కదంతొక్కిన తెలుగు తమ్ముళ్లు

ABN , First Publish Date - 2021-10-21T06:44:44+05:30 IST

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ దాడులకు నిరసనగా తెలుగు తమ్ముళ్లు కదంతొక్కారు.

కదంతొక్కిన తెలుగు తమ్ముళ్లు
చోడవరం ప్రధాన రహదారిలో బైక్‌ ర్యాలీ చేస్తున్న టీడీపీ శ్రేణులు

టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా బంద్‌

చోడవరం నియోజకవర్గంలో విజయవంతం

స్వచ్ఛందంగా దుకాణాలు మూసేసిన వ్యాపారులు

తెరచుకోని ప్రైవేటు విద్యా సంస్థలు

బ్యాంకులను మూయించిన నాయకులు

వడ్డాదిలో బంద్‌కు వ్యాపారుల సంఘీభావం


చోడవరం, అక్టోబరు 20: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ దాడులకు నిరసనగా తెలుగు తమ్ముళ్లు కదంతొక్కారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపు మేరకు చేపట్టిన బంద్‌ చోడవరం నియోజకవర్గంలో విజయవంతం చేశారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. ప్రైవేటు విద్యా సంస్థలు, కళాశాలలు తెరుచుకోలేదు. బ్యాంకులను తెరిచినా, టీడీపీ నేతల వినతి మేరకు తరువాత మూసివేశారు. అలాగే వడ్డాదిలో బంద్‌కు వ్యాపారులు సంఘీభావం తెలిపారు.

చోడవరంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గూనూరు మల్లునాయుడు ఆధ్వర్యంలో కార్యకర్తలు పట్టణంలో కలియతిరిగి బంద్‌ను పర్యవేక్షించారు. ప్రధాన రహదారిలో మోటారు బైకులపై ర్యాలీ నిర్వహించారు. వైసీపీ దాడులను నిరసిస్తూ సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుపడ్డారు. చోడవరంలో చాలా వ్యాపార సంస్థల ప్రతినిధులు బంద్‌కు సహకరించారు. ఈ కార్యక్రమంలో జట్పీటీసీ మాజీ సభ్యుడు కనిశెట్టి మత్స్యరాజు, పార్టీ మండల అధ్యక్షుడు బొడ్డేడ గంగాధర్‌, పట్టణ అధ్యక్షుడు దేవరపల్లి వెంకట అప్పారావు, మాల మహానాడు నాయకులు సియ్యాద్రి శ్రీనివాసరావు, ముడుసు గోవింద్‌, ఎంపీటీసీ సభ్యుడు కొట్టపు చిన్న, పార్టీ శ్రేణులు గొర్లె సుధాకర్‌, ఈర్లె శ్రీను, రేవళ్లు త్రినాఽథ్‌ పాల్గొన్నారు. 


బుచ్చెయ్యపేట: మండలంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు ఆధ్వర్యంలో  చేపట్టిన బంద్‌ విజయవంతమైంది. పార్టీ శ్రేణులు మండల వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టారు. వడ్డాదిలో సీఐ ఇలియాస్‌ మహ్మద్‌, ఎస్‌ఐ బి.రామకృష్ణ ర్యాలీని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ముందుగానే తాతయ్యబాబును పోలీసులు గృహ నిర్బంధం చేయగా, కార్యకర్తలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడతామని తాతయ్యబాబు ఇచ్చిన హమీ మేరకు సీఐ, ఎస్‌ఐలు వెనుదిరిగారు. నిరసన ర్యాలీలో రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ కార్యాలయాలపై దాడులు చేసిన చేసిన వారిని అరెస్టు చేసి శిక్షించాలని ఈ సందర్భంగా తాయ్యబాబు డిమాండ్‌ చేశారు. కాగా, బంద్‌కు వ్యాపారులు సంఘీభావం తెలిపి స్వచ్ఛందగా దుకాణాలను మూసి వేశారు. బ్యాంకులు, ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారు. కార్యక్రమంలో నాయకులు గోకివాడ కోటేశ్వరరావు, డొంకిన అప్పలనాయుడు, సుంకర సూరిబాబు, శిరిగిరిశెట్టి శ్రీరామూర్తి, తమరాన దాసు, దొడ్డి కిశోర్‌, దొండా గిరి, తలారి శంకరరావు, ఆదిరెడ్డి కనక, గొన్నాబత్తుల శ్రీనివాసరావు, కోరుకొండ రవికుమార్‌, బొబ్బాది రాజు పాల్గొన్నారు.


రావికమతం: టీడీపీ మండల అధ్యక్షుడు రాజాన కొండనాయుడు ఆధ్వర్యంలో బంద్‌ జరిగింది. గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికార పార్టీ నాయకులు గుండాల మాదిరిగా పార్టీ కార్యాలయాలు, నాయకుల ఇళ్లు ధ్వంసం చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని దుమ్మెత్తిపోశారు. ఈ గుండాగిరి ఎన్నాళ్లూ సాగదని స్పష్టం చేశారు. కాగా, టీడీపీ ఆందోళనను పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. కార్యక్రమంలో అర్జాపురం సర్పంచ్‌ మడగల ఫాల్గుణ, రావికమతం ఉప సర్పంచ్‌ గంజి మోదునాయుడు, నాయుకులు గంజి సూర్యనారాయణ, రమణ, తాతలు, ఈశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.


రోలుగుంట: మండల కేంద్రంలోని బీఎన్‌ రోడ్డుపై టీడీపీ నాయకులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. వైసీపీ దాడులను ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. టీడీపీ పార్టీ కార్యాలయాలపై దాడులు హేయమైన చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో రోలుగుంట ఎంపీటీసీ సభ్యుడు సుర్ల రామకృష్ణ, పార్టీ శ్రేణులు ఓనుం శ్రీనువాసరావు, సత్యనారాయణ, శ్రీనివాసరావు, నాయుడు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-21T06:44:44+05:30 IST