ప్రజలారా పోరాడండి!

ABN , First Publish Date - 2022-07-07T07:56:33+05:30 IST

ప్రజలారా పోరాడండి!

ప్రజలారా పోరాడండి!

బడులు మూస్తే తిరగబడండి

నాడు మేం ఊరూరా బడులు పెట్టాం

నేడు 8 వేల స్కూళ్లు మూసేస్తున్నారు

అరశాతం అప్పు కోసం దారుణాలు

జగన్‌ కుమార్తెలు విదేశాల్లో చదవాలి

ఇక్కడి పేద పిల్లలు వాగులు, వంకలు

దాటుకుని పాఠశాలలకు వెళ్లాలా?

జగన్‌ చదువుకోలేదు కాబట్టే

ఇతరులు చదువుకుంటే భరించలేడు

సాగు మోటార్లకు మీటర్లు ఉరితాళ్లే

దీనిని టీడీపీ అంగీక రించదు

‘జే’ మద్యం.. ఆరోగ్యంతో చెలగాటం


పోరుకు ఇంటికొకరు సిద్ధంగా ఉండాలి

కేసులకు భయపడితే భవిష్యత్‌ అన్యాయం


పాదయాత్రలో ముద్దులు.. నేడు పన్నుల గుద్దులు

కుల వృత్తులపైనా ‘పన్ను బాదుడు’


మూడేళ్లలో 30 ఏళ్లు వెనక్కి.. మదనపల్లె మినీ మహానాడులో జగన్‌పై బాబు నిప్పులు

ప్రతి ఊరిలోనూ పాఠశాల ఉండడం ఆ ఊరి హక్కు. ఐదేళ్ల వయసున్న పిల్లలు మూడు కిలోమీటర్ల దూరం నడిచి పాఠశాలకు వెళ్లాలనడం దుర్మార్గం. దీనివల్ల బడికి వెళ్లే పిల్లల సంఖ్య భారీగా తగ్గిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత చర్య విద్యా వ్యవస్థకు పెద్ద దెబ్బ. - చంద్రబాబు


రాయచోటి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ‘జగన్‌రెడ్డి తన ఇద్దరు కూతుళ్లను విదేశాల్లో చదివించుకుంటున్నారు. తన కుమార్తెలు ఒకరు పారి్‌సలో, ఒకరు లండన్‌లో చదవాలి. కానీ పేద పిల్లలు వాగులు, వంకలు దాటుకుని స్కూలుకు వెళ్లాలా..’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నిలదీశారు. హేతుబద్ధీకరణ పేరిట సుమారు 8 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్నారని.. దీనిపై ప్రజలు తిరగబడాలని పిలుపిచ్చారు. రైతులు వినియోగించే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం రైతుల మెడలకు ఉరితాళ్లు వేయడమేనని.. దీనిని తెలుగుదేశం అంగీకరించదని తేల్చిచెప్పారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బుధవారం జరిగిన మినీ మహానాడు బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘మేం అధికారంలో ఉన్నప్పుడు మూడు కిలోమీటర్లకు ఒక స్కూల్‌, 5 కిలోమీటర్లకు ఒక హైస్కూల్‌, మండలానికో కాలేజీ ఏర్పాటు చేశాం. నేను తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో ఎంఏ ఎకనామిక్స్‌ చదివాను. అయితే వైఎస్‌ జగన్‌ ఎక్కడ చదివారో చెప్పగలరా? ఆయన చదువుకోలేదు కాబట్టే ఇతరులు చదువుకోవడం ఆయన భరించలేడు. కేంద్రం అర్ధశాతం అప్పు ఇచ్చిందని, దాని కోసం ఈ స్కూళ్లు మూసేశారు. అధికారం కోసం పాదయాత్ర పేరుతో రాష్ట్రమంతా తిరిగి ప్రజలకు ముద్దులు పెట్టిన జగన్‌.. ఇప్పుడు పన్నుల పేరుతో పిడుగుద్దులు గుద్దుతున్నారు. మీ ఊర్లలో స్కూళ్లను మూసివేస్తే ఆయా గ్రామాల వైసీపీ నేతలను బహిష్కరించండి’ అని ప్రజలను కోరారు. వారు చేసే పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు. ఇంకా ఏమన్నారంటే..


అప్పుల కోసమే సాగు మీటర్లు..

వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపును టీడీపీ వ్యతిరేకిస్తోంది. అప్పులు తెచ్చుకోవడం కోసమే జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో లేని సమస్యలన్నీ సృష్టిస్తున్నారు. ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు.. బెదిరిస్తున్నారు. జనం మినీ మహానాడుకు రాకుండా పుంగనూరులో వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. వైసీపీ దొంగల్లారా.. జాగ్రత్త! నేను కన్నెర్ర చేస్తే ఇంట్లో నుంచి బయటకు రాలేరు. 


ఆ మద్యంలో కెమికల్స్‌..

