పేరు మార్పుపై పోరు

ABN , First Publish Date - 2022-09-23T08:15:00+05:30 IST

పేరు మార్పుపై పోరు

పేరు మార్పుపై పోరు

ఎన్టీఆర్‌ పేరు తొలగింపుపై టీడీపీ ఆందోళన

పొర్లు దండాలతో అభిమానుల నిరసనలు

జగన్‌ దిష్టిబొమ్మలు, బిల్లు ప్రతులు దహనం

ఎన్టీఆర్‌ విగ్రహాలకు పాలాభిషేకాలు

వందలాదిగా రోడ్డెక్కిన తమ్ముళ్లు

నెల్లూరులో ఎన్టీఆర్‌ విగ్రహానికి టీడీపీ నాయకుల పాలాభిషేకం

అభిమానం.. ఆగ్రహం

ఎన్టీఆర్‌ విగ్రహాలకు పాలాభిషేకాలు.. నిరసనలు


ఎన్టీఆర్‌ వర్సిటీ పేరు మార్పుపై టీడీపీ నేతలు ఆందోళన ఉధృతం చేశారు. ఎక్కడికక్కడ బిల్లు ప్రతులను దహనం చేశారు. సీఎం జగన్‌ దిష్టిబొమ్మలను చెప్పులతో కొడుతూ.. నిప్పంటించి ఆగ్రహం వ్యక్తంచేశారు. 


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా గురువారం కూడా టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేశాయి. ఉమ్మడి అనంతపురం జిల్లావ్యాప్తంగా టీడీపీ శ్రేణుల నిరసనలు కొనసాగాయి. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాయదుర్గంలో బిల్లు ప్రతులను దహనం చేశారు. కళ్యాణదుర్గంలో సీఎం జగన్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతపురంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. వజ్రకరూరు మండలంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. గుంతకల్లు-ఉరవకొండ ప్రధాన రహదారిపై భైఠాయించి నిరసన తెలిపారు. అక్కడే ఎన్టీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్లలో బీకే పార్థసారథి ఆధ్వర్యంలో ర్యాలీ జరిపారు. హిందూపురం మండలం మిట్టమీదపల్లి క్రాస్‌లో టీడీపీ నాయకులు రోడ్డుపై పొర్లుదండాలు పెడుతూ నిరసన తెలిపారు. శ్రీకాకుళం, నరసన్నపేటల్లో బిల్లు ప్రతులను దహనం చేశారు. కోటబొమ్మాళిలో ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆధ్వర్యంలో బిల్లు ప్రతులను దహనం చేశారు. ఏలూరు జిల్లాలోని ఏలూరు, భీమడోలు, పెదపాడు మండలం కొత్తూరు, గణపవరం మండలం మొయ్యేరు తదితర ప్రాంతాల్లో ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకాలు చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో నెట్టెం రఘురామ్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిపారు. కృష్ణా జిల్లా పోరంకి సెంటర్‌లో టీడీపీ నాయకుడు బొంగరాల అబ్రహం గుండు కొట్టించుకుని నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా పాణ్యంలో గౌరు చరిత ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు జాతీయ రహదారిపై బైఠాయించారు. నెల్లూరు జిల్లాలోనూ ఆందోళనలు మిన్నంటాయి. 



Updated Date - 2022-09-23T08:15:00+05:30 IST