‘ఉక్కు’ సంకల్పంతో హక్కుల పోరు

ABN , First Publish Date - 2021-02-18T06:06:10+05:30 IST

అశేష ఆంధ్ర ప్రజానీకం ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో చేసిన మహోద్యమం, త్యాగాల ఫలితంగా విశాఖ సాగరతీరంలో...

‘ఉక్కు’ సంకల్పంతో హక్కుల పోరు

అశేష ఆంధ్ర ప్రజానీకం ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో చేసిన మహోద్యమం, త్యాగాల ఫలితంగా విశాఖ సాగరతీరంలో కేంద్రప్రభుత్వరంగంలో ఆవిర్భవించిన సమీకృత ఉక్కు కర్మాగారం విశాఖ ఉక్కు పరిశ్రమ. 22 వేల ఎకరాల భూమి, యంత్రపరికరాలు, భవనాలు, 7.3 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించిన విశాఖ ఉక్కు కర్మాగారం విలువ 3.20 లక్షల కోట్ల రూపాయలుగా హిందూ పత్రిక అంచనా వేసింది. ప్లాంటు మూల పెట్టుబడి కేవలం రూ.889 కోట్లుగా లెక్కకట్టి కారుచౌకగా అమ్మకానికి పెట్టింది కేంద్ర ప్రభుత్వం. 1970 దశకంలో రైతుల నుంచి భూములు సేకరించినప్పుడు వారికి 47 కోట్ల రూపాయలు చెల్లించగా, 2020లోనూ భూములను అంతే మొత్తంగా విలువ కట్టారు. ఉక్కు ప్లాంటులో 51 శాతం వాటాలకు రూ.2500 కోట్లు పెట్టుబడి పెడితే, 2లక్షల కోట్లకు పైగా ఆస్తులు ప్రైవేటువారికి ధారాదత్తమవుతాయి. 2003–-2015 సంవత్సరాలలో అత్యధిక లాభాలను గడించిన విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులను కేంద్ర ప్రభుత్వం కేటాయించలేదు. ఫలితంగా ఉత్పత్తి ఖర్చు ఎక్కువయింది. ప్లాంటు విస్తరణ సమయంలో, నష్టాల సమయంలో కేంద్రం ఎటువంటి ఆర్థిక సాయం చేయలేదు. అయినా పన్నులు, డివిడెండ్ల రూపంలో 42 వేల కోట్లకు పైగా కేంద్రానికి విశాఖ ఉక్కు చెల్లించింది. దాదాపు 30 వేల మందికి ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా ఉపాధి కల్పించిన ఉక్కు కర్మాగారం విశాఖ పట్టణం ఆర్థిక, సామాజిక ముఖచిత్రాన్నే మార్చివేసింది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో విశాఖ అత్యధిక జిడిపి ఆర్జించే నగరం అయింది. నేడు ఏపీలో మిగిలిన ఏకైక భారీ పరిశ్రమ విశాఖ ఉక్కు. ప్రస్తుతం వస్తున్న నష్టాలను సాకుగా చూపి ఈ పరిశ్రమను అమ్మకానికి పెట్టింది కేంద్రప్రభుత్వం. ఫిబ్రవరి 18 విశాఖ ఉక్కు ఆవిర్భవించిన రోజు. ఈ సందర్భంగా ప్రభుత్వరంగంలోనే ఈ పరిశ్రమ కొనసాగాలని కార్మికులు మరోసారి ఉద్యమబాట పట్టారు. యావత ఆంధ్ర ప్రజానీకం వారితో గొంతు కలిపింది. కుల, మత, ప్రాంతాల వారీగా ప్రజల్ని విడగొట్టి పాలించే కుట్రలను ఎదుర్కోవాలి. ఈ పరిశ్రమకు కేంద్రప్రభుత్వం సొంత గనులు కేటాయించి ఆదుకోవాలి.

అవధానుల హరి

Updated Date - 2021-02-18T06:06:10+05:30 IST