రాష్ట్రంలో జే బ్రాండ్‌ మద్యంతో ప్రజల ఆరోగ్యంతో జగన్‌ చెలగాటమాడుతున్నాడు. బూమ్‌ బూమ్‌, ప్రెసిడెంట్‌ మెడల్‌, ఆంధ్రాగోల్డ్‌ వంటి పేర్లతో మద్యం వ్యాపారం చేస్తున్నాడు. ఈ మద్యం తాగితే కొన్ని రోజుల తర్వాత మతిమరుపు వస్తుంది. అనారోగ్యంతో అనేక సమస్యలు వస్తాయి. లేబొరేటరీలో పరీక్ష చేయిస్తే అందులో కెమికల్స్‌ ఉన్నాయని రుజువైంది.


కులవృత్తులపైనా పన్ను: ఇప్పుడు చెత్తపై పన్నులు వేస్తున్నారు. రేపోమాపో వృత్తిపైన కూడా పిచ్చి తుగ్లక్‌లాగా జగన్‌ పన్ను వేస్తాడేమో! వడ్రంగి, నాయీబ్రాహ్మణులు వంటి కులవృత్తుల ఆదాయంపైనా పన్ను వేయడం దుర్మార్గం. ఇలా ఏటా రూ.5 వేల కోట్లు బాదేందుకు సిద్ధంగా ఉన్నాడు.  


కేంద్రం మెడలు కాదు.. ఈయన నడుం వంచాడు

ప్రత్యేక హోదా వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పిన జగన్‌ ఇప్పుడు ఆ ఊసు ఎందుకు ఎత్తలేదు. తాను అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచుతానన్న జగన్‌ ఇప్పుడు కేంద్రం ముందు నడుం వంచాడు. విభజన హామీలను సాధించలేకపోయాడు. ఈ మూడేళ్లలో రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాడు. 


రోడ్లపైనే ప్రసవం..

మా ప్రభుత్వంలో అద్దాల మాదిరిగా ఉన్న రోడ్లు ప్రస్తుతం గుంతల మయమయ్యాయి. కొత్త రోడ్ల సంగతి అటుంచి రోడ్లపైన ఉన్న గుంతలను పూడ్చలేకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న రోడ్లపైన గర్భిణులు ప్రయాణం చేస్తే ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ప్రసవిస్తారు. ఒక్క డ్రైనేజీ కూడా కట్టలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతాననడం హాస్యాస్పదం. జిల్లాల ఏర్పాటులో ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న మదనపల్లెకు తీవ్ర అన్యాయం జరిగింది. మేం అధికారంలోకి వస్తే మదనపల్లెకు న్యాయం చేసి తప్పు సరిచేస్తాం. 


సుప్రీంకోర్టు చెప్పినా లెక్కలేదు

సోషల్‌ మీడియాలో పోస్టులపై ఎటువంటి అరెస్టులు చేయకూడదని సుప్రీంకోర్టు  స్పష్టంగా చెప్పినా రాష్ట్రంలో 600 కేసులు పెట్టారు. 180 మందిని అరెస్టు చేశారు. 41ఏ నోటీసు ఇచ్చే కేసుల్లో కూడా అరెస్టులు చేస్తున్నారు. కొందరు పోలీసులు పూర్తి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. మేమొస్తే అటువంటి వారిపై చర్యలు తప్పవు. ప్రత్యేక ట్రైబ్యునల్‌ వేసి చర్యలు తీసుకుంటాం. అన్నా అన్నా అంటూనే గౌతమ్‌ సవాంగ్‌కు తోక కోసి సున్నం పెట్టాడు. జగన్‌ సొంత చిన్నాన్న వివేకానందరెడ్డిని ఎవరో చంపితే నారాసుర రక్త చరిత్ర పేరుతో తన పత్రికలో వార్త రాశారు. ఈ తప్పుడు వార్త రాసినందుకు సాక్షి చైర్‌ప ర్సన్‌ భారతీ రెడ్డిని అరెస్టు చేయాలి కదా! సీఐడీలో ఒక రాసలీల సీఐ ఇష్టమొచ్చినట్లు చెలరేగిపోతున్నాడు. మేం అధికారంలోకి వస్తే వదిలేది లేదు. సొంత పార్టీకే చెందిన ఎంపీ రఘురామరాజును అక్రమంగా అరెస్టు చేసి సీఐడీ అధికారులు విపరీతంగా కొట్టారు. ఇటీవల ప్రధాన మంత్రి పాల్గొంటున్న కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న ఆయన్ను అడ్డుకున్నారు. ఆయన  ప్రయాణం చేసే రైలునే కాల్చడానికి సిద్ధపడ్డారు. రాష్ట్రంలో నవరత్నాలు స్థానంలో నవఘోరాలు జరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో జగన్‌రెడ్డి ఒక లక్షా 75 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. 


