రైతు వ్యతిరేక చట్టాలు రద్దయ్యే వరకు పోరాటం

ABN , First Publish Date - 2021-01-27T05:53:17+05:30 IST

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదని రైతు సంఘం, సీపీఎం జిల్లా కార్యదర్శులు జయరాజ్‌, మల్లేశం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బాగారెడ్డి స్పష్టం చేశారు.

రైతు వ్యతిరేక చట్టాలు రద్దయ్యే వరకు పోరాటం
సంగారెడ్డిలో బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న సీపీఎం, రైతు సంఘాల నాయకులు

 రైతు సంఘం, సీపీఎం నాయకులు 

 సంగారెడ్డిలో బైక్‌ ర్యాలీ


సంగారెడ్డి రూరల్‌, జనవరి 26: రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదని రైతు సంఘం, సీపీఎం జిల్లా కార్యదర్శులు జయరాజ్‌, మల్లేశం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బాగారెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం తెచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ మంగళవారం ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ కిసాన్‌ ర్యాలీకి మద్దతుగా సంగారెడ్డిలో సీపీఎం ఆధ్వర్యంలో పాత బస్టాండ్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్పొరేట్లకు వ్యవసాయ రంగాన్ని తాకట్టు పెట్టేలా ఉన్న చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రెండు నెలలుగా విపరీతమైన చలిలో ఢిల్లీ కేంద్రంలో రైతులు దీక్ష చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ద్వంద వైఖరితో రైతులకు తీరని నష్టం జరుగుతున్నదని చెప్పారు. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించడం దారుణమన్నారు. పంటలను మళ్లీ దళారుల పాలు చేసే కుట్రలను ప్రజలు గమనించి రైతు చట్టాలను రద్దు చేసే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు జి.సాయిలు, యాదగిరి, ప్రవీణ్‌, నర్సింహులు, రమేశ్‌, రాజయ్య, ఖాజా, అశోక్‌, బాల్‌రాజ్‌, పాండు, రంగారెడ్డి, వాజిద్‌అలీ, ప్రసన్న, నాగభూషణం, సుధాకర్‌, కొండల్‌రెడ్డి, సురేశ్‌, సుబాన్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-27T05:53:17+05:30 IST