర్ డోసును మనం ‘ప్రికాషన్’ డోసు అంటూ ఇప్పుడు కొందరికే అందిస్తున్నాం. టీకా సమర్థత అత్యధికుల్లో నాలుగునెలలు దాటినిలవడం లేదని కొన్ని విశ్లేషణలు ఒకపక్క అంటున్న స్థితిలో, ఈ డోసును రెండోడోసు తీసుకున్న 9నెలల తరువాత మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవాగ్జిన్ టీకాను పన్నెండేళ్ళు దాటినవారికీ ఇవ్వవచ్చునని డ్రగ్ కంట్రోలర్ అనుమతించగానే టీనేజర్ల టీకాలపై మోదీ ప్రకటన వెలువడింది. టీనేజర్లకు టీకాలు ఇవ్వడం, అనారోగ్య సమస్యలున్న పెద్దలకు, హెల్త్ వర్కర్లకు ముందుజాగ్రత్త డోసు ఒకటివేయడం ఒమిక్రాన్ తలుపుతట్టిన వేళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. నిజానికి దేశంలో టీకాలకు లోటేమీ లేదు. టీకాల ఉత్పత్తి ఒక దశలో అపరిమితమైన వేగం పుంజుకొని రాష్ట్రాల్లో అవి పోగుబడిన స్థితి. కోవిషీల్డ్, కోవాగ్జిన్లు కలిపి నెలకు ముప్పైకోట్ల డోసులు ఉత్పత్తి అవుతున్నాయనీ, రాష్ట్రాల దగ్గర కనీసం 20కోట్ల డోసులు పోగుబడివున్నాయని అంటున్నారు. పాలకపెద్దల పుట్టినరోజులు పురస్కరించుకొని అప్పుడప్పుడు ఈ టీకాకరణ రికార్డులకోసం వేగం పుంజుకుంటుంది కానీ, చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ అది దేశసగటుకంటే తక్కువే ఉంది. ఇక, రెండుడోసులూ తీసుకున్నవారు 43 శాతం, ఒక్కడోసు పడ్డవారు కూడా అరవై ఒక్కశాతమే. ఒక వేరియంట్ ప్రభావం కాస్తంత క్షీణించగానే కొత్తది రావడం కనిపిస్తూనే ఉన్నది. డెల్టా వేరియంట్ అతివేగంగా చుట్టుముట్టి మనకు మరిచిపోలేని విషాదాన్ని మిగిల్చింది. అది నేర్పిన పాఠంతో అడుగులు వడివడిగా వేస్తే, అన్ని వయస్సులవారికీ కనీసం రెండు డోసులూ పూర్తిచేసివుండేవారం, అధికులకు బూస్టర్ డోసు కూడా అందించగలిగేవాళ్ళం. వేవ్‌లు వచ్చినా రాకున్నా జనంలో రోగనిరోధకశక్తి నిలిచివుండేట్టు జాగ్రత్తపడవలసిందే. వాక్సిన్ విధానం, తయారీ, సరఫరాల్లో జాప్యం కారణంగా డోసుల మధ్య కాలాన్ని పెంచుకుంటూ పోయి, చివరకు ఇంతకాలం తరువాత కూడా అత్యధికులకు గరిష్టశక్తిని అందించలేకపోయాం. ఇప్పుడు ఒమిక్రాన్ వేవ్ అనుమానాల నేపథ్యంలో ప్రకటించిన చర్యలు ఏమాత్రం ఫలితాన్నిస్తాయో చూడాలి.


ఒమిక్రాన్ ప్రభావం ప్రధాని విదేశీపర్యటనలమీద ఉన్నది కానీ, రాష్ట్రాల ఎన్నికలమీద మాత్రం లేదు. క్రిస్మస్ నుంచి కొత్తసంవత్సర వేడుకలవరకూ అన్నింటిమీదా ఏవో నియంత్రణలున్నాయి కానీ, ఎన్నికల ప్రచారాన్నీ, లక్షలాదిమంది మోహరింపునూ ఎవరూ ఆపడం లేదు. మాస్కులూ, దూరాలు సామాన్యులకే కానీ, యోగుల బహిరంగసభలకు కాదు. కేంద్ర హోంమంత్రి మాత్రం తాము ఎంతో కష్టపడుతుంటే, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. ఎన్నికల సంఘం చెబితే వర్చువల్ సభలకు తాము సిద్ధమేనని కేంద్రంలోని అధికారపక్ష నేతలు హామీ ఇస్తున్నారు. ఒమిక్రాన్ కేసులు వేగంగా రెట్టింపవుతూ ఫిబ్రవరి నాటికే లక్షల్లోకి చేరుతాయని అంచనాలున్నప్పుడు ఎన్నికలను వాయిదావేయడం ఉత్తమం. ఎన్నికల సంఘం సత్వరమే ఆ నిర్ణయాన్ని తీసుకుంటే కోట్లాదిమందికి మేలు చేసినట్టవుతుంది. పాలకులు స్వయంగా కొవిడ్ ప్రవర్తనావళిని పాటిస్తే, ప్రజలు కూడా ఆ దారిలో నడుస్తారు. ఒమిక్రాన్ వంటి వేరియంట్లు మరిన్ని రావచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో కొత్త సంవత్సరంలో యావత్ ప్రపంచం పటిష్టమైన ప్రణాళికతో, సమష్టివ్యూహంతో ముందుకు కదలక తప్పదు. ఒమిక్రాన్ సృష్టి ఈ విషయాన్ని గుర్తుచేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా పేద, ధనిక అనే తేడాలేకుండా అన్నిదేశాలకూ సమానంగా వాక్సిన్ అందినప్పుడే ఈ వైరస్ ముప్పు తొలగిపోతుంది.

Updated Date - 2021-12-30T06:30:31+05:30 IST