రాజంపేట మీ తాత జాగీరు కాదు

మా హయాంలో డ్రిప్‌ ఇరిగేషన్‌ ఇచ్చాం. విత్తనాలు కూడా ఇచ్చా. రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దాలనుకున్నా. ఇప్పుడా పరిస్థితి లేదు. వైసీపీ అధికారం చేపట్టి మూడేళ్లయినా చిత్తూరు జిల్లాకు చుక్క నీరు కూడా రాలేదు. మంత్రి పెద్దిరెడ్డి, ఆయన తమ్ముడు, కొడుకు రౌడీరాజ్యం ఏలుతున్నారు. రాజంపేట పార్లమెంట్‌ మీ తాత జాగీరు కాదు. 


ఎన్టీఆర్‌ ఒక శక్తి

న్యాయం కోసం పోరాడుతున్న టీడీపీ కోసం వరుణదేవుడు కరుణించాడు. రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత టీడీపీ నాయకులు చేపట్టాలని ప్రతినబూనాలి. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. ఎన్టీఆర్‌ ఒక వ్యక్తి కాదు.. శక్తి, వ్యవస్థ. ఆయన్ను తలచుకుంటే ధైర్యం, శక్తి వస్తాయి. 


జగన్‌రెడ్డి తన సొంత మనుషుల కోసం మద్యం వ్యాపారం చేస్తున్నారు. మద్యం షాపుల్లో మద్యం కొనుగోలు చేస్తే బిల్లులు ఇవ్వడం లేదు. నగదు మాత్రమే చేతికి ఇవ్వాలి.. ఆన్‌లైన్‌ చెల్లింపులు అంగీకరించడం లేదు.

- చంద్రబాబు


వర్షంలో తడుస్తూనే...

అనుకున్న సమయానికే కర్ణాటక సరిహద్దు నుంచి చంద్రబాబు మన రాష్ట్రంలో అడుగుపెట్టారు. మదనపల్లె మండలం చీకలబయలులో ఆయనకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. సుమారు 5 వేల ద్విచక్రవాహనాలతో తెలుగు తమ్ముళ్లు ర్యాలీతో స్వాగతం పలికారు. కర్ణాటక రాష్ట్రం చింతామణి నుంచి మదనపల్లె వరకు హోర్డింగులు, పసుపు జెండాలతో నిండిపోయింది. చీలకబయలు నుంచి చంద్రబాబు రోడ్‌ షో నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు వర్షం పడుతున్నా లెక్క చేయకుండా ఎదురుచూశారు. దారి పొడవునా నీరాజనాలు పలికారు. సాయంత్రం 4 గంటలకు మదనపల్లె సరిహద్దుకు చేరుకున్న చంద్రబాబు.. కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువకులు రావడంతో వారిని ఉత్తేజపరుస్తూ గంటన్నర సేపు ప్రసంగించారు. సభకు దాదాపు లక్ష మంది వచ్చారని అంచనా వేశారు. 


లక్షా 60 వేల టీచర్‌ ఉద్యోగాలిచ్చాం

నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద సంఖ్యలో టీచర్లు, పోలీసు ఉద్యోగాలు ఇచ్చా. నేను ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తే జగన్‌రెడ్డి వలంటీర్‌ ఉద్యోగాలతో సరిపెట్టాడు. లక్షా 60 వేల టీచర్ల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత టీడీపీదే. ఇప్పుడు జగన్‌రెడ్డి ప్రకటించిన జాబ్‌ కేలెండర్‌ ఊసెక్కడ? నేను నిరుద్యోగ భృతి ఇస్తే జగన్‌ దాన్ని తీసేశాడు. ఆడపిల్లలు స్కూళ్లకు వెళ్లేందుకు సైకిళ్లు ఇచ్చా.. జగన్‌ రాగానే ఆపేశాడు. ప్రతి విద్యార్థికి అమ్మఒడి ఇచ్చానని ప్రకటించి.. ఇప్పుడు 75 శాతం హాజరు, 300 యూనిట్లు కరెంటు వాడకం వంటి ఆంక్షలు పెట్టడం నిలువునా మోసం చేయడమే. అమ్మ ఒడి బూటకం.. ఇంగ్లీష్‌ మీడియం ఒక నాటకం.. నాడు-నేడు అవినీతిమయం. ఆర్టీసీ ధరలు మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయి. నేను దీపం పథకం ప్రవేశపెడితే జగన్‌ దానిని ఆర్పివేస్తూ గ్యాస్‌ ధరలు పెంచారు. ప్రస్తుతం వంట గ్యాస్‌ కొనే స్థితిలో మహిళలు లేరు, మళ్లీ కట్టెల పొయ్యిలే దిక్కయ్యేలా ఉన్నాయి. కోడిగుడ్లు, చికెన్‌ ధరలు కూడా సామాన్యులకు అందనంత దూరంలో ఉన్నాయి. ముస్లిం మైనారిటీల పెళ్లి ఖర్చులకు మేం దుల్హన్‌ పథకాన్ని ప్రవేశపెడితే జగన్‌ రద్దు చేశాడు. అన్న క్యాంటీన్లు,  చంద్రన్న బీమా, సంక్రాంతి కానుక.. అన్నింటినీ తీసేశాడు.



Updated Date - 2022-07-07T07:56:33+05:30 IST